Archana Kavi: ‘ఆ నటి మాస్క్‌ పెట్టుకోవడం వల్ల పోలీస్‌ గుర్తుపట్టలేదు’

ప్రముఖ మలయాళ సినీనటి, టీవీ హోస్ట్‌ అర్చనా కవి, తన ఫ్రెండ్స్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ....

Published : 26 May 2022 01:23 IST

నటి అర్చనా కవి పట్ల పోలీస్‌ దురుసు ప్రవర్తనపై విచారణ!

కోచి: ప్రముఖ మలయాళ సినీనటి, టీవీ హోస్ట్‌ అర్చనా కవి, తన ఫ్రెండ్స్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అంతర్గత విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల తన స్నేహితులతో కలిసి రాత్రిపూట ఆటోలో వస్తుండగా పోలీస్‌ కానిస్టేబుల్‌ చాలా దురుసుగా ప్రవర్తించారంటూ తనకు ఎదురైన అనుభవాన్ని అర్చనా కవి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కొచ్చి డీసీపీ మాట్లాడుతూ ‘‘దీనిపై అంతర్గత విచారణ జరిపాం. సినీనటి, పోలీస్‌.. ఇద్దరి వాదనలు విన్నాం. రాత్రి పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌.. సినీనటి ముఖానికి మాస్క్‌ పెట్టుకొని ఉండటంతో గుర్తుపట్టలేకపోయారు. ఓ నటి అయినా, సాధారణ మహిళ అయినా చట్టాన్ని అమలు చేసేవారు దురుసుగా  ప్రవర్తించడం ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. నేను ఇద్దరి వెర్షన్లూ విన్నాను. పోలీసుల పట్ల నటికి మామూలుగా చాలా మంచి అభిప్రాయం ఉంది. కానీ తాజాగా జరిగిన ఘటన ఆమెను గాయపడేలా చేసింది. అయితే, పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా ఆమెను ఇబ్బంది పెట్టాలని కాదు గానీ.. పెట్రోలింగ్‌లో భాగంగా వారి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించాడు. మరోసారి అతడికి సమన్లు ఇస్తాం. అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. 

ఇటీవల తన స్నేహితులతో కలిసి రాత్రిపూట వస్తుండగా పోలీస్‌ నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అర్చనా కవి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ తమ పట్ల చాలా మొరటుగా ప్రవర్తించాడనీ.. ఆ సమయంలో తాము అభద్రతకు లోనైనట్టు భావించినట్టు ఆమె పేర్కొన్నారు. మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన అర్చనా కవి తెలుగులోనూ బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ అనే చిత్రంలో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని