custody movie review: రివ్యూ: కస్టడీ.. నాగచైతన్య కొత్త చిత్రం ఎలా ఉంది?
custody movie review: నాగ చైతన్య, అరవింద స్వామి కీలక పాత్రల్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ ఎలా ఉందంటే?
custody movie review: చిత్రం: కస్టడీ; నటీనటులు: నాగచైతన్య, అరవింద స్వామి, ఆర్.శరత్‌కుమార్,కృతిశెట్టి, ప్రియమణి, సంపత్‌రాజ్ తదితరులు; సంగీతం: యువన్ శంకర్ రాజా, ఇళయరాజా; సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కతిర్; ఎడిటింగ్: వెంకట్ రాజీన్; సంభాషణలు: అబ్బూరి రవి; నిర్మాత: శ్రీనివాస చిట్టూరి; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు; విడుదల తేదీ: 12-05-2023
జయాపజయాలతో సంబంధం లేకుండా ఏడాదికి ఒకట్రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు అక్కినేని నట వారసుడు నాగచైతన్య. గతేడాది ఆయన నటించిన ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. దీంతో ఈసారి తమిళ దర్శకుడితో కలిసి ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వైవిధ్య కథలతో ప్రేక్షకులను అలరించే వెంకట్ ప్రభు తెరకెక్కించిన ‘కస్టడీ’ ఎలా ఉంది? పోలీస్ కానిస్టేబుల్ శివగా నాగచైతన్య ఎలా నటించారు?(custody movie review) ఇంతకీ ఈ ‘కస్టడీ’ కథ ఏంటి?
కథేంటంటే: ఎ.శివ (నాగచైతన్య) నిజాయతీ గల పోలీస్ కానిస్టేబుల్. సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిసుంటాడు. తనకు రేవతి (కృతి శెట్టి) అంటే ఎంతో ప్రాణం. స్కూల్లో చదువుకునే రోజుల నుంచే ఆమెను ప్రేమిస్తుంటాడు. ఆ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కిద్దామనుకుంటే కులాలు వేరు కావడంతో ఆమె తండ్రి అడ్డు చెబుతాడు. రేవతికి బలవంతంగా ప్రేమ్ (వెన్నెల కిషోర్)తో పెళ్లి నిశ్చయం చేస్తాడు. దీంతో ఆమె శివతో వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది. ఆమె కోసమే శివ వాళ్లింటికి వెళ్తుంటే దారిలో అనుకోకుండా ఓ కారు ఢీకొడుతుంది. అందులో కరుడుగట్టిన నేరస్థుడు రాజు (అరవింద్ స్వామి), సీబీఐ అధికారి జార్జ్ (సంపత్ రాజ్) గొడవ పడుతుంటారు. వాళ్లను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేసి స్టేషన్‌లో పెడతాడు శివ. అయితే ముఖ్యమంత్రి దాక్షాయని (ప్రియమణి) ఆదేశం ప్రకారం స్టేషన్‌లో ఉన్న రాజును చంపేందుకు పోలీస్ కమిషనర్ నటరాజన్ (శరత్ కుమార్) రంగంలోకి దిగుతాడు. తన పోలీస్ బలగాన్ని.. మరికొందరు రౌడీ మూకను జత చేసుకొని రాజు ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజును చంపాలని ముఖ్యమంత్రి ఎందుకు ఆదేశించింది? అతన్ని పోలీస్‌స్టేషన్ నుంచి ప్రాణాలతో రక్షించిన శివ బెంగళూరుకు ఎందుకు తీసుకెళ్లాలనుకుంటాడు? (custody movie review) ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? శివకు రాజుకు ఉన్న సంబంధం ఏంటి? రేవతి - శివల ప్రేమ కథ ఏమైంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే: ఇదొక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. ప్రతినాయకుడ్ని ప్రాణాలతో కాపాడుకుంటూ.. అడ్డొచ్చిన పోలీస్ వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడుతూ.. ఓ సాధారణ కానిస్టేబుల్ చేసే అసాధారణ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. (custody movie review) దీంట్లో ఓ చిన్న ప్రేమకథను.. కాస్త ఫ్యామిలీ సెంటిమెంట్‌ను.. అక్కడక్కడా ఇంకాస్త వినోదాన్ని మేళవించి ఓ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘కస్టడీ’ని తెరపై వడ్డించే ప్రయత్నం చేశారు దర్శకుడు వెంకట్ ప్రభు. నిజానికి ఇలాంటి సీరియస్ కథల్లో ప్రేమకథలకు అంత స్కోప్ కనిపించదు. భిన్న ధ్రువాలైన ఈ రెండు అంశాల్ని ఒకే ఒరలో బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేస్తే మొత్తం వంటకమే చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ, దర్శకుడు కొత్తగా ఈ రెండు అంశాల్ని ఆద్యంతం సమాంతరం నడిపించే ప్రయత్నం చేశాడు. ఇదే ఈ చిత్రపై కాస్త ప్రతికూల ప్రభావం చూపింది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో చెప్పినట్లు సినిమా తొలి 20 నిమిషాలు చాలా సాధారణంగా సాగిపోతుంది. ఓ బాంబు పేలుడు సన్నివేశంతో సినిమాని మొదలు పెట్టిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. (custody movie review) అంబులెన్సుకు దారిచ్చే క్రమంలో సీఎం కాన్వాయ్‌ను శివ అడ్డుకోవడం.. దాంతో అతను వార్తల్లో వ్యక్తిగా నిలవడం.. పోలీస్ స్టేషన్‌లో పై అధికారి తనని అవమానించడం.. ఇలా కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఇక శివ - రేవతిల లవ్ ట్రాక్ మొదలయ్యాక కథ వేగం పూర్తిగా మందగిస్తుంది.
ఎప్పుడైతే రాజు పాత్ర తెరపైకి వస్తుందో అక్కడి నుంచి కథ పూర్తిగా యాక్షన్ కోణంలోకి టర్న్ తీసుకుంటుంది. అతడిని శివ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేయడం.. అదే సమయంలో రాజును స్టేషన్‌లోనే హత్య చేసేందుకు పోలీస్ కమిషనర్ నటరాజన్ తన బలగంతో రంగంలోకి దిగడం.. శివ వాళ్లతో తలపడి రాజును స్టేషన్ నుంచి తప్పించడం.. ఇలా కథ రేసీగా ముందుకు సాగుతుంది. అయితే అంత వేగంగా పరుగులు తీస్తున్న కథకు ప్రతిసారీ లవ్‌ట్రాక్, అనవసరమైన పాటలు స్పీడ్ బ్రేకర్లులా అడ్డుతగులుతుంటాయి. ఓ అదిరిపోయే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో విరామమిచ్చిన తీరు మెప్పిస్తుంది. ప్రథమార్ధం వరకు ఫర్వాలేదనట్లుగా సాగిన సినిమా.. ద్వితీయార్ధంలో పూర్తిగా గాడి తప్పింది. (custody movie review) రాజును కాపాడుకుంటూ శివ పోలీసులతో చేసే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలాగే ఉంటుంది. అయితే మధ్యలో వచ్చే శివ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి సినిమా ఓ సాధారణ ప్రతీకార కథలా మారిపోతుంది. మధ్యలో ‘సింధూర పువ్వు’ రాంకీ చేసే ఓ యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు ఊహలకు తగ్గట్లుగా ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే సుదీర్ఘమైన ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అక్కడక్కడా మెప్పిస్తుంది. ఓ చిన్న కోర్టు రూం డ్రామాతో సినిమా పేలవంగా ముగుస్తుంది.
ఎవరెలా చేశారంటే: ఓ సామాన్య కానిస్టేబుల్‌గా శివ పాత్రలో నాగచైతన్య చాలా సెటిల్డ్‌గా నటించాడు. యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డాడు. కృతిశెట్టి పాత్ర కథలో ఆద్యంతం కనిపిస్తుంది. నటన పరంగా కొత్తగా ఆమె చేసిందేమీ లేదు కానీ, ఈసారి అక్కడక్కడా ఆమెను యాక్షన్ కోణంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. (custody movie review) అరవింద్ స్వామి, శరత్ కుమార్‌ల పాత్రలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వాళ్లిద్దరూ తెరపై కనిపించినప్పుడల్లా సినిమాలో కొత్త ఊపు కనిపిస్తుంటుంది. అతిథి పాత్రలో రాంకీ కనిపించింది కొద్దిసేపే అయినా అది ప్రేక్షకులకు మంచి జోష్ ఇస్తుంది. చైతూ అన్నగా జీవా కూడా సినిమాలో కాసేపు తళుక్కున మెరుస్తారు. కానీ, ఆ పాత్ర మరీ రొటీన్‌గానే ఉంటుంది. సంపత్ రాజ్, జయప్రకాష్, ప్రియమణి, వెన్నెల కిషోర్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. వెంకట్ ప్రభు కథలు ఎంత విభిన్నంగా ఉంటాయో.. స్క్రీన్‌ప్లే అంత కొత్తగా రేసీగా ఉంటుంది. కానీ, ఈ చిత్ర విషయంలో అనవసరంగా ప్రేమకథను ఇరికించి ఓ భిన్నమైన కథను దెబ్బ తీశారు. (custody movie review) అసలీ కథలో లవ్ ట్రాక్ లేకున్నా సినిమాకు వచ్చే నష్టమేమీ లేదు. శివ-రేవతిల ప్రేమకథలోనూ.. శివ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోనూ అంత ఫీల్ కనిపించదు. యాక్షన్ ఎపిసోడ్‌లను డిజైన్ చేసిన విధానం బాగుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఒక్కటీ గుర్తుంచుకునేలా లేవు. చాలా పాటల్లో తమిళ వాసన కనిపిస్తుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- బలాలు
- + కథా నేపథ్యం
- + చైతన్య, అరవింద్ స్వామి, శరత్ కుమార్ నటన
- + యాక్షన్ ఎపిసోడ్స్
- బలహీనతలు
- - నిదానంగా సాగే కథనం
- - నాయకానాయికల లవ్ ట్రాక్
- చివరిగా: అక్కడక్కడా మెప్పించే ‘కస్టడీ’ (custody movie review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు