Dahaad Review: వెబ్‌సిరీస్‌ రివ్యూ: దహాద్‌.. సోనాక్షి ఓటీటీ ఎంట్రీ సిరీస్‌ ఎలా ఉంది?

Dahaad Web Series Review: సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన ‘దహాద్‌’ ఎలా ఉందంటే?

Updated : 12 May 2023 17:07 IST

Dahaad Web Series Review: వెబ్‌సిరీస్‌: దహాద్‌; నటీనటులు: సోనాక్షి సిన్హా, గుల్షన్‌ దేవయ్య, విజయ్‌వర్మ, సోహుమ్‌ షా, జోయ్‌ మోరానీ తదితరులు; సినిమాటోగ్రఫీ: తాన్య సతమ్‌; ఎడిటింగ్‌: ఆనంద్‌ సుబాయా; సంగీతం: గౌరవ్‌రైనా, తరానా మార్వా; క్రియేటర్స్‌: రీమా కగ్టి, జోయా అక్తర్‌; దర్శకత్వం: కీమా కగ్టి, రుచికా ఒబెరాయ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, కథలతో యువతను విశేషంగా అలరిస్తున్నాయి వెబ్‌సిరీస్‌లు. కాస్త ఆలస్యమైనా ఎక్కువ మందికి చేరువ చేసేందుకు పలు భాషల్లో అనువాదం చేసి మరీ అందిస్తున్నారు మేకర్స్‌. అలా తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న వెబ్‌సిరీస్‌ ‘దహాద్‌’. కథానాయిక సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన తొలి వెబ్‌సిరీస్‌. మరి ఈ ‘దహాద్‌’(గర్జన) కథేంటి? సోనాక్షి ఎలా నటించింది.

కథేంటంటే: రాజస్థాన్‌లోని మాండ్వా పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తుంటుంది అంజలి భాటి (సోనాక్షి సిన్హా). తండ్రి ఆశయాలకు అనుగుణంగా పెరిగి, పోలీస్‌ ఉద్యోగాన్ని సాధిస్తుంది. ఆ స్టేషన్‌ పరిధిలో నివసించే కృష్ణ చందాల్‌ అనే యువతి ప్రేమించిన అబ్బాయితో వెళ్లి పోతున్నానని లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అయితే, ఎన్ని రోజులైన ఆమె ఫోన్‌ చేయకపోవడం, ఆమె నంబరు స్విచ్ఛాఫ్‌ రావడంతో ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. దీంతో కృష్ణ చందాల్‌ కేసు విచారణ మొదలు పెట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 27మంది యువతులు ఇంటి నుంచి వెళ్లిపోతున్నామని కృష్ణలాగే లేఖరాసి కనపడకుండా పోతారు. అయితే, అనుకోకుండా పోలీసులు కృష్ణ మృతదేహాన్ని మార్చురీలో గుర్తిస్తారు. సైనైడ్‌ తీసుకుని ఆమె చనిపోయిందని పోస్ట్‌మార్టంలో తేలుతుంది. కనపడకుండా పోయిన మిగిలిన యువతులు కూడా అలాగే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తిస్తారు. ఆ యువతులందరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?(Dahaad web series review) అది నిజంగానే ఆత్మహత్య? లేక హత్య? ఈ కేసులో అంజలి ఎలా విచారణ చేపట్టింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలేంటి? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: క్రైమ్‌, మిస్టరీ థ్రిల్లర్‌. ఇటీవల కాలంలో ఈ నేపథ్యంతో అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకుడిని ఆసాంతం కుర్చీలో కూర్చోబెట్టి అలరిస్తున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ల విషయంలో రెండు ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. ఒకటి ఎవరు? ఎందుకు? హత్యలు చేస్తున్నారో చివరి వరకూ తెలియదు. మరొకటి హంతకుడు ఎవరో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. అయితే, ఎందుకు హత్యలు చేస్తున్నాడు? పోలీసులకు చిక్కుతాడా? లేదా? అన్నదానిపై సినిమా/సిరీస్‌ విజయం ఆధారపడి ఉంటుంది.(Dahaad web series review) రెండో కేటగిరికి చెందిన ‘దహాద్‌’ ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది. 27మంది యువతులు అదీ, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు అరుదుగా దొరికే సైనైడ్‌ తీసుకుని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న హుక్‌ పాయింట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడంలో మేకర్స్‌ విజయం సాధించారు. అసలు సిరీస్‌ ఏంటి? దాని కథేంటి? అన్న విషయాన్ని ఒకట్రెండు ఎపిసోడ్స్‌తోనే చెప్పేశాడు దర్శకుడు. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నామంటూ యువతులు లేఖరాసి వెళ్లిపోవడం, ఆ తర్వాత విగతజీవులుగా మారడం అంతు చిక్కని విషయమైతే, వాళ్లను ఎవరో శారీరకంగా అనుభవించి ఉండటం అసలైన ట్విస్ట్‌. సాధారణ మిస్సింగ్‌ కేసుగా విచారణ చేపట్టిన పోలీసులు ఒక్కో లింక్‌ను పట్టుకుని వెళ్తుంటే ఆసక్తికర విషయాలు బయటపడుతుంటాయి. (Dahaad web series review) ప్రేక్షకుడికి అవన్నీ ఉత్కంఠగా అనిపించినా, అసలు చేస్తున్నదెవరో సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడికి తెలిసిపోయిన తర్వాత ఆ ఆసక్తి కాస్త సన్నగిల్లుతుంది. అయితే, ఊహించని సన్నివేశాలతో మలుపులతో స్క్రీన్‌ప్లే పరుగులు పెడుతుంటే, అది పెద్దగా ప్రభావం చూపదు. ఈ సిరీస్‌ విషయంలో అదే మైనస్‌. కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. నిందితుడు సమాజం దృష్టిలో మంచివాడిగా కనపడుతూ పోలీసుల ఎదుటే తిరుగుతున్నా.. అనుమానిస్తారు తప్ప ఇవన్నీ అతడే చేస్తున్నాడని గుర్తించడానికి సరైన ఆధారాలు లేక సమయం పడుతుంది. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగున్నా పోలీస్‌ ప్రొసీడింగ్స్‌, క్యారెక్టర్‌ అనాలాసిస్‌, సీన్‌ డీటెలింగ్‌ కారణంగా సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడికి నిడివి కాస్త ఇబ్బంది పెడుతుంది.

ఒకవైపు కేసు విచారణ జరుగుతుండగా, అంతర్లీనంగా కుల వ్యవస్థ, ధనిక-పేద వర్గాల మధ్య తారతమ్యం వంటి అంశాలను దర్శకులు చర్చించారు. ‘చనిపోయిన యువతులందరూ దళిత, నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లు కావడం వల్లే కేసు విచారణ వేగంగా ముందుకు సాగడం లేదు. అదే, అగ్రకులాల్లోని యువతి కనపడకుండా పోయి ఉంటే ఆందోళనలు తారస్థాయిలో ఉండేవి’ అంటూ ఎస్‌ఐగా సోనాక్షి చెప్పే సంభాషణలు నేటి ఆధునిక కాలంలోనూ కొనసాగుతున్న కులవ్యవస్థను ప్రశ్నించాయి. తమ మతం అమ్మాయిని ప్రేమించాడని ఇంకొక మతానికి చెందిన యువకుడిని రైలు పట్టాలపై కట్టేసే సన్నివేశం నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నా, ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్‌కు అవన్నీ అదనపు సన్నివేశాలే. మెయిన్‌ ప్లాట్‌ చుట్టూ తిరగాల్సిన కథను నిడివి కోసం అక్కడక్కడా ఇలాంటి సబ్‌ప్లాట్స్‌పై నడిపించారు. అవన్నీ అనవసర సన్నివేశాలు. అలాగే చివరి ఎపిసోడ్‌ను చకచకా చుట్టేసినట్లు అనిపిస్తుంది. మీరు క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవారైతే ‘దహాద్‌’ (Dahaad web series review) కచ్చితంగా అలరిస్తుంది. ఈ వీకెండ్‌లో మీకొక మంచి ఛాయిస్‌. కుటుంబంతో చూడటానికి కాస్త ఇబ్బంది.. అంతే. తెలుగు ఆడియో అందుబాటులో ఉంది.

ఎవరెలా చేశారంటే: సినీతారలందరూ వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సోనాక్షి కూడా అదే పని చేసి, అందులో విజయం సాధించింది.(Dahaad web series review) స్వతంత్ర భావాలు కలిగిన ఎస్‌ఐ అంజలి భాటి పాత్రలో చక్కగా నటించింది. సిరీస్‌లోని పాత్రలకు తెలంగాణ యాసతో డబ్బింగ్‌ చెప్పించారు. సోనాక్షి పోషించిన పోలీస్‌పాత్రకు ఆ వాయిస్‌ అదనపు ఆకర్షణ తెచ్చింది. ఆనంద్‌ స్వరంకర్‌ పాత్రలో విజయ్‌ వర్మ తనదైన నటనతో మెప్పించాడు. చాలా కూల్‌గా, సెటిల్డ్‌గా నటించాడు. ఎస్‌హెచ్‌వోగా గుల్షన్‌ దేవయ్య, ఎస్‌ఐగా సోహమ్‌ షా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సిరీస్‌ బాగుంది. గౌరవ్‌, తరన్‌ నేపథ్య సంగీతం బాగుంది. తాన్య సినిమాటోగ్రఫీ వాస్తవికతను తెరపై చూపించింది. ఆనంద్‌ సుబాయా ఎడిటింగ్‌కు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఒక్కో ఎపిసోడ్‌ నిడివి సుమారు 50 నిమిషాల పైనే సాగుతుంది. చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా, ఆ పని చేయలేదు. ఒక్కో ఎపిసోడ్‌ నుంచి 10 నుంచి 15 నిమిషాలు ట్రిమ్‌ చేసి ఉంటే, స్క్రీన్‌ప్లే రేసీగా ఉండేది. దర్శకులు రీమా కగ్టి, రుచికా ఒబెరాయ్‌ ఆసక్తి కలిగించేలా ‘దహాద్‌’ను తీర్చిదిద్దడంలో విజయం సాధించారు.

  • బలాలు
  • + కథ, దర్శకత్వం
  • + సోనాక్షి, విజయ్‌వర్మ నటన
  • + సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - నిడివి
  • చివరిగా: ‘దహాద్‌’.. మెప్పించే మరో క్రైమ్‌ థ్రిల్లర్‌
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని