RRR: ‘నాటు నాటు’కు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’.. అసలేంటా అవార్డు? తొలుత అందుకున్న భారతీయుడెవరు?

ఇప్పుడు ఎక్కడ విన్నా ‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు’ పేరే వినిపిస్తోంది. ‘నాటు నాటు’ పాటకుగాను కీరవాణి ఆ పురస్కారం అందుకోవడమే కారణం. మరి, ఆ అవార్డు నేపథ్యం చూద్దామా..

Published : 12 Jan 2023 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe Awards 2023) పురస్కారం వరించడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్ర బృందంతోపాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వంగా ఫీలవుతోంది. సంబరాలు చేసుకుంటోంది. ప్రధాని సైతం హర్షం వ్యక్తం చేశారంటే ఆ అవార్డు ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ అవార్డు నేపథ్యమేంటి? ఇప్పటి వరకూ ఎన్ని భారతీయ చిత్రాలు నామినేట్‌/విజేతగా నిలిచాయి? తెలుసుకుందాం పదండి...

అలా మొదలైంది..

కళా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి విశ్వవ్యాప్తంగా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో హాలీవుడ్‌ ఫారిన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ (హెచ్‌. ఎఫ్‌. పి. ఎ).. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నాంది పలికింది. 1944 నుంచి ఈ అవార్డును ప్రదానం చేయడం ప్రారంభించింది. నాటి నుంచీ అత్యధికంగా జనవరిలోనే ఈ అవార్డుల వేడుక కొనసాగుతోంది. లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా నిలుస్తోంది. హాలీవుడ్‌ సినిమాలేకాకుండా అంతర్జాతీయ చిత్రాలను గుర్తించి, పురస్కారాలు ఇస్తుంటుంది. సినిమా రంగంతోపాటు టెలివిజన్‌ రంగంలో ప్రతిభ చూపిన వారికీ అవార్డులు ఇస్తుంటుంది. ప్రస్తుతం హెచ్‌. ఎఫ్‌. పి. ఎ. లో 55 దేశాలకు చెందిన 105 మంది సభ్యులున్నారు. ఆ 105 మంది ఓకే అనుకున్న తర్వాతే ఏదైనా అవార్డును ఖరారు చేస్తారు. యూఎస్‌యేతర మార్కెట్స్‌కు సినిమా వార్తలను అందించేందుకు అప్పటి ఫిల్మ్‌ జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు కలిసి లాభాపేక్ష లేకుండా స్థాపించిన సంస్థే ఈ హెచ్‌. ఎఫ్‌. పి. ఎ. ఆ అసోసియేషన్‌ 1943లో మొదలైంది. ‘ఆస్కార్‌’వంటి అవార్డులను ఇవ్వాలనుకున్న ఆ అసోషియేషన్‌ మరుసటి ఏడాది నుంచే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’కు శ్రీకారం చుట్టింది.

పరిణామ క్రమం..

తొలుత కొన్ని కేటగిరీల్లోనే అవార్డులు ఇచ్చిన హెచ్‌. ఎఫ్‌. పి. ఎ. 1950లో వినోదరంగానికి విశేష సేవ చేసిన వారిని గుర్తించేందుకుగాను ‘ఇంటర్నేషనల్‌ ఫిగర్‌’ పేరుతో ఓ పురస్కారాన్ని తీసుకొచ్చింది. ఆ జాబితాలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తి సెసిల్‌ బ్లౌంట్‌ డిమిల్లే (Cecil Blount DeMille). కొన్నాళ్లకు ఆ అవార్డు పేరు కూడా సెసిల్‌ బ్లౌంట్‌ డిమిల్లేగా మారింది. 1956లో బుల్లితెరకు సంబంధించి ఉత్తమ సిరీస్‌, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలు మొదలయ్యాయి. 1963లో ‘మిస్‌ గోల్డెన్‌ గ్లోబ్‌/ మిస్టర్‌ గోల్డెన్‌ గ్లోబ్‌’ అనే పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ రెండు పేర్లను కలిపి 2018లో ‘గోల్డెన్‌ గ్లోబ్‌ అంబాసిడర్‌’గా మార్చారు.  విజేతలను వేదికపైకి తీసుకెళ్లి, ట్రోఫీని అందించడం వారి పని. ఎక్కువగా సెలబ్రిటీ పిల్లలే అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటారు. 2007లో ‘బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫిల్మ్‌’ విభాగాన్ని పరిచయం చేశారు. ప్రస్తుతం 25 కేటగిరీల్లో ఈ అవార్డులను అందిస్తున్నారు. 2009లో ‘ది న్యూయార్క్‌ సొసైటీ అవార్డ్స్‌’ అనే అసోసియేషన్‌తో కలిసి హెచ్‌. ఎఫ్‌. పి. ఎ. గోల్డెన్‌ గ్లోబ్‌ ప్రతిమ రూపంలో మార్పులు చేసింది. ప్రస్తుతం గోల్డెన్‌ గ్లోబ్‌ ట్రోఫీ బరువు 7.8 పౌండ్లు (సుమారు 3.5 కేజీలు). ఎత్తు.. 11.5 అంగుళాలు.

రూల్స్‌..

నామినేషన్‌లో నిలిచే ప్రతి సినిమా నిడివి కనీసం 70 నిమిషాలు ఉండాలి. గ్రేటర్‌ లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతంలోని థియేటర్లలో కనీసం ఆ చిత్రం 7 రోజులు ప్రదర్శితమై ఉండాలి. ‘బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్’ కేటగిరీ చిత్రాలకు ఆ నిబంధనలేదు. ఈ విభాగంలో నామినేట్‌ అయ్యే సినిమాలు అవి రూపొందిన దేశంలో ముందుగా విడుదలకావాలి. ఆయా చిత్రాల్లోని సంభాషణలు ఇంగ్లిష్‌లో చాలా తక్కువ ఉండాలి. ఒకవేళ, సెన్సార్‌ కారణంగా మాతృ దేశంలో ఏదైనా సినిమా విడుదలకు ఆటంకం వచ్చినప్పుడు అది యునైటెడ్‌ స్టేట్స్‌లో వారం పదర్శితమైతే నామినేషన్‌కు అర్హత లభిస్తుంది.

తక్కువ సంఖ్యలోనే భారతీయ చిత్రాలు..

1959 నుంచి భారతీయ చిత్రాలు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’కు పరిచయమయ్యాయి. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి తొలిసారిగా ఆ అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రం ‘దో ఆంఖే బారా హాత్‌’ (హిందీ). ఆ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ‘సామ్యుయేల్‌ గోల్డ్‌విన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు’ దక్కించుకుంది. 1983లో ఐదు విభాగాలకు నామినేట్‌ అయిన ‘గాంధీ’ చిత్రం అన్నింటిలోనూ అవార్డులు పొందింది. నేషనల్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్మించిన చిత్రాల్లో ఇది ఒకటి (దర్శకుడు, నటీనటులు భారతీయులు కాదు). 1961లో ‘అపుర్‌ సన్‌స్కార్‌’ (బెంగాలీ),1989లో ‘సలామ్‌ బాంబే’ (హిందీ), 2001లో ‘మాన్‌సూన్‌ వెడ్డింగ్‌’ (హిందీ) చిత్రాలు నామినేట్‌ అయ్యాయి.

అప్పుడు రెహమాన్‌.. ఇప్పుడు కీరవాణి

80వ ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ పురస్కారాలకు ఉత్తమ చిత్రం (ఆంగ్లేతర భాషా విభాగం), ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నామినేట్‌కాగా ‘నాటు నాటు’ పాటకుగాను అవార్డు వరించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి (MM Keeravani) నిలిచారు. ఆ అవార్డు అందుకున్న తొలి భారతీయ వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎ. ఆర్‌. రెహమాన్‌ నిలిచిన సంగతి తెలిసిందే. 2009లో వచ్చిన ‘స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌’ సినిమాకుగాను ‘బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌’ విభాగంలో అవార్డు అందుకున్నారాయన.

ఆస్కార్‌కు చేరువలో..

‘గోల్డెన్‌ గ్లోబ్‌’వస్తే దాదాపు ‘ఆస్కార్‌’ వచ్చినట్టే అని చాలామంది భావిస్తారు. పేర్లు వేరైనా గుర్తింపు, గౌరవం ఒకేలా ఉంటుంది. ఇక్కడ విజేతగా నిలిచిన సినిమా, నటులు, దర్శకులకు ‘ఆస్కార్‌’ బరిలో మార్గం సుగమం అవుతుందనేది సినీ విశ్లేషకుల మాట. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఓపెన్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌ సాధిస్తుందని నిన్నమొన్నటి వరకు సినీ అభిమానులంతా భావించారు. ఇప్పుడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డురాకతో ‘ఆస్కార్‌’ ఖాయం అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని