SIR Review: రివ్యూ: సార్‌

sir movie review: ధనుష్‌, సంయుక్త జంటగా నటించిన ‘సార్‌’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 17 Feb 2023 10:16 IST

SIR Review; చిత్రం: సార్‌; నటీనటులు: ధనుష్‌, సంయుక్త, సాయికుమార్‌, తనికెళ్లభరణి, సముద్రఖని తదితరులు; సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌; నిర్మాత: నాగవంశీ, సాయి సౌజన్య; రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి; విడుదల తేదీ:17-02-2023

తెలుగులో మార్కెట్‌ని సంపాదించిన క‌థానాయ‌కుల్లో ధ‌నుష్ (Dhanush) ఒక‌రు. ఆయన న‌టించే ప్ర‌తి సినిమా తెలుగులోనూ అనువాదం అవుతుంటుంది. ఈసారి ఆయ‌న తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ‘సార్’ (SIR Movie Review) చేశారు.  ద్విభాషా చిత్రంగా  ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాని తెలుగు దర్శ‌కుడు వెంకీ  అట్లూరి తెర‌కెక్కించ‌గా, తెలుగు నిర్మాణ సంస్థ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో  క‌లిసి  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉంది? ‘సార్‌’గా ధనుష్‌ అలరించారా?

క‌థేంటంటే: ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌తో భార‌త దేశంలో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెరుగుతున్న 2000 సంవ‌త్స‌ర కాలం అది. ఇంజినీరింగ్ చ‌దువుల‌కి డిమాండ్ ఏర్ప‌డుతుంది. ఇదే అద‌నుగా కొంత‌మంది స్వార్థ‌ప‌రులు విద్య‌ని వ్యాపారంగా మార్చి డ‌బ్బు దండుకోవ‌డం మొద‌లుపెడ‌తారు. అందులో ఒక‌రు... త్రిపాఠి విద్యా  సంస్థ‌ల అధినేత, ప్రైవేట్ కాలేజీల అసోసియేష‌న్ అధ్య‌క్షుడు  త్రిపాఠి (స‌ముద్ర‌ఖ‌ని). ప్ర‌భుత్వ కాలేజీల్లో ప‌నిచేసే అధ్యాప‌కులకి అధిక జీతాల్ని ఆశ‌చూపుతూ త‌న‌వైపు మరల్చుకుంటాడు త్రిపాఠి. దాంతో మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద పిల్ల‌లకి ఆధార‌మైన ప్ర‌భుత్వ కాలేజీలు మూత‌ప‌డ‌తాయి.  ప్రైవేటు కాలేజీల్లో  వేల‌కి వేలు ఫీజులు క‌ట్ట‌లేక  చ‌దువు మానేస్తారు చాలామంది విద్యార్థులు. దీనిపై ఆందోళ‌న‌లు మొద‌ల‌వుతాయి.  దాంతో త‌న వ్యూహం మార్చిన  త్రిపాఠి...  ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్ని తామే ద‌త్త‌త తీసుకుని న‌డుపుతామ‌ని ప్ర‌భుత్వానికి చెబుతాడు. అక్క‌డికి త‌మ కాలేజీల్లో ప‌నిచేసే అంత‌గా అనుభ‌వం లేని జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల‌ని పంపించి, నాణ్య‌త లేని చ‌దువుల‌తో మ‌మ అనిపించి త‌న వ్యాపారాన్ని కొన‌సాగించాల‌నేది అత‌ని వ్యూహం. (SIR Movie Review) అలా త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తూ సిరిపురం ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దువు చెప్పడానికి  అపాయింట్ అయిన  జూనియ‌ర్ లెక్చ‌ర‌రే బాల‌గంగాధ‌ర తిల‌క్ అలియాస్ బాలు సార్ (ధ‌నుష్‌). సిరిపురం కాలేజీకి వెళ్లి వంద శాతం రిజ‌ల్ట్ తీసుకొస్తాన‌ని చెప్పిన బాలు సార్‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? బ‌యాల‌జీ లెక్చ‌ర‌ర్ మీనాక్షి (సంయుక్త‌)  ఆయ‌న‌కి ఎలా సాయం చేసిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! 

ఎలా ఉందంటే: 1990... 2000 ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే క‌థే అయినా... విద్య విష‌యంలో  నేటి ప‌రిస్థితులకి  కూడా ద‌గ్గ‌ర‌గా ఉండే చిత్ర‌మిది. విద్య గుడిలో  ప్ర‌సాదంలాంటిది. దాన్ని  పంచాలి కానీ... ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో వంట‌కంలా పంచ‌కూడ‌దని చెప్ప‌డ‌మే ఈ సినిమా ఉద్దేశం.  (SIR Movie Review) ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యే  క‌థాంశమే ఈ సినిమాకి ప్ర‌ధాన  బ‌లం. అయితే ఆ క‌థ‌ని న‌డిపిన విధానంలోనే లోటుపాట్లు క‌నిపిస్తాయి. నాట‌కీయ‌త మ‌రీ ఎక్కువైంది.  భావోద్వేగాలే  ప్ర‌ధానమైన ఈ క‌థ‌లో  స‌హ‌జ‌త్వం లేని స‌న్నివేశాల వ‌ల్ల చాలా చోట్ల  సినిమా కృత‌కంగా సాగుతున్న భావ‌న క‌లుగుతుంది. షాప్‌లో దొరికిన వీడియో క్యాసెట్ల నుంచి ఆస‌క్తిని రేకెత్తిస్తూ ప్రేక్ష‌కుల్ని క‌థ‌లోకి తీసుకెళ‌తాడు ద‌ర్శ‌కుడు. బాలు సార్ పాత్ర ప‌రిచ‌యం, ఆయ‌న సిరిపురం కాలేజీకి వెళ్లడం, తోటి అధ్యాపకుల‌తో క‌లిసి చేసే సంద‌డి ఇలా ఆరంభ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఊరికి వెళ్లాక ఎదుర‌య్యే స‌వాళ్లు, వాటిని అధిగ‌మించే తీరు కూడా  భావోద్వేగాల్ని పంచుతాయి. (SIR Movie Review) ముఖ్యంగా ఊరి జ‌నాల్లో చైత‌న్యం నింపేలా అబ్దుల్ క‌లామ్ జీవిత క‌థ‌ని చెప్ప‌డం, కులాల మ‌ధ్య అంత‌రాలు తొల‌గిపోయేలా పిల్ల‌ల్లో మార్పు తీసుకురావ‌డం వంటి స‌న్నివేశాలు మ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి.  మ‌ధ్యలో నాయ‌కానాయిక‌ల  ప్రేమ‌క‌థ కూడా హుందాగా సాగుతుంది. అక్క‌డ‌క్క‌డా సినిమాటిక్‌గా అనిపించినా  ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు భావోద్వేగాల‌తో పర్వాలేద‌నిపిస్తుందీ చిత్రం. ద్వితీయార్ధంలోనే మెలోడ్రామా కాస్త ఎక్కువైంది. త్రిపాఠి నుంచి ఎదురైన అడ్డంకుల్ని అధిగ‌మిస్తూ పిల్ల‌ల‌కి పాఠాలు చెప్ప‌డం, వాళ్ల‌ని ల‌క్ష్యం దిశ‌గా న‌డిపించ‌డం ద్వితీయార్ధంలో క‌నిపిస్తుంది.  ఆ స‌న్నివేశాలు చాలా వ‌ర‌కు సాగ‌దీసిన‌ట్టుగా అనిపిస్తాయి. (SIR Movie Review) పతాక స‌న్నివేశాలు కూడా సినిమా కాన్సెప్ట్‌కి విరుద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్ ర్యాంకుల దందాకి సాయం చేసిన‌ట్టే అనిపిస్తుంది. బాలీవుడ్ చిత్రం సూప‌ర్ 30ని పోలి ఉంటుందీ చిత్రం.  

ఎవ‌రెలా చేశారంటే: బాలు సార్ పాత్ర‌లో ధ‌నుష్ ఒదిగిపోయాడు.  లెక్చ‌ర‌ర్‌గా హుందాగా క‌నిపిస్తూ, పాత్ర‌పై బ‌ల‌మైన ప్ర‌భావం చూపించారు. భావోద్వేగాలు,  పోరాట ఘ‌ట్టాలు, కామెడీ.... ఇలా అన్ని విష‌యాల్లోనూ ఆయ‌న అల‌రించారు. సంయుక్త అందంగా క‌నిపించింది. క‌థానాయ‌కుడితోపాటే  క‌నిపించే  ప్రాధాన్య‌మున్న పాత్ర ఆమెకి ద‌క్కింది. త్రిపాఠిగా స‌ముద్ర‌ఖ‌ని, సిరిపురం సర్పంచ్‌గా సాయికుమార్ బ‌ల‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సుమంత్‌ అతిథి పాత్రలో మెరిశారు. ఆది  ప్ర‌థ‌మార్ధంలో న‌వ్వించాడు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. జి.వి.ప్ర‌కాష్ సంగీతం సినిమాని మ‌రో స్థాయిలో నిల‌బెట్టింది. భావోద్వేగాలు పండ‌టంలో సంగీతం పాత్రప్ర‌ధానంగా క‌నిపిస్తుంది.  యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ద‌ర్శ‌కుడు మంచి క‌థాంశాన్ని ఎంచుకున్నారు. దాన్ని వాణిజ్య హంగుల‌తో తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. (SIR Movie Review) క‌థ‌నం ప‌రంగా చేసిన క‌స‌ర‌త్తులే చాలలేద‌నిపిస్తుంది.

బ‌లాలు : + విద్య నేప‌థ్యంలో క‌థ‌; + ప్ర‌థ‌మార్ధం; + ధ‌నుష్ న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు : - నాట‌కీయ‌త ఎక్కువ కావ‌డం; - ప‌తాక స‌న్నివేశాలు

చివ‌రిగా:  ఈ ‘సార్‌’ది డీసెంట్‌ క్లాస్‌. (SIR Movie Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని