colors swathi: విడాకుల వార్తలపై విలేకరి ప్రశ్న.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన ‘కలర్స్‌’ స్వాతి

colors swathi: ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సినిమా ప్రచారంలో భాగంగా పలు విషయాలపై నటి స్వాతి స్పందించారు. అలాగే తన విడాకుల వార్తలపైన తన స్పందన తెలియజేశారు.

Updated : 26 Sep 2023 18:00 IST

హైదరాబాద్‌: ‘కలర్స్‌’ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించి, ఆ తర్వాత నటిగా పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించారు స్వాతి (colors swathi). శ్రీకాంత్‌ నగోటి దర్శకత్వంలో నవీన్‌ చంద్రతో కలిసి ఆమె నటించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ (Month Of Madhu). శ్రేయా నవిలే, మంజుల, హర్ష తదితరులు నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు స్వాతి సమాధానం ఇచ్చారు. అంతేకాదు, ‘స్వాతి విడాకులు తీసుకున్నారు’ అంటూ వస్తున్న వార్తలపై ఓ విలేకరి ప్రశ్నించగా, తన స్పందన తెలియజేశారు.

నవీన్‌తో నటించడం బాగుంది!

‘‘నవీన్‌, నేనూ కలిసి ‘త్రిపుర’ చేశాం. ఆ తర్వాత మేమిద్దరం రెండు, మూడేళ్లు టచ్‌లోనే లేము. కనీసం పండగలకు శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేదు. ‘భానుమతి రామకృష్ణ’ ప్రోమో పంపించి, సినిమా కూడా చూడమని చెప్పాడు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ‘నాకు స్పెషల్‌గా పంపడానికి కారణం ఏంటి’ అని అడిగితే, ‘అదే థీమ్‌తో మళ్లీ చేద్దామనుకుంటున్నాం. నువ్వు నటిస్తావా’ అని చెప్పాడు. ఆ తర్వాత వచ్చి కథ వింటే నాకూ నచ్చింది. నవీన్‌తో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉంది’’

అంత టాలెంట్‌ నాకు లేదు

‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంచి టాలెంట్‌ ఉంది. నేను నటించిన సినిమాల్లోని సన్నివేశాలను రీల్స్‌ రూపంలో రీక్రియేట్‌ చేసి, నాకు ట్యాగ్‌ చేస్తారు. అవి చూసినప్పుడు అవకాశాలు, అదృష్టం కూడా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే, నాకన్నా ప్రతిభావంతులకు ఇంకా అవకాశాలు రాలేదనిపిస్తుంది. ఎంతో కష్టపడుతూ వీడియోలు చేస్తారు. అంత టాలెంట్‌ నాకు లేదు. ‘ఇక సినిమాలు చేయకూడదు’ అనుకున్న సమయంలో ఈ ఆఫర్‌ వచ్చింది. ‘సత్య’ కూడా అలాగే వచ్చింది. సినిమా అనేది ఒక బిజినెస్‌. కొంతమంది వైద్యుల దగ్గరకు వెళ్తే, ట్రీట్‌మెంట్‌ చేస్తున్న సమయంలోనే ‘మా ఆస్పత్రి గురించి గూగుల్‌లో రివ్యూ రాయండి’ అని అడుగుతున్నారు. నటులందరికీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఉండాలని ఏమీ లేదు. ఇలా విరామం తీసుకుని సినిమాలు చేయడమే నాకు సూటవుతుంది. అదే సమయంలో నేను చేసే సినిమాలకు నాపై బాధ్యత ఉంటుంది. తెలుగమ్మాయి కావడం ఒక గొప్ప విషయం’’

ఇప్పుడది అప్రస్తుతం

‘‘విడాకులకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ‘నేను ఇవ్వ’.. ఎందుకంటే, కలర్స్‌ చేసినప్పుడు నాకు 16ఏళ్లు. అప్పుడు సోషల్‌మీడియా లేదు. లేకపోతే ఫుట్‌బాల్‌ ఆడేసేవాళ్లు. ఇప్పుడున్న నటీనటులు వాటిని ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారో. నాకంటూ కొన్ని రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఉన్నాయి. దానికి కట్టుబడి విడాకులపై నేను స్పందించను. ఇది సినిమా ఈవెంట్‌, ఇక్కడ ఆ ప్రశ్న అప్రస్తుతం’’ అంటూ నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. అంతకుముందు ‘మంత్‌ ఆఫ్‌ మధు’ ట్రైలర్‌ను కథానాయకుడు సాయి ధరమ్‌తేజ్‌ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని