dhoomam review: రివ్యూ: ధూమం.. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన థ్రిల్లర్‌ ఎలా ఉంది?

ఫహద్‌ ఫాజిల్‌, అపర్ణా బాలమురళి కీలక పాత్రల్లో నటించిన ‘ధూమం’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

Updated : 11 Jul 2024 17:09 IST

Dhoomam Review In Telugu: చిత్రం: ధూమం; నటీనటులు: ఫహద్‌ ఫాజిల్‌, అపర్ణా బాలమురళి, రోషన్‌ మాథ్యూ తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా

సిగరెట్‌ తాగితే ముఖేశ్‌లా మీ జీవితం కూడా అయిపోతుందని ప్రతి సినిమా ముందు చూపిస్తారు. ‘రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది’ అని చెబితే, దాన్ని సోషల్‌మీడియాలో మీమ్స్‌ చేసి వాడతారు కానీ, ధూమపానం చేస్తున్న ఇంట్లో వాళ్లకు కనీసం వద్దని చెప్పే ధైర్యం కూడా ఉండదు. నిజమే.. సందేశాలిస్తే సినిమాలకు ఎవరొస్తారు? అయితే, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో కూడా సందేశాన్ని ఇవ్వొచ్చని దర్శకుడు పవన్‌కుమార్‌ ‘ధూమం’తో నిరూపించారు.

తన తెలివి తేటలు, పదునైన మాటలతో సిగరెట్‌ కంపెనీ ఎండీ సిద్ధార్థ్‌ అలియాస్‌ సిధ్‌ (రోషన్‌ మాథ్యూ)ను మెప్పించి ఉద్యోగం సంపాదిస్తాడు అవినాష్‌ (ఫహద్‌ ఫాజిల్‌). తన మార్కెటింగ్‌ స్ట్రాటజీలతో కంపెనీ సేల్స్‌ పెంచుతాడు. దీంతో మంచి జీతం, సకల సౌకర్యాలను ఆ కంపెనీ ఇస్తుంది. ఒకరోజు ఎండీ సిధ్‌ (రోషన్‌ మాథ్యూ) నిర్ణయంతో విభేదించి అవినాష్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అతడి భార్య దియా (అపర్ణా బాలమురళి) శరీరంలో మైక్రోబాంబు ఎందుకు పెట్టారు? (dhoomam movie review) దాని నుంచి అవినాష్‌ ఆమెను కాపాడుకున్నాడా? అన్నది కథాంశం.

‘ఏదైనా ఐటమ్‌ బాగా పాపులర్‌ అయితే అది కొందరికి అది నచ్చకపోయినా దాని బ్రాండ్‌కున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇతరులకు మాత్రం బాగుందని చెబుతారు. ఎందుకంటే, అదొక ఇమేజ్‌ చట్రం. చాలామంది దానినుంచి బయట పడేందుకు ఆసక్తి చూపకపోగా, ఇతరులు ఏమనుకుంటారోనన్న మొహమాటంతో నిజాన్ని ఒప్పుకోరు’ ఈ మాటలు చెప్పే అవినాష్‌ ఉద్యోగం సంపాదిస్తాడు. దాన్నే సిగరెట్‌ సేల్స్‌ పెంచడానికి అన్వయిస్తాడు.

సినిమా మొత్తం ప్రస్తుతం సిగరెట్‌, పొగాకు ఉత్పత్తులను తయారుచేసే కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనుసరించే ప్రణాళికలు ఏంటి? ఎలా మార్కెటింగ్‌ చేసుకుంటున్నాయి. (Dhoomam Review) ఈ సినిమాలో సిగరెట్‌ కంపెనీ యజమాని అయిన సిద్ధార్థ్‌ కారులో వెళ్తూ అవినాష్‌తో ‘ఇక్కడ కనిపించే ప్రతీ మనిషి రోజూ నాకు రూ.300 ఇవ్వాలి’ అని అంటాడు. అంటే అక్కడున్న అందరితోనూ సిగరెట్లు కొనిపించాలని అర్థం.

లాభాల కోసం సిగ‌రెట్ కంపెనీలు వేసే ఎత్తుల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా చూపిస్తూనే, ఆ బడా కంపెనీలు వేసిన వలలో నుంచి ఓ యువకుడు, అతడి భార్య బయటపడేందుకు ఎలా పోరాటం సాగించారన్న దాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అవినాష్‌, అతడి భార్యపై దాడి జరిగి తేరుకున్న తర్వాత ఇద్దరి మధ్యా జరిగే సంభాషణతో కథను మొదలుపెట్టాడు దర్శకుడు. (dhoomam telugu ott) ప్రస్తుత కథను నడిపిస్తూనే అవినాష్‌ పని చేసే కంపెనీలో ఏం జరిగిందో అతడు చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌తో నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లేతో కథ ముందుకుసాగుతుంది.

బ్లాక్‌ మెయిలర్‌ చెప్పేవన్నీ చేస్తూనే తన భార్య శరీరంలో ఉన్న మైక్రోబాంబును అవినాష్‌ ఎలా బయటకు తీస్తాడన్న ఉత్కంఠతో ప్రతీ సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. విరామ సమయానికి ఇచ్చిన ట్విస్ట్‌ ద్వితీయార్ధంపై మరింత ఆసక్తి పెంచేలా ఉంటుంది. అయితే, సెకండాఫ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే కథాగమనం నెమ్మదిగా సాగుతుంది.

సిగరెట్‌ సేల్స్‌ కోసం కంపెనీలు వేసే ప్లాన్‌లు, స్ట్రాటజీలు ఇలా ఉంటాయా? అన్న ఆశ్చర్యం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలిగిస్తుంది. ధూమపానం చేసేవారు మాత్రమే కాదు, వారి వల్ల మిగిలిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చిన్నారులపై చూపే ప్రభావం ఏంటో పతాక సన్నివేశాల్లో చూపించిన తీరు భావోద్వేగాన్ని కలిగిస్తుంది.

రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నమైన క్లైమాక్స్‌తో దర్శకుడు పవన్‌ సినిమాను ముగించిన తీరుకు ధైర్యం కావాలి. ముఖ్యంగా నిర్మాతలను ఒప్పించడం అభినందనీయం.

తక్కువమంది నటీనటులే ఇందులో కనిపిస్తారు. ఫహద్‌ ఫాజిల్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అపర్ణా బాలమురళీ కూడా అంతే. రోషన్‌ మాధ్యూది బలమైన పాత్ర. ఒకప్పటి హీరో వినీత్‌ కనిపించేది కొద్దిసేపే. సాంకేతికంగా సినిమా బాగుంది. రచయిత, దర్శకుడు అయిన పవన్‌కుమార్‌కు రచయితగా ఎక్కువ మార్కులు పడతాయి.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడొచ్చు. మీ కుటుంబంలో ధూమపానం చేసే వారుంటే తప్పక చూపించండి. ‘ఆహా’ (dhoomam telugu ott) ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • బలాలు
  • + సందేశం
  • + నటీనటులు
  • + ప్రథమార్ధం
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే ద్వితీయార్ధం
  • - క్లైమాక్స్‌
  • చివరిగా: సందేశాత్మక ‘ధూమం’.. కమర్షియల్‌ హంగులకు దూరం (Dhoomam movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని