Russia: అంతరిక్షంలో షూటింగ్‌.. నింగిలోకి బయల్దేరిన డైరెక్టర్‌, హీరోయిన్‌

సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములు వంటి సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే వాటి కోసం ప్రత్యేకంగా సెట్స్‌ డిజైన్‌ చేయడమో లేదా గ్రాఫిక్స్‌ రూపంలోనో

Updated : 05 Oct 2021 18:52 IST

మాస్కో: సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములు వంటి సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే వాటి కోసం ప్రత్యేకంగా సెట్స్‌ డిజైన్‌ చేయడమో లేదా గ్రాఫిక్స్‌ రూపంలోనో వాటిని చూపిస్తుంటారు. కానీ రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం.. ఈ సన్నివేశాలను ఏకంగా అంతరిక్షంలోనే చిత్రీకరించాలని నిర్ణయించింది. అంతేనా.. షూటింగ్‌ కోసం ఆ సినిమా డైరెక్టర్‌, హీరోయిన్‌ ప్రత్యేక వ్యోమనౌకలో నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఐస్‌)కు బయల్దేరి వెళ్లారు.

సినీ రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ చేయనున్నట్లు రష్యా గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని కార్యాచరణలో పెట్టింది. ‘ది ఛాలెంజ్‌’ అనే సినిమా షూటింగ్‌ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్‌ షిపెంకో, హీరోయిన్‌ యులియా పెరెసిల్డ్‌ నేడు అంతరిక్షానికి బయల్దేరారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్‌ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్‌ఎస్‌ వెళ్లారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో కజకిస్థాన్‌లోని బైకోనుర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 

డైరెక్టర్‌, హీరోయిన్‌ 12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ‘‘అంతరిక్ష కేంద్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్‌ ఐఎస్‌ఎస్‌కు వెళ్లే’’ సన్నివేశం అది. సినిమాలో ఈ సీన్‌ దాదాపు 35 నుంచి 40 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. డాక్టర్‌ పాత్రలో హీరోయిన్‌ యులియా నటించనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం గతేడాది ఆడిషన్‌ నిర్వహించారు. ఇందులో యులియా ఎంపికవ్వగా.. ఆడిషన్‌ తర్వాత ఆమె కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ షూటింగ్‌ పూర్తయితే అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది. గతేడాది ప్రముఖ హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కూడా స్పేస్‌లో షూటింగ్‌ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం నాసా, స్పేస్‌-ఎక్స్‌ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ఆ తర్వాత దానిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు