DANGEROUS: వర్మ ‘మా ఇష్టం’ విడుదల వాయిదా

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌ డ్రామా చిత్రం ‘మా ఇష్టం’(డేంజెరస్‌).

Updated : 07 Apr 2022 20:38 IST

హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌ డ్రామా చిత్రం ‘మా ఇష్టం’(డేంజెరస్‌). అప్సరారాణి(Apsara Rani), నైనా గంగూలీ(Naina ganguly) కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 8న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు వర్మ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘‘మా ఇష్టం డేంజెరస్‌ సినిమా విడుదల విషయంలో లెస్బియన్ సబ్జెక్ట్  కారణంగా థియేటర్లో విడుదల చేసేందుకు యజమానులు ముందుకు రావటం లేదు. దీంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మరో విడుదల తేదీని వెల్లడిస్తాం’’ అని వర్మ ట్వీట్‌ చేశారు.  ఇటీవల ‘మాఇష్టం’ గురించి వర్మ మాట్లాడుతూ..  ‘ఈ సినిమా పోస్టర్‌ చూసినా, ట్రైలర్‌ చూసినా ‘పెద్దవాళ్లకి మాత్రమే’ తరహా సినిమానేమో అనే అభిప్రాయం కలుగుతుంది. నిజానికి ఇదొక క్రైమ్‌ డ్రామా. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా సాగుతుంది. ఇన్నేళ్లుగా ఇన్ని సినిమాలు చేశాక నేనొక ప్రయోగం చేస్తే నాకు పోయేదేమీ లేదు’ అని చెప్పుకొచ్చారు.

వర్మ మోసం చేస్తున్నారు: నట్టి కుమార్‌

సినిమాల పేరుతో దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్ర పరిశ్రమలో ఎంతో మందిని మోసం చేస్తున్నారని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. రాజకీయ నాయకుల పేరుతో సినిమాలు తీస్తానని చెప్పి కోట్లాది రూపాయల మోసాలకు వర్మ పాల్పడుతున్నారని నట్టికుమార్ విమర్శించారు. సుమారు 50 మంది వరకు వర్మ బాధితులుంటారని, చిత్ర పరిశ్రమలో 50 కోట్లకుపైగా వర్మకు అప్పులున్నాయని నట్టికుమార్ తెలిపారు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా సినిమాలు విడుదల చేస్తూ అన్యాయం చేస్తున్నాడని నట్టికుమార్ ఆరోపించారు. ‘మా ఇష్టం’ చిత్రం సెన్సార్ కాకుండానే ఎలా విడుదల చేస్తాడని ప్రశ్నించిన నట్టికుమార్... మోసాలకు పాల్పడుతూ వర్మ తన ఉనికిని చాటుకుంటున్నారన్నారు. వర్మ బాధితులంతా కలిసి ముందుకు రావాలని, వర్మపై  న్యాయస్థానంలో మరిన్ని కేసులు వేయబోతున్నట్లు నట్టికుమార్ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని