NTR Centenary Celebrations: ఎన్టీఆర్‌ స్మరణలో సినీ తారలు.. సోషల్‌మీడియాలో పోస్టులు

నందమూరి తారక రామారావు (NTR) శత జయంతిని పురస్కరించుకుని సినీ ప్రముఖులు ఘన నివాళులర్పిస్తున్నారు.

Updated : 28 May 2023 16:21 IST

హైదరాబాద్‌: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు (NTR) శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్‌ ఆయన్ని స్మరించుకుంటోంది. ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పిస్తూ పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు చిరంజీవి, ఎన్టీఆర్‌, అనిల్‌ రావిపూడితోపాటు పలువురు సినీ ప్రముఖులు తాజాగా ట్వీట్స్‌ చేశారు.

‘‘నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనసులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకు గర్వంగా చెబుతుంది. అలాంటి కారణజన్ములు నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన ఆయనతో నా అనుబంధం ఎప్పటికీ చిరస్మరణీయం. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..’’ - చిరంజీవి

‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..!’’ - ఎన్టీఆర్‌

‘‘తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, శక పురుషుడు, తెలుగువారి గుండెచప్పుడు అన్న నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా మహనీయుడికి ఘన నివాళులు’’ - గోపీచంద్‌ మలినేని

‘‘ఒక శతాబ్దపు అద్భుతం నందమూరి తారక రామారావు. గొప్ప నటుడు, గొప్ప నాయకుడు, గొప్ప మనసు ఉన్న మనిషి. శతజయంతి సందర్భంగా ఆయనికివే నా ఘన నివాళి’’ - అనిల్‌ రావిపూడి

‘‘తెలుగు జాతి.. తెలుగు సినిమా.. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఆత్మ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిన మిమ్మల్ని స్మరించుకుంటూ.. జోహార్ ఎన్టీఆర్’’ - హరీశ్ శంకర్‌

‘‘ఆ రూపం.. ఆ అభినయం.. అనితరసాధ్యం.. తెలుగువారి ఆత్మగౌరవతేజం. నా అభిమాన కథానాయకుడు నందమూరి తారక రామారావు దివ్యస్మృతికి నమస్సుమాంజలి’’ - రామజోగయ్య శాస్త్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని