Sushant Rajput తండ్రి పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

బాలీవుడ్‌ నటుడు దివంగత సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ సుశాంత్‌ తండ్రి కె.కె.సింగ్‌ వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ గతేడాది జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సుశాంత్‌ మరణంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.

Published : 10 Jun 2021 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు దివంగత సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ సుశాంత్‌ తండ్రి కె.కె.సింగ్‌ వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ గతేడాది జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సుశాంత్‌ మరణంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇదిలా ఉండగా.. సుశాంత్‌ జీవితం ఆధారంగా పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే.. తన కుమారుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా సినిమాలు తీయకుండా చూడాలని దిల్లీ హైకోర్టులో కె.కె.సింగ్‌ గత ఏప్రిల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలాంటి సినిమాలు దర్యాప్తును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సుశాంత్‌ పేరు గానీ.. అతని ప్రస్తావనను గానీ.. తెరపై చూపించకుండా నిరోధించాలన్నారు. ఇందులో భాగంగానే తన కుమారుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘న్యాయ్‌’ విడుదలను నిలిపివేయాలంటూ సుశాంత్‌ తండ్రి కృష్ణకిషోర్‌సింగ్‌ దిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేకాదు.. తన కుటుంబాన్ని మానసికంగా కుంగదీసినందుకు పరువు నష్టం కింద రూ.2కోట్లు చెల్లించాలని కోరారు. కాగా.. దిల్లీ హైకోర్టు గురువారం ఆయన అభ్యర్థనను పరిశీలించింది. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం.. కె.కె.సింగ్‌ అభ్యర్థనను కొట్టివేసింది. న్యాయ్‌ విడుదలను అడ్డుకోవడం కుదరదని తేల్చి చెప్పింది.

సుశాంత్‌ జీవిత కథ ఆధారంగా ‘న్యాయ్‌:ది జస్టిస్‌’, ‘సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌: ఏ స్టార్‌ వాస్‌ లాస్ట్‌’తో పాటు మరికొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాగా.. ‘న్యాయ్‌’ జూన్‌ 11న(శుక్రవారం) విడుదల కావాల్సి ఉంది. ఇందులో సుశాంత్‌సింగ్‌ పాత్రలో జుబర్‌ కె.ఖాన్‌ కనిపించనున్నాడు. శ్రేయాశుక్ల, అమన్‌ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దిలీప్ గులాటి దర్శకత్వం వహించారు. సర్లా ఎ.సరొగి, రాహుల్‌శర్మ సంయుక్తంగా నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని