Cinema News: సంక్షిప్త వార్తలు(5)

ధనుష్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్‌’. తమిళంలో ‘వాతి’గా విడుదల కానుంది. ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మేనన్‌ కథానాయిక. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 18 Nov 2022 07:10 IST

ఫిబ్రవరి బరిలో ‘సార్‌’

నుష్‌ (Dhanush) కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్‌’ (SIR). తమిళంలో ‘వాతి’గా విడుదల కానుంది. ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మేనన్‌ కథానాయిక. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబరు 2న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పుడీ చితం వాయిదా పడింది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త విడుదల తేదీతో కూడిన రెండు పోస్టర్లను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘‘విద్యావ్యవస్థ తీరు తెన్నులపై సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాక.. ఆలోచింపజేస్తాయి. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్‌కుమార్‌ స్వరాలందిస్తున్నారు. జె.యువరాజ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.  


అదే దారిలో రకుల్‌ చిత్రం

థియేటర్‌తో సమానంగా ఓటీటీ బాట పట్టే సినిమాల సంఖ్య బాలీవుడ్‌లో పెరుగుతోంది. మళ్లీ మరో క్రేజీ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుంది. అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఛత్రీవాలీ’ (Chhatriwali). ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా జనవరి 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తేజస్‌ ప్రభా విజయ్‌ డియోస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్‌ కండోమ్‌ టెస్టర్‌గా నటించింది. కండోమ్‌ చుట్టూ కథ తిరిగినంత మాత్రాన ఇదేమీ అసభ్యత నిండిన చిత్రం కాదు...కుటుంబ కథా చిత్రం’ అని చెప్పింది రకుల్‌.


హెచ్చరికలు లేవు.. ధమ్కీనే!

టీవలే ‘ఓరి దేవుడా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు విష్వక్‌ సేన్‌ (Vishwak Sen). ఇప్పుడు ‘దాస్‌ కా ధమ్కీ’తో (Das Ka Dhumki) సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. విష్వక్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. కరాటే రాజు నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో విష్వక్‌ చెవి పోగులు, గోల్డ్‌ వాచ్‌ ధరించి ట్రెండీ హెయిర్‌ స్టైల్‌తో మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ‘‘హెచ్చరికలు లేవు.. ధమ్కీ మాత్రమే’’ అంటూ ఆ ప్రచార చిత్రానికి ఓ వ్యాఖ్యను కూడా జోడించారు. ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే థ్రిల్లర్‌ చిత్రమిది. పోరాట ఘట్టాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది’’అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్‌, కూర్పు: అన్వర్‌ అలీ, ఛాయాగ్రహణం: దినేష్‌ కె బాబు.


వినూత్నమైన రాబరీ థ్రిల్లర్‌

రావణ్‌ నిట్టూరు కథానాయకుడిగా ఆనంద్‌.జె తెరకెక్కించిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’ (alipiriki allantha dooramlo). రమేష్‌ డబ్బుగొట్టు, పి.రెడ్డి రాజేంద్ర సంయుక్తంగా నిర్మించారు. శ్రీనికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక వినూత్నమైన రాబరీ థ్రిల్లర్‌. పూర్తిగా తిరుపతి నేపథ్యంలోనే సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. ఇంత మంచి కథలో నన్ను భాగం చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అంది నాయిక శ్రీనికిత. హీరో రావణ్‌ మాట్లాడుతూ.. ‘‘కథను నమ్మి చేసిన చిత్రమిది. సినిమా చూశాక నా నమ్మకం రెట్టింపయ్యింది. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లర్‌ అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలూ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది’’ అన్నారు నిర్మాతలు రమేష్‌, రాజేంద్ర. ఈ సినిమాకి సంగీతం: ఫణి కల్యాణ్‌, ఛాయాగ్రహణం: డిజికె.


‘భేడియా’తో ‘భోలా’ త్రీడీ టీజర్‌

ప్రముఖ హిందీ కథానాయకుడు అజయ్‌ దేవ్‌గణ్‌ నాలుగోసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భోలా’ (Bholaa). టబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ యాక్షన్‌ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో ఛేజింగ్‌ సన్నివేశాలు, గన్‌ ఫైట్లు చాలా కొత్తగా ఉంటాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ సినిమాని త్రీడీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులోని యాక్షన్‌ సీన్లను త్రీడీలో చూస్తే ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా త్రీడీ టీజర్‌ను వరుణ్‌ధావన్‌ ‘భేడియా’ సినిమాతో పాటు థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘భోలా’ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని