Beast: విజయ్‌ నమ్మేది ఆ ఒక్కటే.. పూజా ‘పాన్‌ ఇండియా హీరోయిన్‌’: దిల్‌ రాజు

నటుడు విజయ్‌ పెద్ద స్టార్‌ అయినా సగటు ప్రేక్షుకుడిలానే కథలను ఎంపిక చేసుకుంటారని, పూజాహెగ్డే.. పాన్‌ ఇండియా హీరోయిన్‌ అని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు.

Published : 09 Apr 2022 01:40 IST

హైదరాబాద్‌: నటుడు విజయ్‌ కథను మాత్రమే నమ్ముతారని, పూజాహెగ్డే.. పాన్‌ ఇండియా హీరోయిన్‌ అని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. విజయ్‌, పూజా జంటగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా శుక్రవారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘వైవిధ్య భరిత కథలకు కమర్షియల్‌ హంగులు జోడించి, మెప్పించిన దర్శకుడు నెల్సన్‌. ‘బీస్ట్‌’తో మరోసారి సత్తా చాటబోతున్నారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా కోసం అనిరుధ్‌ అందించిన ‘అరబిక్‌ కుతు’ ప్రపంచవ్యాప్త శ్రోతల్ని ఉర్రూతలూగించింది. పూజాహెగ్డే అడుగుపెడితే ఏ సినిమా అయినా సూపర్‌హిట్టే. అన్ని భాషల్లోనూ నటిస్తూ ‘పాన్‌ ఇండియా హీరోయిన్‌’గా మారింది. విజయ్‌ స్టార్‌ హీరోలా కాకుండా సగటు ప్రేక్షకుడి కోణంలో కథలను ఎంపిక చేసుకుంటారు. ఆయన కథను మాత్రమే నమ్ముతారు కాబట్టి అగ్ర దర్శకులకే కాకుండా కొత్తవారికీ అవకాశం ఇస్తుంటారు’’ అని అన్నారు.

‘‘బీస్ట్‌.. ఫుల్‌ మాస్‌, కమర్షియల్‌ ఫిల్మ్‌. ఇందులోని ట్విస్ట్‌లు మీ అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తాయి. అనిరుధ్‌కు నేనప్పటి నుంచో అభిమానిని. ఈ సినిమాకు అదిరిపోయే స్వరాలందించాడు. విజయ్‌ సర్‌ కెరీర్‌ ప్రారంభంలో ఎంత కసితో పనిచేసేవారో స్టార్‌డమ్‌ వచ్చినా అంతే కష్టపడుతుంటారు. ఆయన విషయంలో అదే నాకు స్ఫూర్తినిస్తుంది’’ అని పూజాహెగ్డే తెలిపింది. ‘‘నా గత చిత్రం ‘డాక్టర్‌’ను విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘బీస్ట్‌’నూ అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి’’ అని నెల్సన్‌ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని