Nani: అప్పుడు నన్ను అలా అనుకుని ఉంటే.. ఇప్పుడిలా ఉండేవాణ్ని కాదు: నాని

ప్రతిభ విషయంలో కొత్తా పాత ఉండదన్నారు హీరో నాని. తన తాజా చిత్రం ‘దసరా’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 19 Mar 2023 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని (Nani) హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) కథానాయిక. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర బృందం పాల్గొంది.

నాని మాట్లాడుతూ..‘‘శ్రీకాంత్‌ గొప్ప దర్శకుడు. కీర్తి అద్భుతంగా నటించింది. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? దీక్షిత్‌ మంచి పాత్ర పోషించాడు’’ అని అన్నారు. ‘‘నేను లోకల్‌’ తర్వాత నానితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. నేనీ చిత్రంలో పెద్దగా పోరాటాలు చేయలేదు. ఈ సినిమా క్లైమాక్స్‌ అందరినీ కట్టిపడేస్తుంది’’ అని కీర్తిసురేశ్‌ తెలిపారు. ‘‘నాని తొలి సినిమాలో నేను ఆయనకు అత్తగా నటించా. దసరాలో అక్కగా, కీర్తిసురేశ్‌ తల్లిగా కనిపిస్తా’’ అని నటి ఝాన్సీ చెప్పారు. అనంతరం, విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాని, కీర్తి సురేశ్‌ సమాధానమిచ్చారు. ఆ వివరాలివీ..

* ఇందులోని విజువల్స్‌ ‘పుష్ప’, ‘కేజీయఫ్’ చిత్రాల ఫ్లేవర్‌లో ఉన్నాయి. మీ టార్గెట్‌ అదేనా?

నాని: ఈ సినిమా విషయంలో మీరు ఏదైనా ఊహించుకోండి. మాకు అలాంటి ఆలోచనే లేదు.

* ఈ తర్వాత మీ కెరీర్‌ ఎలా ఉంటుందనుకుంటున్నారు?

నాని: అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏం చేస్తే నేను అది అవుతా. ప్రాణం పెట్టి ఈ చిత్రం చేశా. అది ఎక్కడి వరకు వెళ్తుంది? ఫలితం ఏంటన్నది భగవంతుడికి వదిలేస్తున్నా. తర్వాత ఏమవుతుందనే ఆలోచన లేదు. మనసుకు నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్తున్నా.

* ప్రచారం కోసం ఎన్నో ప్రాంతాలు సందర్శించారు కదా. ఆ అనుభవం గురించి చెబుతారా?

నాని: నేనెక్కడికి వెళ్లినా ప్రేక్షకుల స్పందన బాగుంది. వారి ఆదరణ చూస్తుంటే థియేటర్లలో హిస్టీరియా క్రియేట్‌ చేస్తుందనిపించింది.

* మీరు పోషించిన ధరణి పాత్ర ఎలా ఉంటుంది?

నాని: దర్శకుడు శ్రీకాంత్‌కు తెలిసిన ప్రపంచమే ఈ సినిమా. దాన్ని మాకు పరిచయం చేశాడు. ఇందులో నేను తెలంగాణలోని వీర్లపల్లి గ్రామస్థుడిగా కనిపిస్తా. ఆ క్యారెక్టర్‌ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.

* కొత్త దర్శకుడితో పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రం చేశారు. మీ నమ్మకమేంటి?

నాని: ‘పుష్ప’ విడుదలకు ముందు సుకుమార్‌ ఒక్క భాష (తెలుగు)లో పెద్ద దర్శకుడు. ఆ తర్వాత అన్ని పరిశ్రమల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్‌ విషయానికొస్తే.. ‘దసరా’కు ముందు తను అన్ని చిత్ర పరిశ్రమలకు కొత్తవాడు. తర్వాత తన గురించి అందరికీ తెలుస్తుంది. తనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. అనుభవం ఉన్న దర్శకులతో పనిచేశా, కొత్తవారితోనూ పనిచేస్తుంటా. ప్రతిభ విషయంలో కొత్త, పాత తేడా ఉండదు. 2008లో నా విషయంలోనూ ఇలా ‘కొత్త’ అనుకుని ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేవాణ్ని కాదు కదా.

* ఇప్పటి వరకూ విలన్‌ పాత్రలను రివీల్‌ చేయలేదు?

నాని: సస్పెన్స్‌ కోసం.

* ‘హిట్‌ 3’లో నటిస్తారా?

నాని: నటిస్తా. దాని గురించి ‘హిట్‌ 2’లోనే హింట్‌ ఇచ్చాం.

* ఈ సినిమా మీకు ఎంతవరకు ప్లస్‌ అవుతుందనుకుంటున్నారు?

కీర్తి సురేశ్‌: ‘మహానటి’లాంటి చిత్రాలు ఎమోషనల్‌గా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి. ‘దసరా’ ఆ జాబితాలోనే నిలుస్తుందనుకుంటున్నా. నేనిందులో వెన్నెల పాత్ర పోషించా. సినిమా చూశాక ఆడియన్స్‌ ఆ పాత్రను మర్చిపోవడం కష్టం. దర్శకుడు నాకు నాలుగు గంటలపాటు కథ వినిపించారు. అయినా అర్థంకాలేదు. ఐదోసారి అర్థమైంది (నవ్వుతూ..).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని