Thiru review: రివ్యూ: తిరు

Thiru review: ధనుష్‌ కీలక పాత్రలో నటించిన ‘తిరు’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 18 Aug 2022 15:15 IST

Thiru review; చిత్రం: తిరు; నటీనటులు: ధనుష్‌, నిత్యామేనన్‌, ప్రియా భవానీ శంకర్‌, రాశీఖన్నా, ప్రకాశ్‌రాజ్‌, భారతీరాజా తదితరులు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్‌; ఎడిటింగ్‌: ప్రసన్న జీకే; నిర్మాత: కళానిధి మారన్‌; రచన, దర్శకత్వం: మిత్రన్‌ ఆర్‌.జవహర్‌; బ్యానర్‌: సన్‌ పిక్చర్స్‌; విడుదల: 18-08-2022

క‌రోనా త‌ర్వాత ధ‌నుష్ సినిమాలు ఎక్కువ‌గా ఓటీటీ వేదిక‌ల్లోనే విడుద‌ల‌య్యాయి. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఆయన నటించిన ‘తిరు’ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. త‌మిళంలో తెర‌కెక్కిన ‘తిరు చిత్రాంబ‌ళం’కి అనువాదం ఇది. 2019 నుంచే ప్ర‌చారంలో ఉన్న ఈ సినిమా అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  మ‌రి చిత్రం ఎలా ఉంది? ధనుష్‌ పాత్ర ఏంటి?

క‌థేంటంటే: తిరు ఏకాంబ‌రం అలియాస్ పండు (ధ‌నుష్‌) ఫుడ్ డెలివ‌రీ బాయ్‌. చిన్న‌ప్పుడు హుషారైన‌, తెలివైన కుర్రాడే. కానీ, త‌న జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌తో మధ్య‌లోనే కాలేజీ మానేస్తాడు. భ‌య‌స్తుడిలా మారిపోతాడు. త‌న తండ్రి (ప్ర‌కాష్‌రాజ్‌), తాత సీనియ‌ర్ పండు (భార‌తీరాజా)తో క‌లిసి జీవిస్తుంటాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ స్నేహితురాలైన శోభ‌న (నిత్య‌మేన‌న్‌) కుటుంబం కూడా అదే  అపార్ట్‌మెంట్‌లో కింద పోర్ష‌న్‌లో ఉంటుంది. ఒక‌రి గురించి ఒక‌రికి బాగా తెలిసిన ఆ ఇద్ద‌రి మ‌ధ్య దాపరికాలంటూ ఏమీ ఉండ‌వు. అనూష (రాశిఖ‌న్నా), రంజ‌ని (ప్రియ భ‌వానీ శంక‌ర్‌)ల‌పై తిరు మ‌న‌సు ప‌డ్డాడ‌ని తెలుసుకున్న శోభ‌న ఆ విష‌యంలో సాయం కూడా చేస్తుంది. మ‌రి తిరు చివ‌రికి ఎవ‌రిని ప్రేమించాడు? అత‌ని జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న ఏమిటనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌త‌రం జీవితాల్ని ప్ర‌తిబింబిస్తూ సాగే ఓ ప్రేమ‌క‌థ ఇది. ఈ క‌థ‌, నేప‌థ్యం కొత్త‌దేమీ కాదు. కానీ, ద‌ర్శ‌కుడు తెలిసిన ఆ క‌థనే కొత్త‌గా, ఆస‌క్తిక‌రంగా భావోద్వేగాల్ని మేళ‌విస్తూ తీర్చిదిద్దారు.  ప్ర‌థ‌మార్ధం తిరు పాత్ర‌, కుటుంబ నేప‌థ్యం ధ‌నుష్ ఇదివ‌ర‌కు చేసిన ‘ర‌ఘువ‌ర‌న్ బి.టెక్‌’ని గుర్తు చేస్తుంది. ఈ క‌థ‌లో స్నేహం, ప్రేమ వంటి విష‌యాలు ‘నువ్వే కావాలి’ని కూడా పోలి ఉంటాయి. స్నేహితురాలైన శోభ‌న‌తో క‌లిసి చేసే ప్ర‌యాణం... అనూష‌పై ఆక‌ర్ష‌ణ త‌దిత‌ర స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ప‌క్కింటి అబ్బాయి, అమ్మాయి జీవితాల్ని చూస్తున్న అనుభూతి క‌లుగుతుంది. తిరు త‌న తాత సీనియ‌ర్ పండుతో క‌లిసి చేసే హంగామా న‌వ్విస్తుంది. క‌థానాయ‌కుడు త‌న త‌ల్లి గురించి భావోద్వేగానికి గుర‌య్యే స‌న్నివేశాలు ఫ్లాష్ బ్యాక్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో ఏముందో అనే ఆత్రుత క‌లుగుతుంది.

అక్క‌డ పెద్ద క‌థేమీ ఉండ‌దు కానీ, అది సినిమాపై చాలా ప్ర‌భావం చూపిస్తుంది. చిన్న చిన్న విష‌యాలు కూడా జీవితంపై ఎంత ప్ర‌భావం చూపిస్తుంటాయో ఆ స‌న్నివేశాల‌తో చెప్పిన తీరు మెప్పిస్తుంది.   ద్వితీయార్ధం సినిమాలో భావోద్వేగాలపై మ‌రింత ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ తిరు, రంజ‌ని ప్రేమ‌క‌థ కీల‌కం. పల్లెటూరి నేప‌థ్యంలో సాగే ఆ స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తాయి. తిరు, శోభ‌న బంధం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ప‌తాక స‌న్నివేశాల్ని ఉత్కంఠ‌గా మార్చేస్తాయి. ఆ స‌న్నివేశాలు ఒక ద‌శ‌లో ‘తొలిప్రేమ‌’ని గుర్తు చేస్తాయి. కానీ, ద‌ర్శ‌కుడు వాటిని సినిమాటిక్‌గా కాకుండా, స‌హ‌జంగా తీర్చిదిద్దారు. ధ‌నుష్‌లాంటి ఓ పెద్ద స్టార్ ఉన్న‌ప్ప‌టికీ ఎలాంటి హీరోయిక్ స‌న్నివేశాలు లేకుండా... కొన్ని జీవితాల్ని ద‌గ్గ‌ర నుంచి చూసిన అనుభూతిని పంచేలా ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ధ‌నుష్, నిత్య‌మేన‌న్ పాత్ర‌లు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వాళ్లిద్ద‌రి మ‌ధ్య స్నేహం,  ఆ నేప‌థ్యంలో పండే వినోదం, భావోద్వేగాలు సినిమాకి కీల‌కం. ఎక్క‌డా నాట‌కీయత‌న క‌నిపించ‌కుండా,  ఆ ఇద్ద‌రూ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. భావోద్వేగాల విష‌యంలోనూ ఇద్ద‌రూ పోటీప‌డిన‌ట్టు అనిపిస్తుంది. ప్ర‌కాష్‌రాజ్ - ధ‌నుష్, భార‌తీరాజా - ధనుష్  మ‌ధ్య స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. త‌మ అనుభ‌వాన్నంతా రంగ‌రించి ఈ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు భారతీరాజా,  ప్ర‌కాష్‌రాజ్‌. రాశిఖ‌న్నా పాత్ర ప‌రిధి త‌క్కువే. ప్రియ భవానీ శంకర్ పాత్ర కూడా చిన్న‌దే.  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. పాట‌లు, నేప‌థ్య సంగీతంపై త‌న‌దైన ముద్ర వేశారు. నిర్మాణం ప‌లు ప‌రిమితుల మ‌ధ్య  సాగిన‌ట్టు అనిపిస్తుంది. ప్ర‌కాష్‌రాజ్‌, నిత్య‌మేన‌న్‌లాంటి న‌టులకి వేరొక‌రితో డ‌బ్బింగ్ చెప్పించ‌డంతో ఆ పాత్రల్లో స‌హ‌జ‌త్వం కోల్పోయిన‌ట్టు అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు ఒక సాధార‌ణ‌మైన క‌థ‌ని ప్రభావవంతగా తీయ‌డంలో స‌ఫ‌లమ‌య్యారు. మాట‌లు బాగున్నాయి.

బ‌లాలు

+ న‌టీన‌టులు

భావోద్వేగాలు

క‌థ‌లో మ‌లుపులు

బ‌ల‌హీన‌త‌లు

- ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా: భావోద్వేగాలను పంచే పక్కింటి కుర్రాడు... తిరు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని