Das Ka Dhamki Review: రివ్యూ: దాస్ కా ధమ్కీ
Das Ka Dhamki Review: విష్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ ఎలా ఉందంటే?
Das Ka Dhamki Review: చిత్రం: దాస్ కా ధమ్కీ; నటీనటులు: విష్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, అజయ్, మహేష్, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు; సంగీతం: లియోన్ జేమ్స్; ఎడిటింగ్: అన్వర్ అలీ; సినిమాటోగ్రఫీ: దినేష్ కె.బాబు; దర్శకత్వం: విష్వక్ సేన్; నిర్మాత: కరాటే రాజు; విడుదల తేదీ: 22-03-2023
‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’ చిత్రాలతో గతేడాది బాక్సాఫీస్ ముందు జోరు చూపించారు హీరో విష్వక్ సేన్ (Vishwak Sen). ఈ ఉగాదికి ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది ఆయనకు తొలి పాన్ ఇండియా చిత్రం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో నిర్మించడం మరో విశేషం. అందుకే ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటం.. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ (NTR) ముఖ్య అతిథిగా విచ్చేయడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఇన్ని అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన దాస్.. ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించాడు? (Das Ka Dhamki Review) హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన పడిన కష్టానికి తగ్గ ఫలితం లభించిందా? లేదా?
కథేంటంటే: కృష్ణదాస్ (విష్వక్ సేన్) అనాథ. తన మిత్రులు (హైపర్ ఆది, మహేష్)లతో కలిసి ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తుంటాడు. ఒకరోజు అదే హోటల్‌కు వచ్చిన కీర్తి (నివేదా పేతురాజ్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గరవ్వాలన్న ఆలోచనతో తాను వెయిటర్ అన్న విషయాన్ని దాచి పెట్టి.. కోటీశ్వరుడిలా నటించడం మొదలుపెడతాడు. తన పేరు సంజయ్ రుద్ర అని.. ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో అని అబద్దాలు చెబుతాడు. కీర్తి.. కృష్ణ ప్రేమలో పడిందనుకునే సమయంలోనే అతను కోటీశ్వరుడు కాదు వెయిటర్ అన్న నిజం ఆమెకు తెలుస్తుంది. దీంతో అతన్ని ఛీ కొట్టి వెళ్లిపోతుంది. ఆమె కోసం చేసిన పనుల వల్ల హోటల్‌లో ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు కృష్ణదాస్. అదే సమయంలో అతని జీవితంలోకి సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) ప్రవేశిస్తాడు. తను ఏ సంజయ్ రుద్ర పేరైతే వాడుకున్నాడో.. అతను తన అన్నయ్య కొడుకని, క్యాన్సర్‌కు మందు కనిపెట్టాడని, కానీ, అనుకోకుండా ఓ ప్రమాదంలో చనిపోయాడని చెబుతాడు. క్యాన్సర్ లేని ప్రపంచం చూడాలన్న సంజయ్ కల నెరవేరడం కోసం.. అతని కుటుంబం, వ్యాపారం రోడ్డున పడకుండా ఉండటం కోసం అతనిలా ఉన్న తను ఆ స్థానంలో కొన్నాళ్లు నటించాలని కృష్ణదాస్‌ను కోరతాడు. అయితే సంజయ్ స్థానంలోకి వచ్చిన తర్వాత కృష్ణ జీవితం మరిన్ని మలుపులు తిరుగుతుంది. మరి అవేంటి? నిజంగా సంజయ్ చనిపోయాడా? లేదా? కృష్ణ, సంజయ్ ఒకలా ఉండటానికి కారణమేంటి? కృష్ణ ప్రేమకథ ఏమైంది? వంటి ప్రశ్నలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే: ఒకేలా కనిపించే ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే కథ ఇది. ప్రధమార్ధమంతా కృష్ణదాస్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వెయిటర్‌గా అతని జీవితం.. ఉద్యోగంలో ఎదుర్కొనే అవమానాలు.. కీర్తి తన జీవితంలోకి రావడం.. ఆమెతో ప్రేమలో పడటం ఇలా ప్రధమార్ధంలో కథంతా సాదాసీదాగా సాగిపోతుంటుంది. ఈ ప్రేమకథలో ఎక్కడా కొత్తదనం కనిపించకున్నా.. కొన్ని వాణిజ్య హంగులతో అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. కోటీశ్వరుడిలా నటిస్తూ.. కీర్తికి దగ్గరయ్యేందుకు కృష్ణ చేసే ప్రయత్నాలు కొన్ని నవ్వులు పూయిస్తాయి. అలాగే కృష్ణ ప్రేమకు సహాయపడే క్రమంలో ఆది, మహేష్‌ల పాత్రలూ వినోదాలు పంచుతాయి. కృష్ణ కోటీశ్వరుడు కాదు వెయిటర్ అన్న విషయం కీర్తికి తెలిసిన దగ్గర్నుంచే కథ వేగం పుంజుకుంటుంది. విరామ సన్నివేశాలు ఊహకు తగ్గట్లుగానే ఉన్నా.. ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తించేలాగే ఉంటాయి. (Das Ka Dhamki Review) సంజయ్ స్థానంలోకి కృష్ణ ప్రవేశించిన దగ్గర్నుంచి తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. కానీ, అనవసరమైన సిల్లీ కామెడీ సన్నివేశాల వల్ల ఆ ఉత్కంఠత ఆరంభంలోనే ఆవిరైపోతుంది. సంజయ్ రుద్ర పాత్ర తాలూకూ గతం.. తన స్థానంలోకి కృష్ణదాస్‌ను తీసుకురావడానికి గల కారణాల్ని చూస్తే.. ఇది ‘అమిగోస్’కు మరో వెర్షన్‌లా అనిపిస్తుంది. సంజయ్, కృష్ణల పాత్రలు ఎదురుపడినప్పటి నుంచి కథ పూర్తిగా గందగోళంగా తయారవుతుంది. కీర్తి పాత్రలోని మరో కోణం ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది. పతాక సన్నివేశాల్ని ప్రేక్షకులు ముందుగానే ఊహించగలుగుతారు. రెండో భాగం కోసం క్లైమాక్స్‌ను అనవసరంగా సాగదీశారు.
ఎవరెలా చేశారంటే: కృష్ణదాస్, సంజయ్ రుద్ర పాత్రల మధ్య వైవిధ్యాన్ని విష్వక్‌సేన్ చక్కగా చూపించారు. ముఖ్యంగా ప్రతినాయక ఛాయలున్న సంజయ్ పాత్రలో విష్వక్ నటన ఆకట్టుకుంది. అయితే ఆ పాత్రను ద్వితీయార్ధంలో కొంత సమయం వరకూ మాత్రమే పరిమితం చేశారు. కీర్తి పాత్రలో నివేదా అందంగా కనిపించింది. నటన పరంగా ఆమె పాత్రకు అంత ఆస్కారంలేదు. రావు రమేష్‌ది చాలా సాదాసీదా పాత్ర. ఆయనలోని నటుడికి పని చెప్పేది కాదు.(Das Ka Dhamki Review) హైపర్ ఆది, మహేష్ కనిపించినంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని ఎపిసోడ్లు పేలగా.. మరికొన్ని తుస్సుమన్నాయి. ముఖ్యంగా ‘హ్యాపీడేస్’లోని టైసన్ పాత్ర తరహాలో మహేష్ చెప్పిన డైలాగ్‌లు, తరుణ్ భాస్కర్‌తో ఆయన ఆడుకునే ఎపిసోడ్ నవ్వులు పూయించాయి. దర్శకుడిగా విష్వక్ ఫర్వాలేదనిపించినా, ఎంచుకున్న కథలోనే బలం లేదు. ప్రధమార్ధం కాస్త కాలక్షేపాన్నిచ్చినా.. ద్వితీయార్ధం సహనానికి పరీక్ష. పతాక సన్నివేశాలకు ముందొచ్చే ట్విస్ట్‌లు కొన్ని ఆకట్టుకోగా.. మరికొన్ని గందరగోళానికి గురి చేస్తాయి. పోరాట ఘట్టాలు మెప్పిస్తాయి. ‘‘మావా బ్రో’’, ‘‘పడిపోయిందే పిల్లా’’ పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు: 👍 విష్వక్ నటన; 👍 విరామ సన్నివేశాలు; 👍 పాటలు, కొన్ని కామెడీ ట్రాక్స్
బలహీనతలు: 👎 కొత్తదనం లేని కథ; 👎 ద్వితీయార్ధం
చివరిగా: దాస్ అభిమానులు.. మాస్ ప్రేక్షకులకే ఈ ధమ్కీ! (Das Ka Dhamki Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు