Dasari Narayana Rao: ‘దర్శకరత్న’.. దాసరి పాత్రలో జాతీయస్థాయి నటుడు!

ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత దివంగత దాసరి నారాయణరావు జీవితాధారంగా ‘దర్శకరత్న’ అనే చిత్రం తెరకెక్కనుంది.

Published : 13 Jan 2022 22:16 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత దివంగత దాసరి నారాయణరావు జీవిత కథ ఆధారంగా ‘దర్శకరత్న’ అనే చిత్రం తెరకెక్కనుంది. ధవళసత్యం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఇమేజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తాడివాక రమేష్‌ నాయుడు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విశేషాల గురించి చెప్పేందుకు ఫిలిం ఛాంబర్‌లో చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.

‘‘దాసరి నారాయణరావు గారితో నాకున్న అనుబంధమే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పురిగొల్పింది. ఆయన జీవితానికి సంబంధించి.. నాకు తెలిసిన సంఘటనలతో పాటు ఆయనతో పరిచయమున్న చాలామందిని సంప్రదించి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నా. ఓ గొప్ప చిత్రంగా తెరకెక్కించబోతున్నాం’’ అని దర్శకుడు ధవళసత్యం అన్నారు. ‘‘కొవిడ్‌ మూడో వేవ్‌ రాకపోయి ఉంటే ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యేది. పరిస్థితులు చక్కబడగానే షూటింగ్ మొదలుపెడతాం. జాతీయస్థాయి నటుడు దాసరి గారి పాత్రలో కనిపిస్తారు. ఆయన భార్య దాసరి పద్మ పాత్రలో ప్రముఖ నటి కనిపిస్తారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించబోతున్నాం’’ అని నిర్మాత తాడివాక రమేష్‌ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్‌, మోహన్‌ వడ్లపట్ల, నటుడు కాశీ విశ్వనాథ్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఛైర్మన్‌ పి. రామకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని