Updated : 12 Sep 2021 11:40 IST

Deepika Padukone: ఆ సమయంలో చనిపోదామనుకున్నా: దీపికా పదుకొణె

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె.. గతంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడి (డిప్రెషన్‌) గురించి మరోసారి ప్రస్తావించారు. తాజాగా జరిగిన ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ టీవీ షోలో దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌తో కలిసి పాల్గొన్నారామె. ఈ కార్యక్రమంలో హోస్ట్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌.. గతంలో దీపిక మానసిక పరిస్థితి గురించి గుర్తుచేయగా ఆమె దాని గురించి మాట్లాడారు. ‘‘2014లో నేను డిప్రెషన్‌లో ఉన్నాను. అప్పుడంతా నాలో ఏదో వెలితి కనిపించేంది. ఏ పనీ చేయాలనిపించేది కాదు. ఎవరితోనైనా మాట్లాడాలని గానీ.. బయటికి వెళ్లాలని గానీ అనిపించేంది కాదు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో ఏమీ చేయలేకపోతున్నా ఎందుకు బతకడం అనిపించేది. ఆ సమయంలో చనిపోదామనుకున్నా.

ఇక నా పరిస్థితి తెలుసుకున్న మా అమ్మానాన్న నన్ను చూడటానికి బెంగళూరు నుంచి ముంబయికి వచ్చారు. మళ్లీ వాళ్లిద్దరూ తిరిగి వెళ్లిపోతుంటే.. ఎయిర్‌పోర్ట్‌లో సడెన్‌గా ఏడ్చేశా. అప్పుడే నా మానసిక ఆరోగ్యం బాగోలేదనే విషయాన్ని మా అమ్మ గుర్తించారు. ఆ కన్నీళ్లు సాధారణంగా వచ్చినట్టుగా కాకుండా.. ఏదో సాయం కోసం ఏడుస్తున్నట్లు అమ్మకు అనిపించింది. వెంటనే సైకియార్టిస్ట్‌ దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చారు. అలా వైద్యుల చికిత్స తీసుకుని కొన్ని నెలల తర్వాత దాన్నుంచి బయటపడ్డాను. మానసిక ఆరోగ్యం గురించి ఒక మాట చెప్పాలి. డిప్రెషన్‌ నుంచి కోలుకున్నాక.. ఆ వ్యథని జీవితాంతం మర్చిపోలేం. మీకు మీరుగా మానసిక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా పాటించడం వల్లే నా జీవనశైలి మారింది’’ అని దీపిక చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్న ఫరాఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘దీపిక ఇలా బాధపడే సమయంలో నేను దర్శకత్వం వహించిన ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్‌ సమయంలో ఒక్క శాతం కూడా బాధపడుతున్నట్టు తెలియనిచ్చేది కాదు’’ అని అన్నారు.

అందుకే ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ ప్రారంభించా..
‘‘మానసిక సమస్యల గురించి బయట ప్రపంచం ఎందుకు ఓపెన్‌గా మాట్లడరో అర్థమయ్యేది కాదు. నేను ఇలా బాధపడేటప్పుడు నాలా ఎంత మంది ఈ వేదనను అనుభవిస్తున్నారో అని వాళ్ల గురించి ఆలోచించడం ప్రారంభించా. అందుకే 2015లో నేను పూర్తిగా కోలుకున్నాక, మెంటల్‌ హెల్త్‌ గురించి అవగాహన తీసుకొచ్చేందుకు లివ్‌, లవ్‌, లాఫ్‌ ఫౌండేషన్‌ స్థాపించా. కేవలం డిప్రెషన్‌ అనే కారణంతో ఏ ఒక్కరూ చనిపోకూడదనేదే దీని ఉద్దేశం. దీని ద్వారా ఎంతో మంది మానసిక సమస్యల నుంచి బయటపడ్డారు’’ అంటూ దీపిక సంతోషం వ్యక్తంచేశారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని