Dhamaka: అప్పుడే అనుకున్నా రవితేజ మాస్‌ మహారాజ్‌ అవుతాడని: రాఘవేంద్రరావు

‘ధమాకా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది.

Updated : 19 Dec 2022 00:10 IST

హైదరాబాద్‌: రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sreeleela) జంటగా దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు బీవీఎస్‌ రవి, సుధీర్‌ వర్మ, శ్రీనివాస్‌ అవసరాల, శ్రీవాస్‌, నందిని రెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘నేను దర్శకత్వం వహించిన అల్లరి ప్రియుడు సినిమాలో రవితేజ ఓ పాత్ర పోషించాడు. ఆర్కెస్ట్రాకి సంబంధించి చిన్న క్యారెక్టర్‌ అది. తను ఆ సమయంలో డ్రమ్స్‌ మోగిస్తున్నప్పుడే అనుకున్నా ఎప్పటికైనా ఇండస్ట్రీలో మాస్‌ మహారాజ్‌ అవుతాడని. శ్రీలీల ‘పెళ్లి సందD’ చిత్రంలో ఫ్లూట్‌ ప్లే చేసి, ఎంతోమంది హృదయాల్లో స్థానం సంపాదించింది. ఇప్పుడు రవితేజతో కలిసి నటించింది. ఈ ఇద్దరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా. ‘నేను లోకల్‌’, ‘సినిమా చూపిస్త మామ’ సినిమాలతో దర్శకుడు త్రినాథరావు నక్కిన ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమా మంచి విజయం అందుకోవాలి’’ అని రాఘవేంద్రరావు ఆకాంక్షించారు.

రవితేజ మాట్లాడుతూ.. ‘‘సినిమాపై మా అందరికీ  నమ్మకం ఉంది. పాత చిత్రాల్లో రావు గోపాలరావు- అల్లు రామలింగయ్య కాంబినేషన్‌లా ‘ధమాకా’ దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్న కాంబో సరదాగా ఉంటుంది. శ్రీలీలకు చాలా ప్రతిభ ఉంది. వచ్చే ఏడాది కల్లా ఆమె మరోస్థాయికి చేరుకుంటుంది. నా మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆమె నా సినిమాలకు డేట్స్‌ ఇస్తుందో లేదో (నవ్వుతూ..). సంగీత దర్శకుడు భీమ్స్‌ మంచి సంగీతం ఇచ్చాడు’’ అని రవితేజ అన్నారు.

‘‘రవితేజ నాలాంటి వారెందరికో స్ఫూర్తి. సినిమాలో ఆయన ఏం చెబితే బాగుంటుదో, ఆయన్ను ఎలా చూస్తే బాగుంటుందో ఓ అభిమానిగానే ‘ధమాకా’ కథ రాశా. సినిమాపై ప్యాషన్‌ ఉన్న వారికే రవితేజ తనతో కలిసి పనిచేసే అవకాశం ఇస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లేకపోయినా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టొచ్చు అని ఎంతోమందికి ఉదాహరణగా నిలుస్తారు. స్టార్‌ అవడానికి ఉన్న ప్రతీ మెట్టు ఎక్కి పైకి వచ్చిన ఒకే వ్యక్తి రవితేజ’’ అని రచయిత ప్రసన్న భావోద్వేగంగా మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని