AP News: సినిమా టికెట్ల అంశం.. ముగిసిన కమిటీ సమావేశం

రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలతో పాటు థియేటర్ల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ సమావేశం ముగిసింది.

Updated : 11 Jan 2022 15:12 IST

అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలతో పాటు థియేటర్ల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం ప్రేక్షకుల సంఘం తరఫున హాజరైన కమిటీ సభ్యురాలు లక్ష్మి మీడియాతో మాట్లాడారు. జీవో 35 ప్రకారమే ధరలు ఉండాలని కమిటీకి తెలిపామని.. థియేటర్లలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంపైనా చెప్పామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్‌ ధరలు పెంచాలని కోరామని తెలిపారు.

మరోవైపు ఎగ్జిబిటర్ల తరఫున హాజరైన సభ్యుడు బాలరత్నం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో టికెట్‌ ధరలపై సూచనలు చేసినట్లు చెప్పారు. టికెట్‌ ధరల తగ్గింపుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 థియేటర్లు మూతపడిన విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. థియేటర్ల నిబంధనల విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని కోరామని చెప్పారు. టికెట్ ధరల నిర్ధారణపై సమావేశంలో చర్చించామని.. బి, సి సెంటర్లలో రేట్లను మార్పు చేయాల్సి ఉందని మరో సభ్యుడు ముత్యాల రాందాస్ అన్నారు. థియేటర్లలో వసతులు, అగ్నిమాపక నిబంధనలపై చర్చించామన్నారు. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని