Indraganti mohana krishna: రూ.3,500తో సినిమా తీశా: ఇంద్రగంటి మోహనకృష్ణ

సాహిత్య వారసత్వాన్ని పునికిపుచ్చుకుని.. సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ(Indraganti Mohana Krishna). మొదటి సినిమాతోనే కేంద్ర, రాష్ట్ర పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 

Published : 13 Dec 2022 14:23 IST

సాహిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ(Indraganti Mohana Krishna). మొదటి సినిమాతోనే కేంద్ర, రాష్ట్ర పురస్కారాలు సొంతం చేసుకున్నారు. తర్వాత మయాబజార్‌, అష్టాచమ్మా సినిమాలతో సామాన్య ప్రేక్షకుల హృదయాల్లో చెదిరిపోని ముద్ర వేసుకున్నారు. జెంటిల్‌మెన్‌, సమ్మోహనం చిత్రాలకు దర్శకత్వం వహించి సినిమా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. టాలీవుడ్‌లో డీసెంట్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఈటీవీ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దాం.

మీ దృష్టిలో అసలు సినిమా అంటే ఏంటి?మీరు సినిమాలు అవార్డుల కోసం తీస్తారా?

ఇంద్రగంటి: ప్రేక్షకులు లేనిదే కళాకారులు లేరు. ఏ సినిమా కూడా అవార్డు కోసం తీయరు. ప్రేక్షకులను వినోదంతోనే ఆలోచింపజేయాలని చూస్తా. వాళ్ల విలువైన డబ్బును, సమయాన్ని వృథా చేయకుండా సినిమా చూసి వెళ్లాక.. వాళ్లకు మంచి అనుభూతి ఉండాలని కోరుకుంటా.  

మీ బాల్యం గురించి చెప్పండి?

ఇంద్రగంటి: నేను పుట్టింది తణుకు. పెరిగిందంతా విజయవాడ. మా నాన్న బాపు-రమణలకు స్నేహితుడు. అప్పట్లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాకు సంబంధించిన రీల్‌ను బాపుగారు మా ఇంటికి తీసుకు వచ్చారు. అదే మొదటిసారి నేను సినిమా రీల్‌ను చూడడం. ఇక విజయవాడలో ఉన్న లీలామహల్‌, నవరంగ్‌, ఊర్వశీ  థియేటర్‌లు నాకు విద్యాలయాలాంటివి. అక్కడే నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. నేను దర్శకత్వం వహించిన అష్టాచమ్మా సినిమా ఆ థియేటర్లలో ప్రదర్శించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. మా ఇంట్లో వాళ్లు కూడా సినిమా రంగంపై మంచి ఉద్దేశంతో ఉండే వాళ్లు. అందుకే నన్ను ఎప్పుడూ ఇటు వైపు వద్దు అని చెప్పలేదు. 

మీ తాత, నాన్న ఇద్దరికీ సాహిత్యంపై పట్టు ఉందని, అందుకే మీకు తెలుగుపై మక్కువ కలిగిందని అంటుంటారు నిజమేనా?

ఇంద్రగంటి: నా 15వ ఏట మా తాతగారు చనిపోయారు. కానీ అప్పటి వరకు నాకు సంస్కృతంలో శ్లోకాలు నేర్పించి అర్థాలు చెప్పేవారు. ఇక సాహిత్యం అనేది మా జీవితాల్లో అంతర్భాగం. మా ఇంటికి ఎప్పుడూ సాహితీవేత్తలు వస్తుండేవారు. ప్రముఖ గాయని సుశీల గారి దగ్గర మా అమ్మ పని చేశారు. ఆ తర్వాత ఆర్టీసీలో ఉద్యోగం వచ్చి అక్కడ నుంచి వచ్చేశారు. 

ఆల్‌ ఇండియా రేడియోలో పని చేసే అవకాశం ఎలా వచ్చింది?

ఇంద్రగంటి: మా ఇంట్లో ఎప్పుడూ రికమెండేషన్‌ అనే మాట వినిపించదు. మా నాన్న గారు ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేసేవారు. అక్కడ సి. రామ్‌మోహన్‌రావు గారు పరిచయమయ్యారు. ఆయన ఒకసారి నన్ను పిలిచి స్క్రిప్ట్‌ ఇచ్చి చదవమన్నారు. బాగా చదివానని రేడియోలో ధారావాహికలో పాత్ర ఇచ్చారు. అక్కడకు చాగంటి సోమయాజులు, సి.నారాయణ రెడ్డి గారు వస్తుండే వారు వాళ్లందరితో మాట్లాడుతుండే వాడిని. ఇంటర్‌ వరకు విజయవాడలోనే చదివాను. డిగ్రీ కోసం హైదరాబాద్‌ వచ్చాను. నేను రాగానే మా తల్లిదండ్రులు కూడా వచ్చేశారు. 

మిమ్మల్ని ప్రభావితం చేసిన సినిమా ఏది?

ఇంద్రగంటి: రామ్‌ గోపాల్‌ వర్మ ‘శివ’ సినిమా నాపై చాలా ప్రభావం చూపింది. ఆ తర్వాత మణిరత్నం గారి సినిమాలు చాలా నచ్చేవి. కానీ దర్శకుడు అవ్వాలి అని చిన్నప్పుడే అనిపించింది. 10వ తరగతిలోనే నేను చూసిన సినిమాల గురించి మా స్నేహితులకు చెప్పేవాడిని. ఇక సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు టీవీ సీరియల్ ఎపిసోడ్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. 

చలం పుస్తకాన్ని సినిమాగా తీయాలని ఎందుకు అనిపించింది?

ఇంద్రగంటి: నాకు చలం రచనలు చాలా ఇష్టం. ఆయన రాసిన ‘దోషగుణం’ కథ చదివాను. ఇది సినిమాగా తీస్తే బాగుంటుందని నాకు తెలిసినట్లు స్క్రిప్ట్‌ రాసుకున్నా. కెనడాలో ఫిల్మ్‌ స్కూల్‌లో చదువుకోడానికి వెళ్లేప్పుడు ఆ స్క్రిప్ట్‌నే శాంపిల్‌గా పంపించాను. అక్కడ నుంచి వచ్చేశాక 2003లో దానితో గ్రహణం అనే సినిమా తీశాను. 

గ్రహణం సినిమా అనుభవాల గురించి చెప్పండి?

ఇంద్రగంటి: ఈ సినిమా కంటే ముందు నేను ‘చలి’ అని చిన్న షార్ట్‌ ఫిల్మ్‌ తీశాను. కేవలం రూ.3,500 ఖర్చు అయింది.  తక్కువ ఖర్చుతో సినిమా తీశానని అప్పట్లో ఈటీవీ న్యూస్‌లో కూడా వేశారు. దాని షూటింగ్‌ మొత్తం ఇంట్లోనే చేశా. మా ఫ్రెండ్స్‌ నటించారు. డబ్బింగ్‌ కూడా ఇంట్లోనే చెప్పాం. ప్రకాశ్‌ రెడ్డి గారు సారథి స్టూడియోస్‌ ఫిల్మ్‌క్లబ్‌లో ఆ సినిమాను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చారు. దానికి భరణి వచ్చారు. చాలాబాగా తీశానని సినిమాలు తీయచ్చు కదా అన్నారు. అప్పుడు గ్రహణం స్క్రిప్ట్‌ చూపించాను. బాగుందని చెప్పారు. ఆ సినిమాలోని తారాగణంగా ఎవరు ఉండాలని కూడా ఆయనే చెప్పారు. ఆరు లక్షలతో తీశాను. అంతేకాదు గ్రహణం సినిమా మొట్టమొదటి డిజిటల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌. సినిమా చూసిన వాళ్లందరూ బాగుందని చెప్పడంతో భరణి గారు నేషనల్‌ అవార్డ్స్‌కు పంపారు. దీని కోసం డిజిటల్‌ నుంచి ఫిల్మ్‌లోకి మార్చడానికి 11 లక్షలు ఖర్చు అయింది. దానికి ఉత్తమ చిత్రంగా నేషనల్‌ అవార్డు వచ్చింది. నిజంగా షాక్‌ అయ్యాను.

అష్టాచమ్మా సినిమా తీయాలని ఎప్పుడు అనుకున్నారు?

ఇంద్రగంటి: నేను గ్రంథాలయంలో ఒకసారి ఇంగ్లిషు నాటకం చదివాను. దానిని సినిమాగా తీస్తే బాగుంటుందని అనుకున్నా. 2008లో అష్టాచమ్మా పేరుతో తీశాను. మంచి విజయం సాధించింది. దానికి ముందు 2006లో మాయబజార్‌ సినిమా తీశాను. అది ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

మీరు తీసిన బందిపోటు సినిమా ఎందుకు అలరించలేకపోయింది?

ఇంద్రగంటి: ప్రత్యేక కారణం లేదు. కొన్ని నవలలు కలిపి ఆ సినిమా తీశాను. నరేష్‌తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఆయనకు అప్పటికే మంచి కామెడీ హీరోగా పేరుంది. నేను ఆయన్ని కొత్తగా చూపించానేమో అది ఒక కారణం అయిఉండచ్చు.

మీరు ఇంగ్లిషు నవలలను తెలుగు సినిమాలుగా తీస్తున్నారంటే.. మీకు తెలుగు, ఇంగ్లిషు రెండు భాషలపై పట్టు ఉందా?

ఇంద్రగంటి: ఇది చాలా పెద్ద ప్రాసెస్‌. ముందు భాషను అనువాదం చేయాలి. తర్వాత సినిమాకు తగట్లు రాసుకోవాలి. ఈ మధ్యలో చాలా మార్పులు చేస్తాను. ఒక్కోసారి కొన్ని పాత్రలు కలపాల్సి వస్తుంది. కొన్ని సార్లు తీసేయాల్సి వస్తుంది. ఎలాంటి మార్పులు చేయాలనేది ముఖ్యం. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

మీ సినిమాల్లో మహిళలకు పెద్దపీట వేస్తారంటారు నిజమేనా?

ఇంద్రగంటి: నేనేమీ ఉద్యమ స్ఫూర్తితో మహిళలను గొప్పగా చూపిస్తున్నాను అని చెప్పను కానీ నేను సమానత్వాన్ని నమ్ముతాను. స్త్రీ వాదిని అని చెప్పుకోడానికి భయపడను. నేను  మహిళల పాత్రలను రాసేప్పుడు వాళ్లకు ప్రాముఖ్యం ఉండేలా చూస్తాను. ఒక స్త్రీ తనకు నచ్చినట్లు తను ఉండాలనేది నేను నమ్ముతాను. 

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన వాళ్లు మాత్రమే డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోగలుగుతున్నారు? దీనిపై మీ అభిప్రాయం?

ఇంద్రగంటి: సినిమా దర్శకుడు నిరంతర విద్యార్థి అనేలా ఉండాలి. ప్రతి సినిమాకు పొరపాట్లు చేస్తుంటాం. అయితే చేసిన తప్పులే మళ్లీ చేయకుండా జాగ్రత్తపడుతుండాలి. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండే వ్యక్తి జీవితంలో వైఫల్యాలు తక్కువ ఎదురవుతాయన్నది నా అభిప్రాయం.

మీ సినిమా చూసి రామ్‌ గోపాల్‌ వర్మ అవకాశం ఇచ్చారట? సినిమా తీశాక బాలేదని అన్నారట?

ఇంద్రగంటి: రామ్‌ గోపాల్‌ వర్మ మాటలు పైకి కఠినంగా ఉన్నా అందులో నిజాలు ఉంటాయి. నేను చేసిన చలి సినిమా చూసి ఆయన నాకు ఓ కథ ఇచ్చి సినిమా తీయమన్నారు. కానీ అది ఆయనకు నచ్చలేదు. ఆయన అనుకున్నట్లు రాలేదని నచ్చలేదని చెప్పారు.

నానితో తీసిన జెంటిల్‌మెన్‌ సినిమా మీకు మంచి గుర్తింపు తెచ్చిందా?

ఇంద్రగంటి: బందిపోటు సినిమా తీసేటప్పుడు ప్రొడ్యూసర్‌ కృష్ణ ప్రసాద్‌ గారు నా దగ్గరకు వచ్చి కొంత డబ్బు ఇచ్చారు. కానీ ఈ సినిమా హిట్‌ అవ్వలేదని ఆ డబ్బులు ఆయనకు పంపించేశాను. తర్వాత ఆయన నన్ను కలిసి  ఓ కథ ఉంది అని జెంటిల్‌మెన్‌ స్టోరీ చెప్పారు. నేను నానితో తీయాలని కథ వినగానే అనుకున్నా. అప్పుడు నాని సినిమాల విషయంలో ఒడుదొడుకుల్లో ఉన్నాడు. జెంటిల్‌మెన్‌ కథ పంపించి అడిగాను వెంటనే ఓకే అన్నాడు. ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందే మొదలుపెట్టాం . ఒక మ్యాజిక్‌లా హిట్‌ అయింది.

తెలుగు సినిమాల్లో తెలుగువాళ్లు తక్కువ కనిపిస్తుంటారు దీనికి కారణం ఏమై ఉంటుంది?

ఇంద్రగంటి: తెలుగు వారికి సినిమా రంగంపై ఒకరకమైన భయం ఉంది. జీవితంలో వ్యక్తిగతంగా భావించే విషయాలను తెరపై చేయాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్లు, గౌరవ ప్రదమైన ఉద్యోగం లేని వాళ్లు సినిమాల్లోకి వెళ్తారని అనుకుంటుంటారు. అయితే సినిమాలపై పూర్తి అవగాహన లేని వాళ్లు మాత్రమే ఇలా అనుకుంటారు. అలాగే చిన్నప్పటి నుంచి నాటకాలు వేయించడం, సాంస్కృతిక కార్యక్రమల్లో పాల్గొనడం లాంటివి తగ్గిపోయాయి. దీనితో పాటు తెలుగుపై పట్టు లేదు. అందుకే తెలుగు వాళ్లు తక్కువ అవుతున్నారన్నది నా అభిప్రాయం.

సోసైటీ మీద సినిమాల ప్రభావం ఎంతవరకు ఉందంటారు?

ఇంద్రగంటి: సినిమాల్లో చూపించే వాటి కంటే ఎక్కువ దుర్మార్గాలు బయటి ప్రపంచంలో జరుగుతాయి. ప్రపంచంలో ఉండే వాటిలో కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు. అలా అని సినిమాల ప్రభావం సొసైటీ మీద లేదని నేను చెప్పను.

మీరు సినిమా విడుదల విషయంలో ఎందుకు విరామం ఎక్కువ తీసుకుంటారు?

ఇంద్రగంటి: సినిమాకు సంబంధించిన విషయాలన్నీ నేనే చూసుకుంటాను. రాయడం దగ్గరి నుంచి ప్రతి విషయాన్ని నేను సమీక్షిస్తాను. అందుకే ఒక సినిమాకు, మరో సినిమాకు మధ్య గ్యాప్‌ ఎక్కువ ఉంటుంది. 2016 నుంచి వేగం పెరిగింది. ప్రతి సంవత్సరం ఒక సినిమా విడుదల చేస్తున్నాను. 18 ఏళ్లలో 11 సినిమాలే తీశాను అని ఒక్కోసారి నాకే అనిపిస్తుంది. ఎన్ని సినిమాలు తీస్తామన్నది కాదు ముఖ్యం. మనం తీసిన సినిమాల్లో ఎన్ని.. కొన్ని తరాల వరకు గుర్తుండిపోతాయి అనేది ముఖ్యం. 

సినిమా పరాజయం నుంచి బయటపడడానికి ఏం చేస్తారు?

ఇంద్రగంటి: ఒక కళాకారుడికి ఇది చాలా కష్టమైన విషయం. ఎక్కడ తప్పు జరిగిందో చూసుకుంటాను. నా సినిమాపై వచ్చిన విమర్శలను వెంటనే చదవను. నెల రోజుల తర్వాత చదువుతాను. ఈ లోపు పుస్తకాలు చదవడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం లాంటివి చేస్తుంటాను. నేను చేసిన తప్పులను రాసుకుని అవి రిపీట్‌ అవ్వకుండా జాగ్రత్త పడతాను. 

మీ పెళ్లి గురించి చెప్పండి?మీ ఇంటి పేరు కథ ఏంటి?

ఇంద్రగంటి: నాది ప్రేమ వివాహం. నా భార్య పేరు ఉమామహేశ్వరి. తను నా క్లాస్‌మేట్‌. మాకు ఓ పాప, బాబు. ప్రస్తుతం నేను చదివిన కాలేజీలోనే డిగ్రీ చదువుతోంది. బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి. చిన్న లైబ్రెరీలా ఉంటుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇంద్రకల్‌ అనే ఊరి నుంచి మా పూర్వీకులు వలస వచ్చారు. ఆ ఊరి పేరే ఇంద్రగంటిగా మారింది. 

ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు?ఈ తరం వాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి?

ఇంద్రగంటి: రెండు కథలు రాస్తున్నాను. వాటికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను. ఈ తరం వాళ్లకు నేనిచ్చే సలహా.. బాగా చదవాలి. సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, అలాంటి సినిమాలు చూడాలి. విజయానికి మార్గాలంటూ ప్రత్యేకంగా ఉండవు. కష్టపడాలి. ఆకష్టాన్ని, మన ప్రతిభని నమ్ముకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని