Devadas: దేవదాసులో అక్కినేని తాగి నటించారా?

భారతీయ సినీ చరిత్రలో ఎన్ని సినిమాలు వచ్చినా ‘దేవదాసు’ చిత్రానికి ఉండే ప్రత్యేకత వేరు. అనేక భాషల్లో ‘దేవదాసు’ తెరకెక్కించారు.

Published : 25 May 2023 14:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ సినీ చరిత్రలో ఎన్ని సినిమాలు వచ్చినా ‘దేవదాసు’ చిత్రానికి ఉండే ప్రత్యేకత వేరు. అనేక భాషల్లో ‘దేవదాసు’ తెరకెక్కించారు. కానీ, ‘దేవదాసు’ అంటే అక్కినేని నాగేశ్వరరావు, పార్వతి అంటే సావిత్రి అనేలా వారిద్దరూ సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారు. ఎంతలా అంటే హిందీలో ఇదే సినిమాను దిలీప్‌కుమార్‌తో తీస్తే, ‘అక్కినేనిలా నేను నటించలేకపోయాను. ఆయనలా దగ్గలేకపోయాను’ అన్నారట. 1950 దశకంలో తెలుగు సినిమా మంచి ఉచ్ఛదశలో ఉంది. అప్పుడు విడుదలైన ‘దేవదాసు’ ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ నవలను తెలుగులోకి అనువదించి డీఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మించారు.

‘దేవదాసు’ నవలను వినోదా వారు సినిమాగా రూపొందించాలనుకున్నప్పుడు ఆ పాత్రకు అక్కినేనిని కథానాయకుడిగా ఎంపిక చేశారు. అయితే, ఆ పాత్రకు అక్కినేని పనికిరారని, తీసేయ్యమని చాలామంది నిర్మాతలు డీఎల్‌ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్యలకు సలహా ఇచ్చారట. కానీ, ఎవర్నీ లెక్క చెయ్యకుండా అక్కినేనితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా అప్పటికి అక్కినేని చేసిన సాంఘిక చిత్రం ‘సంసారం’ ఒక్కటే. మరోపక్క సావిత్రి ఖాతాలో కూడా ‘పెళ్లి చేసి చూడు’ చిత్ర విజయం మాత్రమే ఉంది. ఆమె నటించిన రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన రీతిలో ఆడలేదు. ఒకవేళ ఈ సినిమా కూడా ఫెయిల్‌ అయి ఉంటే, మనకు ‘మహానటి’ దొరికేది కాదేమో! కానీ, భగ్న ప్రేమికులుగా అక్కినేని-సావిత్రిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సీ.ఆర్‌. సుబ్బురామన్‌ సంగీతం, ఘంటసాల గాత్రం, పేకేటి హాస్యం, సి.ఎస్‌.ఆర్‌ నటన, లలిత నృత్యాలు, ఎస్‌.వి.ఆర్‌. గాంభీర్యం, మూలకథా వైశిష్ట్యం, సముద్రాల రాఘవాచార్య సాహిత్యం అన్నీ కలిసి దీన్నొక అజరామరమైన కళాఖండంగా మార్చాయి.

అయితే ఆ చిత్రంలో ‘జగమే మాయ బ్రతుకే మాయ’ పాటను అక్కినేని నిజంగా తాగి చేశారని అప్పట్లో బయట చెప్పుకొనేవారు. అయితే, అది నిజం కాదు. ఆ పాట చిత్రీకరణ రాత్రి వేళల్లో జరిగింది. అక్కినేని కడుపునిండా భోజనం చేసి షూటింగ్‌లో పాల్గొనేవారట. నిద్రకు కళ్లు మూతలు పడుతుండేవట. అలాంటి సమయంలో ఆ పాటను తీశారు. దాంతో నిజంగా అక్కినేని తాగినట్లే తెరపై కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని