Cinema News: సంక్షిప్త వార్తలు (7)

మునుపటిలా మళ్లీ బిజీ అవుతోంది కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. ఇప్పటికే ‘భారతీయుడు 2’ కోసం రంగంలోకి దిగిన ఆమె... కొత్త సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది.

Updated : 04 Nov 2022 08:33 IST

కాజల్‌ జోరు

మునుపటిలా మళ్లీ బిజీ అవుతోంది కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ (Kajal). ఇప్పటికే ‘భారతీయుడు 2’ (Indian 2) కోసం రంగంలోకి దిగిన ఆమె... కొత్త సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఆమె గర్భం దాల్చడానికి ముందు తమిళంలో ‘ఘోస్టీ’ (Ghosty) అనే సినిమా చేసింది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఆ సినిమా కోసం ఓ ప్రచారగీతం చిత్రీకరణలో పాల్గొంది కాజల్‌. పెళ్లి తర్వాత పెద్దగా విరామం తీసుకోని కాజల్‌... బాబుకి జన్మనిచ్చాక కూడా వెంటనే మేకప్‌ వేసుకొనేందుకు సిద్ధమైంది. ప్రత్యేక వ్యాయామాలు చేస్తూ... మునుపటిలాగే మళ్లీ నాజూగ్గా తయారైంది. సుదీర్ఘ విరామం తర్వాత కూడా కాజల్‌ తన స్థానం తనదే అన్నట్టుగా మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. సీనియర్‌ భామల అనుభవం చిత్రసీమకి అవసరం అవుతుండడంతో వాళ్లకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.


పోతురాజు బ్లాక్‌బస్టర్‌

నందు విజయ్‌కృష్ణ (Nandu), రష్మి గౌతమ్‌ (Rashmi) జంటగా తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ (Bomma Blockbuster). రాజ్‌ విరాట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రవీణ్‌ పగడాల బోసుబాబు నిడుమోలు, ఆనంద్‌రెడ్డి మద్ది, మనోహర్‌రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు విమల్‌కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘‘పేరు తరహాలోనే సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. నందు, రష్మి కథని నమ్మి చాలా కష్టపడి పనిచేశారు. ట్రైలర్‌, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి’’ అన్నారు. నందు మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి కథ కూడా వినకుండా నాకు సాయం చేయడానికి ముందుకొచ్చారు రష్మి. చిత్రీకరణ సమయంలో సరైన సదుపాయాలు కల్పించలేకపోయినా సహకరించింది’’ అన్నారు. రష్మి గౌతమ్‌ మాట్లాడుతూ ‘‘కొత్తతరాన్ని ప్రోత్సహించాలని చాలా మందికి ఇందులో అవకాశం ఇచ్చారు. నేను, నందు కలిసి 14 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నాం. దర్శకుడు రాజ్‌ విరాట్‌ చెప్పిన కథని నందు నమ్మితే, నేను తనని నమ్మి ఈ సినిమా చేశా’’ అన్నారు. సినిమా చూస్తున్నంతసేపూ పోతురాజు పాత్రతో ప్రయాణం చేస్తారన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో సెవెన్‌హిల్స్‌ సతీశ్‌, శ్రీను, శేషాద్రి, సుడిగాలి సుధీర్‌, ధన్‌రాజ్‌, సత్యం రాజేశ్‌తోపాటు, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌.విహారి తదితరులు పాల్గొన్నారు.


తలకోనలో ఏమైంది?

ప్సర రాణి (Apsara Rani) ప్రధాన పాత్రలో నగేష్‌ నారదాసి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలకోన’ (Talakona). విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్‌ రెడ్డినిర్మిస్తున్నారు. అశోక్‌ కుమార్‌, అజయ్‌ ఘోష్‌, సుభాష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్‌ క్లాప్‌ కొట్టగా.. మరో నిర్మాత రామారావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా నటి అప్పర రాణి మాట్లాడుతూ.. ‘‘మంచి స్క్రిప్ట్‌కు నేను అభిమానిని. అదే ఇప్పుడు ఈ చిత్రం చేయడానికి కారణమైంది. ఈ సినిమా మంచి విజయంతో పాటు చక్కటి పేరును తీసుకొస్తుందని ఆశిస్తున్నా’’ అంది. ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో సాగే చిత్రమిది. కథ విషయానికొస్తే.. తలకోన అడవిలోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. అయితే వాళ్లలో ఎంతమంది తిరిగి వచ్చారు అన్నది చిత్ర కథాంశం’’ అన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో డి.శ్రీధర్‌, సుభాష్‌, రాహుల్‌ యాదవ్‌ నక్కా, వేగేశ్న సతీష్‌, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


తీరంలో ప్రేమకథ

మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం ‘జెట్టి’ (Jetty). సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. వేణుమాధవ్‌.కె నిర్మాత. శివాజీరాజా, కన్నడ కిషోర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మట్టి వాసనలున్న కథతో సినిమాని రూపొందించారు. మత్స్యకారుల జీవితాల్ని అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చినట్టు స్పష్టమవుతోంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తీరప్రాంత జీవన విధానం, వారి సమస్యలు, కట్టుబాట్లని ఆవిష్కరించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమాని తెరకెక్కించాం’’ అన్నారు.


స్నేహమేరా జీవితం

సిద్‌ స్వరూప్‌, ఆర్‌.కార్తికేయ, ఇందుప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘దోస్తాన్‌’ (Dostan). సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కె.బసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ని విడుదల చేశారు. ‘‘స్నేహం నేపథ్యంలో తరతరాలుగా సినిమాలు రూపొందుతున్నాయి. గొప్పదైన ఆ బంధం చుట్టూ సాగే ఈ సినిమా కూడా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘స్నేహమే జీవితం అనుకున్న ఇద్దరు యువకుల కథ ఇది.  కథానాయకుడు సిద్‌ స్వరూప్‌ రాసిన కథతో ఈ సినిమా చేశా.పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. లంబసింగి, తలకోన, వరంగల్‌, హైదరాబాద్‌, విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం’’ అన్నారు.


నాగశౌర్య కొత్త చిత్రం

థానాయకుడు నాగశౌర్య (Naga Shourya) కొత్త కబురు వినిపించారు. తన 24వ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌.అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్‌ కుమార్‌ చింతలపూడి, అశోక్‌ కుమార్‌ చింతలపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని గురువారం అధికారికంగా ప్రకటించారు. ‘‘వినూత్నమైన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది ఇందులో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. త్వరలో సినిమా ప్రారంభిస్తాం’’ అన్నారు చిత్ర నిర్మాతలు.  


గోవిందా డిజిటల్‌ బాట!

విజయాలతో జోరుమీదున్న విక్కీ కౌశల్‌ నుంచి వస్తోన్న చిత్రం ‘గోవింద్‌ నామ్‌ మేరా’. భూమి పెడ్నేకర్‌, కియారా అడ్వాణీ నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శశాంక్‌ ఘోష్‌ తెరకెక్కించారు. కరణ్‌జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబరు 16ని విడుదల తేదీగా అనకుంటున్నారు. గతంలో విక్కీ, కియారా కలిసి ‘లస్ట్‌ స్టోరీస్‌’లోనూ, భూమి, విక్కీ కలిసి భూత్‌ పార్ట్‌వన్‌: ది హాంటెడ్‌ షిప్‌’లోనూ నటించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలోనూ వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుందని చిత్రబృందం చెబుతోంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని