Bigg Boss 5: లోబో ఎలిమినేట్‌.. తప్పు చేసిన వాళ్లు ఉంటున్నారు.. ఆఖర్లో ట్విస్ట్‌

శనివారం ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీకెండ్స్‌లో వ్యాఖ్యాతగా నాగార్జున

Updated : 17 Oct 2021 06:18 IST

Bigg Boss Telugu 5: శనివారం ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీకెండ్స్‌లో వ్యాఖ్యాతగా నాగార్జున వచ్చి అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వారం ఆయన పూర్తిగా పెదరాయుడి అవతారంలోనే ఉండిపోయారు. గత వారం రోజులుగా హౌస్‌మేట్స్‌ పనితీరును విశ్లేషిస్తూ తప్పు చేసిన వారిని కడిగిపారేశారు. ముఖ్యంగా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌ విషయంలో రవి, శ్వేత, లోబోల వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వచ్చి రావడంతోనే లోబోను నిలబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘రవి చెబితేనే వెళ్లి కుషన్‌ కట్‌ చేసి, తీసుకొచ్చా’ అని లోబో చెప్పగా, ‘రవి గడ్డి తినమంటే తింటావా’ అని నాగ్‌ మండిపడ్డారు. ‘కుషన్‌లోని దూదిని తీసుకొచ్చిన విషయం నీకు తెలియదు అని చెప్పకు’ అని శ్వేత అనగా,  రవి ఏమీ తెలియనట్టు ముఖం పెట్టాడు. ‘ఇవన్నీ చూస్తుంటే నటరాజ్‌ మాస్టర్‌ చెప్పిందే(రవిని గుంటనక్క అన్నారు) కరెక్ట్‌ అనిపిస్తోంది’ అని నాగార్జున అనడంతో రవి చిన్నబోయాడు. ‘సంచాలకులైన కాజల్‌, సిరి ఈ విషయంలో రవిని నమ్మాలా? వద్దా’ అని నాగార్జున అడిగారు. కుషన్‌లో ఉన్న కాటన్‌కు, గేమ్‌లో ఇచ్చిన కాటన్‌కూ తేడా ఉందని నిరూపించారు. దీంతో రవి ఒక్కడే నిందితుడిలా నిలబడిపోయాడు. ఏదైనా మాట్లాడితే ఏ వీడియో బయటకు వస్తుందోనని రవి మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇక నామినేషన్స్‌ సందర్భంగా ‘మీరంతా నటులు’ అంటూ శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలపైనా నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ‘యాక్టర్‌ అంటే చిన్న చూపా’ అంటూ శ్రీరామ్‌ను ప్రశ్నించారు. అందుకు శ్రీరామ్‌ సారీ చెప్పాడు.

ప్రియ, లోబోలను నామినేట్‌ చేసిన హౌస్‌మేట్స్‌

శనివారం నాగార్జున మరో ఆసక్తికర ట్విస్ట్‌ ఇచ్చారు. హౌస్‌మేట్స్‌ అందరినీ కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి, ఇంట్లో ఉండేందుకు అర్హతలేని ఒకరి పేరు చెప్పాలని సూచించారు. మొదట మానస్‌.. శ్రీరామ్‌ను నామినేట్‌ చేయగా, ప్రియను సన్నీ, కాజల్‌, విశ్వ, లోబోలు నామినేట్ చేశారు. గత కొద్ది రోజులు లోబో సరిగా ఆడటం లేదంటూ అనీ మాస్టర్‌, శ్వేత, సిరి, షణ్ముఖ్‌లు అతడిని నామినేట్‌ చేశారు. దీంతో ప్రియ, లోబోలకు చెరి నాలుగు ఓట్లు వచ్చాయి. వీరిలో ఒకరు హౌస్‌ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని, చివరిగా ఎవరు హౌస్‌లో ఉండాలనుకుంటున్నారో ఇంటి సభ్యులు చెప్పాలని నాగార్జున ఆదేశించాడు. దీంతో రవి, సన్నీ, విశ్వ, కాజల్‌లు లోబో పక్కన నిలబడగా, మిగిలిన వాళ్లందరూ ప్రియకు సపోర్ట్‌చేయడంతో లోబో ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అనీ మాస్టర్‌ ఎటూ తేల్చుకోలేకపోతుండటంతో ‘అనీ.. త్వరగా నీ నిర్ణయం చెప్పు.. కన్ఫెషన్‌ రూమ్‌లోనూ ఇలాగే చేశావ్’ అంటూ గట్టి చెప్పారు. దీంతో ప్రియకు అనీ సపోర్ట్‌ చేసింది.

తప్పు చేసిన వాళ్లు ఉంటుంటున్నారంటూ ఏడ్చిన విశ్వ

లోబో ఇంటి నుంచి బయటకు వెళ్లాలని నాగార్జున చెప్పడంతో విశ్వ తట్టుకోలేకపోయాడు. ఆ మాట వినడంతో ఏడుపు మొదలు పెట్టాడు. ‘తప్పు చేసిన వాళ్లు ఉంటున్నారు. లోబోను ఎందుకు పంపిస్తున్నారు’ అంటూ భోరున విలపించాడు. లోబోకు మద్దతు ఇవ్వని హౌస్‌మేట్స్‌ అతడికి సారీ చెప్పారు. ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్న సమయంలో తెలిసి కానీ, తెలియక కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని లోబో హౌస్‌మేట్స్‌ను కోరాడు.

ఏదో తేడాగా ఉందే...!

సాధారణంగా ఎలిమినేట్‌ అయిన సభ్యులు వేదికపైకి రాగానే బిగ్‌బాస్‌ హౌస్‌లో వాళ్ల జర్నీ వీడియోను ప్రసారం చేయటం అలవాటు కానీ, నాగార్జున అదేమీ చూపించకుండా నేరుగా లోబోను ఇంటి సభ్యులతో మాట్లాడించారు. ‘ఏదో తేడాగా ఉందే’ అనిచూస్తున్న ప్రేక్షకులకు అర్థమైంది. ఇలోగా థంబ్స్‌ అప్‌.. డౌన్‌ అంటూ సింబల్‌ ఇచ్చి హౌస్‌మేట్స్‌కు రేటింగ్‌ ఇవ్వాలని నాగార్జున సూచించగా, లోబో అందరికీ థంబ్స్‌ అప్‌ ఇచ్చాడు. తనకి సపోర్ట్‌ చేయని వారి గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడాడు. బస్తీ నుంచి వచ్చిన తనని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌కు వీడ్కోలు పలికి స్టేజ్‌ వీడేందుకు ప్రయత్నించాడు. అప్పుడు నాగార్జున నవ్వుతూ లోబోను వెనక్కి పిలిచి, ‘నిన్ను ఎలిమినేట్‌ చేయడానికి బిగ్‌బాస్‌ ఎవరు? హౌస్‌మేట్స్‌  ఎవరు? ఏది చేసినా ప్రేక్షకులు నిర్ణయమే అంతిమ తీర్పు. నువ్వు ఎలిమినేట్‌ కావటం లేదు. సీక్రెట్‌ రూమ్‌లోఉంటున్నావ్‌. బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు మళ్లీ హౌస్‌లోకి వెళ్తావ్‌’ అని చెప్పాడు. దీంతో మరోసారి లోబో ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని