Published : 19 Jan 2022 01:25 IST

Dhanush-Aishwarya: అప్పుడు ధనుష్‌కు 21.. ఐశ్వర్యకు 23.. అలా మొదలైంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నీకు 52 ఏళ్లు వస్తే, నాకు 50 వస్తాయి. అప్పటివరకూ వేచి చూస్తా. అది చాలు నాకు’ అంటాడు ‘ఏమాయ చేసావె’ చిత్రంలో కార్తీక్‌ పాత్ర పోషించిన నాగచైతన్య. తనకంటే రెండేళ్ల పెద్దదైన జెస్సీ (సమంత)ని ప్రేమిస్తాడు. ఎన్నో అడ్డంకులు దాటుకుని దర్శకుడిగా మారిన కార్తీక్‌ను జెస్సీ పెళ్లి చేసుకుంటుంది. కాస్త అటూ ఇటూగా ధనుష్‌-ఐశ్వర్య జీవితం కూడా అంతే! వయసులో తనకంటే రెండేళ్లు పెద్దదైన ఐశ్వర్యను ధనుష్‌ వివాహం చేసుకున్నాడు. అప్పటికి ధనుష్‌ స్టార్‌ హీరో కాదు. నటుడిగా ఒకట్రెండు సినిమాలే చేశాడు. మరోవైపు ఐశ్వర్య సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె. అలాంటి ఐశ్వర్య.. ధనుష్‌ను వివాహం చేసుకోవటం వెనుక ఓ చిన్న ప్రేమకథా చిత్రమే ఉంది. 2004లో ఒక్కటైన ఈ జోడీ తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించింది. అసలు ఈ జోడీకి తొలిసారి పరిచయం ఎలా ఏర్పడింది?

* తమిళ దర్శకుడు, నిర్మాత కస్తూరిరాజా తనయుడు ధనుష్‌. చిన్నప్పటి నుంచి ధనుష్‌ని స్టార్‌ చేయాలని తండ్రి కలలు కనేవాడు. అయితే, ధనుష్‌కు మాత్రం యాక్టింగ్‌ అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా తండ్రి కోరిక మేరకు ఆయన దర్శకత్వంలోనే ధనుష్‌ ‘తుళ్ళువాదో ఇల్లమై’లో నటించారు. సినిమా హిట్టయినా ‘ఇతను హీరోనా? ఇలా ఉన్నాడేంటి’ అనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. 

* ఆ మరుసటి సంవత్సరం ‘కాదల్‌ కొండేన్‌‌’లో నటించాడు ధనుష్‌. ఈ సినిమాను స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేయగా, అది చూడటానికి రజనీ కుమార్తె ఐశ్వర్య వచ్చారు. అప్పుడు చిత్ర నిర్మాత ఐశ్వర్యను తొలిసారి ధనుష్‌కు పరిచయం చేశారు. సినిమా పూర్తయిన తర్వాత ఐశ్వర్య వచ్చి ధనుష్‌కు శుభాకాంక్షలు చెప్పింది. అంతకుముందే ఎవరేంటో తెలిసినా, ఇద్దరూ తొలిసారి మాట్లాడుకోవటం మాత్రం అదే తొలిసారి. 

* ఆ మరుసటి రోజే ధనుష్‌ నటనను ప్రశంసిస్తూ ఐశ్వర్య పుష్పగుచ్ఛాన్ని పంపింది. అక్కడి నుంచి ఇద్దరూ తరచూ మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఈ క్రమంలో మీడియాలో వార్తలు రావడంతో ‘సోదరి స్నేహితురాలు మాత్రమే’ అని ధనుష్‌ వివరణ కూడా ఇచ్చారు. అలా ఆర్నెల్ల పాటు ఇద్దరూ స్నేహితులుగా ప్రయాణం కొనసాగించారు.

* ఈ క్రమంలోనే ఇరు కుటుంబాలు వారికి వివాహం చేస్తే బాగుంటుందని భావించాయి. అప్పటికి ధనుష్‌ స్టార్‌ కాకపోయినా రజనీకాంత్‌ అవేవీ పట్టించుకోలేదు. తన కుమార్తెను ఇచ్చి ధనుష్‌కు వివాహం చేశారు. అప్పటికి ధనుష్‌ వయసు 21 ఏళ్లు కాగా.. ఐశ్వర్యకు 23.

* రజనీకాంత్‌ కుమార్తెగానే కాకుండా ఐశ్వర్య మల్టీ టాలెంటెడ్‌. ఆమె దర్శకత్వంలో ధనుష్‌ ‘3’ అనే సినిమా చేశారు. ఇందులోని ‘వై దిస్‌ కొలవెరి’ పాటతో ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘3’ తమిళంలో ఓకే అనిపించినా, తెలుగులో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అప్పటి నుంచి జరిగిందంతా మనకు తెలిసిందే!

18ఏళ్ల పాటు కొనసాగిన తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తాజాగా ధనుష్‌-ఐశ్వర్య ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని