dabbevariki chedu: డబ్బులిచ్చే వరకూ డబ్బాలపైనే కూర్చొన్నారు!

1987లో ‘డబ్బెవరికి చేదు’ అనే సినిమా వచ్చింది. షూటింగ్‌ మొత్తం పూర్తవడంతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ, చాలామందికి డబ్బు ఇవ్వాలి.

Updated : 20 Mar 2023 14:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 1987లో ‘డబ్బెవరికి చేదు’ అనే సినిమా వచ్చింది. షూటింగ్‌ మొత్తం పూర్తవడంతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ, చాలామందికి డబ్బు ఇవ్వాలి. నటీనటులు తెలుగు సినిమా నటుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సినిమాని కొన్న వాళ్లు సినిమా కాపీ తీసుకెళ్లడానికి జెమిని లేబొరేటరికీ వచ్చారు. బాకీ పడిన వారందరినీ జెమినీల్యాబ్‌ రావాల్సిందిగా నటుడు ప్రభాకరరెడ్డి కోరారు. (ఇందులో ఆయన కూడా ఓ పాత్ర పోషించారు) ఆయనే ఎక్కువ పట్టుబట్టి, నిర్మాతతో డబ్బు ఇప్పించారు. పలువురు నటీనటులు, టెక్నిషీయన్లు ఉదయాన్నే జెమినీల్యాబ్‌కు వెళ్లి కూర్చున్నారు. లైట్లు అద్దెకు ఇచ్చినవాళ్లు, ఇతర టెక్నీషియన్లు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు సంఘానికి చెందిన పెద్దలూ అందరూ వచ్చారు. ఆ సినిమా నిర్మాతలలో ఒకరు అక్కడికి వచ్చిన వారందరినీ చూసి జెమిని స్టూడియో గోడదూకి పారిపోయినట్టు ఎవరో చెప్పారు. (ఎంత వరకూ నిజమో తెలియదు)

ఇంకో భాగస్వామి మాత్రం మిగిలారు. అదే సమయంలో సినిమా బయ్యర్లు ప్రింట్లు తీసుకెళ్లడానికి వచ్చారు. వెంటనే ప్రభాకర్‌రెడ్డి ఆ డబ్బాలు బయటకు తీసుకెళ్లనీయకుండా వాటి మీద కూర్చొని అందరికీ బ్యాలెన్స్‌లు చెల్లించమన్నారు. ఆ భాగస్వామి ఒకటే ఏడుపు. ఓ పక్క బయ్యర్లకి ప్రింట్లు ఇవ్వకపోతే ఒప్పుకోరు. ఇవ్వడానికి నటులు ఒప్పుకోరు. ఈ గొడవల్లో ఇవ్వవలసిన డబ్బులో ఎవరెవరు ఎంత వదులుకోగలరో చెప్పమని అడిగితే అందరూ తగ్గించుకున్నారు. లైట్లు ఇచ్చిన అతనికి రూ.27వేలు ఇవ్వవలసి ఉంటే, 7వేలు వదులుకున్నారు. అలా అందరికీ సర్దుబాటు చేయించే సరికి సాయంకాలం అయింది. ఎవరూ భోజనం మాట ఎత్తకుండా అక్కడే ఉండి ‘డబ్బు మాకూ చేదు కాదు’ అని దక్కిందే దక్కుడు అని వసూలు చేసుకుని వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని