Darlings Review: రివ్యూ: డార్లింగ్స్‌

అలియా భట్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘డార్లింగ్స్‌’ చిత్రం ఎలా ఉందంటే....

Updated : 06 Aug 2022 10:23 IST

Darlings Review చిత్రం: డార్లింగ్స్‌; తారాగణం: అలియా భట్‌, షెఫాలీ షా, విజయ్‌ వర్మ, రోషన్‌ మ్యాథ్యూ తదితరులు; ఛాయాగ్రహణం: అనిల్‌ మెహతా; సంగీతం: ప్రశాంత్‌ పిళ్లై (నేపథ్య సంగీతం), విశాల్‌ భరద్వాజ్‌, మెల్లో డీ (పాటలు); కూర్పు: నితిన్‌ బైద్‌; నిర్మాణ సంస్థ‌లు: రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌; దర్శకత్వం: జస్మీత్‌ కె. రీన్‌; విడుద‌ల‌: నెట్‌ఫ్లిక్స్‌.

విడుదలకు ముందే కొన్ని సినిమాలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ఆయా చిత్రాలను ‘బాయ్‌కాట్‌’ చేయాలంటూ నెట్టింట ఆందోళనకు దిగుతుంటారు. టీజర్‌, ట్రైలర్‌లతో అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న చిత్రాల్లో ‘డార్లింగ్స్‌’ (Darlings) ఒకటి. అలియా భట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్ర పోషించి, నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించిన సినిమా ఇది. జస్మీత్‌ కె. రీన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, డార్లింగ్స్‌ ఎవరు? వారి కథేంటి?

కథేంటంటే: బద్రునిసా అలియాస్‌ బద్రు (అలియా భట్‌)కి తల్లే (షెఫాలీ షా) ప్రపంచం. ఆమె మాట ప్రకారమే బద్రు నడుచుకుంటుంది. ఎంతో హుషారుగా ఉండే బద్రుని హమ్‌జా (విజయ్‌ వర్మ) ప్రేమ పెళ్లి చేసుకుంటాడు. రైల్వేలో టీసీగా పనిచేసే హమ్‌జా మద్యానికి బానిస. కోపం కూడా ఎక్కువే. భార్య చేసిన వంటల్లో రాళ్లు వచ్చినా ఆమెపై చేయి చేసుకుంటుంటాడు. ఒకానొక సమయంలో ఆమెను అనుమానిస్తాడు. భార్య అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నం చేసినా అవేవీ పట్టించుకోకుండా చిత్ర హింసలు పెడతాడు. తమ వైవాహిక జీవితం బాగుండాలని భర్తని మద్యానికి దూరం చేయాలనుకుంటుంది బద్రు. ఆ క్రమంలో ఆమె వేసిన ఓ ప్లాన్‌ హమ్‌జాకి తెలిసిపోతుంది. దాంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నడుస్తుంది. భర్త నుంచి శాశ్వతంగా దూరమయ్యేందుకు తన తల్లితో కలిసి బద్రు రచించిన ప్రణాళిక ఏంటి? అసలు, బద్రు- హమ్‌జా కాపురంలో కలతలు ఎవరి వల్ల వచ్చాయి? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే: ముంబయిలోని ఓ మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలో సాగే కథ ఇది. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కట్టుకున్న వాడు రోజూ తాగొచ్చి కొట్టడం, ప్రతి చిన్న విషయానికీ అనుమానించడం, ఈ చెర నుంచి భార్య విముక్తి కోరుకోవాలనుకోవడం.. ఇలాంటి వార్తలు మనకి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఈ అంశాన్నే ఇతివృత్తంగా తీసుకుని తనదైన శైలిలో తెరపైకి తీసుకొచ్చారు దర్శకురాలు జస్మీత్‌. ప్రచార చిత్రాల్లో కనిపించిన ఇలాంటి సన్నివేశాలను చూసే ‘గృహ హింసను ప్రోత్సహించే ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలి’ అంటూ ట్విటర్‌లో ఇటీవల పెద్ద ఎత్తున చర్చ సాగింది. అది పక్కన పెడితే, కేవలం నాలుగు ప్రధాన పాత్రలతో సుమారు రెండున్నర గంటల సినిమాని రూపొందించటం అంత తేలిక కాదు. ఈ విషయంలో డైరెక్టర్‌ విజయాన్ని అందుకున్నారు. నాయకానాయికులు పెళ్లి గురించి మాట్లాడుకునే సన్నివేశంతో సినిమా ప్రారంభవుతుంది. కట్‌చేస్తే, మూడేళ్లు గడిచిపోతాయి. వారి వైవాహిక జీవితంలోని కలతలతో కథ మొదలవుతుంది. బద్రు, హమ్‌జాకి ఎలా పరిచయమైంది? అనే వివరాలేవీ చెప్పకుండా నేరుగా పెళ్లి ప్రస్తావనతోనే సినిమాను ప్రారంభించటం ప్రేక్షకుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతుంది. 

కథానాయిక ‘అది కావాలి.. ఇది కావాలి’ అంటూ కథానాయకుడిని అడిగితే మిడిల్‌ క్లాస్‌ భర్తగా హీరో ఏం సమాధానం చెప్తాడో ఇప్పటికే చాలా సినిమాల్లో కనిపించింది. ఈ కథలోనూ అలాంటి సీన్‌ అంతర్గతంగా ఉంటుంది. నాయకానాయికల మధ్య రోజూ రాత్రి ఘర్షణ చోటు చేసుకోవడం, ఉదయాన్నే సారీ చెప్పుకోవడం.. ఇలాంటి సన్నివేశాలతోనే ప్రథమార్ధాన్ని నడిపించారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. చిన్న పాయింట్‌ని సాగదీసేందుకు బహుశా ఇలా చేశారేమో అన్న సందేహం కలగక మానదు. చిక్కుముళ్ల నుంచి బయట పడటానికి అలియా తన తల్లి షెఫాలీతో కలిసి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరగడం.. కప్ప, తేలు కథ చెప్పడం.. మంచి కామెడీ పండించాయి. పురుషాహంకార ధోరణికి భార్య చరమగీతం పాడాలనుకునే సన్నివేశాలు తాప్సీ నటించిన ‘థప్పడ్‌’ను గుర్తుచేస్తాయి. ద్వితీయార్ధంలో.. కథానాయకుడు మంచి వ్యక్తిగా మారిపోయాడు అని ప్రేక్షకుడికి అనిపించేలోపు రివీల్‌ అయ్యే ట్విస్ట్‌ ఆసక్తి రేకెత్తిస్తుంది. భర్తను దూరం పెట్టేందుకు కథానాయిక వేసిన మాస్టర్‌ ప్లాన్‌తో సాగే క్లైమాక్స్‌ ఎవరూ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇదే సినిమాకి హైలైట్‌. ద్వితీయార్ధంలో కొంత అస్పష్టత కనిపించింది. భర్త విషయంలో తాను చేసిన తప్పుని తలచుకుని కథానాయిక బాల్యాన్ని గుర్తుచేసుకుంటుంది. ఆ క్రమంలో ప్రస్తుతం తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో గతంలో తన తల్లికి అదే ఎదురైన సందర్భం అది. సంబంధిత సన్నివేశాన్ని అసంపూర్ణంగా చూపించారు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ని దర్శకురాలు బలంగా చెప్పలేకపోయారనిపించింది.

ఎవరెలా చేశారంటే: సినిమాలో ఉన్న నాలుగు ప్రధాన పాత్రల్లో అలియా భట్‌ది అగ్రస్థానం. బద్రు అనే గృహిణిగా ఒదిగిపోయింది. అటు అమ్మ మాట వినాలా? ఇటు భర్తతో కలిసుండాలా అనే పరిస్థితి ఎదురైన సీన్‌లో అందరినీ కట్టిపడేస్తుంది. హమ్‌జాగా విజయ్‌ వర్మ, బద్రు తల్లిగా షెఫాలీ షా తమ తమ పాత్రలతో మెప్పించారు. రోషన్‌ మ్యాథ్యూ పరిధి మేరకు నటించారు. అర్జిత్‌ సింగ్‌, విశాల్‌ భరద్వాజ్‌ ఆలపించిన ‘లా ఇలాజ్‌’ అనే గీతం హృదయాన్ని హత్తుకుంటుంది. ప్రశాంత్‌ పిళ్లై అందించిన నేపథ్య సంగీతం, అనిల్‌ మెహతా కెమెరా పనితనం ఫర్వాలేదనిపించాయి. నితిన్‌ తన కత్తెరకు ఇంకా పనిచెప్తే బాగుండేది. జస్మీత్‌ దర్శకత్వం ఓకే.

బలాలు

+ అలియా భట్‌ నటన

+ ద్వితీయార్ధంలోని మలుపులు

+ పతాక సన్నివేశం

బలహీనతలు

- ప్రథమార్ధం

- నెమ్మదిగా సాగే సన్నివేశాలు

చివరిగా: కథ పాతదే అయినా ఈ ‘డార్లింగ్స్‌’ కొత్తగా కనిపించారు. 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని