Dasara: ఎట్లైతే గట్లాయె.. గుండు గుత్తగా లేపేద్దాం

ఈ వేసవి బరిలో ‘దసరా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రంతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Updated : 31 Jan 2023 09:09 IST

వేసవి బరిలో ‘దసరా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రంతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్ర టీజర్‌ను తెలుగులో రాజమౌళి, తమిళంలో ధనుష్‌, హిందీలో షాహిద్‌ కపూర్‌, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి ఏకకాలంలో విడుదల చేశారు. ‘‘ఈర్లపల్లి.. సుట్టూరా బొగ్గు కుప్పలు.. తొంగి జూత్తెగానీ కనిపియ్యని ఊరు.. మందంటే మాకు యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం’’ అంటూ నాని చెబుతున్న సంభాషణతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆయనిందులో ధరణి అనే పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్రలో తను కనిపించిన తీరు.. పలికిన సంభాషణలు, చేసిన యాక్షన్‌ హంగామా అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఆఖర్లో ‘‘ఎట్లైతే గట్లాయె గుండు గుత్తగా లేపేద్దాం బాంచ్చెత్‌’’ అంటూ నాని చెప్పిన డైలాగ్‌ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీజర్‌ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాని మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. మార్చి 30న అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారు. తెలుగు సినిమాకి నా వంతుగా ఏమిచ్చానని చాలా సార్లు ఆలోచిస్తుంటా. కానీ, ఇప్పుడు గర్వంగా చెబుతున్నా. తెలుగు, ఇండియన్‌ సినిమాకి ఈ ఏడాది నా తరపున శ్రీకాంత్‌ ఓదెల లాంటి దర్శకుణ్ని ఇస్తునా’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని