Valentines Day: విభిన్న ప్రేమకథా చిత్రాలు.. ఏ స్టోరీ ఏ ఓటీటీలో అంటే?

తెరపైకెక్కిన కొన్ని ప్రేమకథలు మంచి వినోదం పంచుతాయి. కొన్ని హృదయాన్ని హత్తుకుంటాయి. విభిన్న నేపథ్యాల్లో రూపొంది, ఇటీవల ఓటీటీలోకి కొన్ని ప్రేమకథా చిత్రాలపై ఓ లుక్కేద్దామా..

Updated : 13 Feb 2023 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమ మధురమైన భావన. మాటల్లో వర్ణించలేం.. అక్షరాల్లో రాయలేం. అందుకే నాటికీ నేటికీ ప్రేమకథా చిత్రాలకు డిమాండ్‌ ఎక్కువ. భాషతో సంబంధం లేకుండా భావాలను పంచే ప్రేమ కథలకు ప్రేక్షకులు సైతం అక్కున చేర్చుకుంటారు.. ఆదరిస్తారు. అలాంటి వాటిల్లో కొన్ని మాత్రమే విభిన్న కాన్సెప్ట్‌తో రూపొంది, ఏళ్లు గడిచినా కొత్తగా అనిపిస్తాయి. ఇటీవల విడుదలైన సినిమాలను గుర్తుచేసుకుందాం.. ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ఆ ప్రేమకథా చిత్రాలను ‘లవర్స్‌ డే’ సందర్భంగా చూద్దాం..

అమ్మాయిని చూడకుండానే ప్రేమ..

హైదరాబాద్‌కు చెందిన సిద్ధు అనే యువకుడికి అలజంకికి (విజయనగరం) చెందిన నందిని రాసుకున్న డైరీ దొరుకుతుంది. ఆ డైరీలోని పేజీలు చదువుతూ నందిని ప్రేమలో పడతాడు సిద్ధు. తాను ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందుకు ఆమె స్వగ్రామానికి వెళ్తాడు. నందిని చనిపోయిందనే షాకింగ్‌ న్యూస్‌ వింటాడు. తర్వాత కోలుకుని.. డైరీలో ఉన్న ఘటనల ఆధారంగా.. గతంలో నందినికి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయాణంలో సిద్ధుకి ఎలాంటి నిజాలు తెలిశాయి? నందిని నిజంగా చనిపోయిందా? బతికే ఉందా? ఈ ఆసక్తికర కథాంశంతో వచ్చిన సినిమానే ‘18 పేజెస్‌’ (18 Pages). నిఖిల్‌ (Nikhil Siddhartha), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించారు. ఈ లవ్‌స్టోరీ ‘ఆహా’ (Aha),‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో అందుబాటులో ఉంది.

వింటేజ్‌ ప్రేమ‘లేఖ’

ఒకరిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయాలంటే ఒకప్పుడు ఉత్తరాలే కీలకం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేమలేఖ అనే మాట ఎప్పుడో, ఎక్కడో వినిపిస్తోంది. వింటేజ్ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం ‘సీతారామం’ (Sita Ramam). ఓ మిషన్‌ విజయవంతంగా పూర్తయిన తర్వాత.. ఇండియన్‌ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్‌ అధికారి రామ్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. రామ్‌ అనాథ అని తెలియడంతో చాలామంది యోగక్షేమాలు అడుగుతూ అతనికి ఉత్తరాలు రాస్తుంటారు. ఓ అమ్మాయి మాత్రం ‘నీ భార్య సీతామహాలక్ష్మి’ అని సంబోధిస్తూ ప్రేమలేఖలు పంపుతుంటుంది. ఆమెని కలుసుకునే క్రమంలో రామ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది ‘సీతారామం’ కాన్సెప్ట్‌. రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), సీత పాత్రలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ఒదిగిపోయి, ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ప్రేమికులు ఫోన్లు మార్చుకుంటే?

ఐటీ ఉద్యోగి అయిన ఉత్తమన్‌ ప్రదీప్‌, నిఖిత ప్రేమికులు. ఓ షరతు మీద నిఖిత తండ్రి వారి పెళ్లికి అంగీకరిస్తాడు. ప్రదీప్‌, నిఖిత ఒకరి ఫోన్‌ని మరొకరు మార్చుకోవాలనేదే ఆ కండిషన్‌. మరి, ఒకరి ఫోన్‌ ఇంకొకరు చూసుకున్నాక కూడా ఆ జంట పెళ్లికి సిద్ధమైందా? లవ్‌ బ్రేకప్‌ అయిందా? తెలియాలంటే ‘లవ్‌ టుడ్‌’ (Love Today) చిత్రం చూడాల్సిందే. ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan), ఇవానా (Ivana) ప్రధాన పాత్రల్లో నటించారు. న‌వ‌త‌రం ప్రేమ‌లు, వాళ్ల సెల్‌ఫోన్ అల‌వాట్లనే నేప‌థ్యంగా ప్రదీప్‌ రంగనాథన్‌ తెరకెక్కించిన ఈ ఎంటర్‌టైనర్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

మూడు కథల సమాహారం..

కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు తన ప్రియుడితో వెళ్లిపోతే ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? పుస్తక పఠనంతో ఆ డిప్రెషన్‌ పోగొట్టొచ్చనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఆర్‌. ఎ. కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశం’(Aakasam). అశోక్‌ సెల్వన్‌ (ashok selvan), అపర్ణా బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌, రీతూ వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. డిప్రెషన్‌కు లోనైన అర్జున్‌ (సెల్వన్‌) ఓ వైద్యురాలిని సంప్రదించగా ఆమె అతనికి రెండు పుస్తకాలు ఇచ్చి, చదవమని చెబుతుంది. వాటిల్లో మూడు ప్రేమకథలు ఉంటాయి. అవేంటి? ఎలా ఉంటాయి? తెలుసుకోవాలనుకుంటే ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అయ్యే ‘ఆకాశం’ చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని