MAA Elections: ఎవరు గెలిచినా మా భవనానికి రూ.6కోట్లు ఇస్తాం: సీవీఎల్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో ఏ ప్యానెల్‌ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6కోట్లు ఇచ్చేందుకు ఒకరు సిద్ధంగా ఉన్నారని సీవీఎల్‌ ప్రకటించారు.

Published : 06 Oct 2021 01:17 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో ఏ ప్యానెల్‌ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6కోట్లు ఇచ్చేందుకు ఒకరు సిద్ధంగా ఉన్నారని సినీ నటుడు , మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగి విరమించుకున్న సీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది ఎన్నికలు అయిన తర్వాత ‘మా’ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున చెబుతానని తెలిపారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘దేవుడు నాకు కలలో కనిపించి ‘నీకు ప్రెసిడెంట్‌ పదవి కావాలా? మా సభ్యుల సంక్షేమం కావాలా’ అని అడిగాడు. ‘సభ్యుల సంక్షేమమే కావాలి’ అని అనుకున్నా. అందుకే విత్‌డ్రా చేసుకున్నా. నన్ను ఎవరూ భయపెట్టలేదు. ఆశ చూపలేదు. రెండు ప్యానెల్స్‌కు నాదో విన్నపం. మురళీమోహన్‌ తీసుకొచ్చిన రిజల్యూషన్‌ని అమలు చేయండి. ఏ ప్యానెల్‌ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6 కోట్లు ఇవ్వడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు. వాళ్లెవరో కొత్తగా ఎన్నికైన ‘మా’ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున ప్రకటిస్తా. ఆరోగ్య బీమాను పక్కాగా అమలుచేయాలి. ఏ సభ్యుడు ఆకలితో బాధపడకూడదు. పెన్షన్‌కు సంబంధించి ప్రస్తుతం 30మందికి నెలకు రూ.6వేలు ఇస్తుండగా మరో రూ.4వేలు కలిపి రూ.10వేలు రెండేళ్ల పాటు ఇవ్వడానికి కొందరు వ్యక్తులు ఒప్పుకొన్నారు. వాళ్లెవరూ ‘మా’ సభ్యులు కాదు. నటులను అభిమానించే వారు. నేను అధ్యక్షుడినైతే అమలు చేయాలనుకున్న పథకాలను గెలిచిన వాళ్లు అమలు చేసేలా ప్రయత్నిస్తా’’ అని సీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని