ఆ సినిమా చూసి నా భార్య నన్ను తిట్టింది: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ నటుడు

‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee). తాజాగా ఆయన తన కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

Published : 28 May 2023 01:46 IST

ముంబయి: తాను నటించిన ఓ చిత్రాన్ని వీక్షించి, తన సతీమణి కోప్పడిందని బాలీవుడ్‌ నటుడు మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) తెలిపారు. డబ్బు కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చేయవద్దని ఆమె చెప్పిందన్నారు. ఆమె తిట్టడం వల్లే, సినిమాలను ఎంచుకోవడంలో తన పంథాను మార్చుకున్నానని చెప్పారు.

‘‘గతంలో నేను నటించిన ఓ బ్యాడ్‌ మూవీని చూడటం కోసం నా భార్య థియేటర్‌కు వెళ్లింది. ఆ సినిమా పేరు నేను చెప్పాలనుకోవడం లేదు. కానీ అదొక బ్యాడ్‌ మూవీ. అందులో నేను హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తూ ఉంటాను. నా రోల్‌ చూసి థియేటర్‌లో ఉన్న కొంతమంది అమ్మాయిలు హేళనగా మాట్లాడారు. ఆ మాటలు నా భార్య చెవిన పడ్డాయి. అంతే, ఆ సినిమా పూర్తైన వెంటనే ఆమె నాకు ఫోన్‌ చేసి కోప్పడింది. ‘డబ్బు కోసం ఇలాంటి సినిమాలు చేయడం మానేయండి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్‌లో వాళ్ల మాటలు విని నేను అవమానంగా ఫీలవుతున్నా. దయచేసి ఇకపై ఇలాంటివి చేయకండి’ అని చెప్పింది. ఆమె మాటల్లో నిజం ఉంది. ఆ సంఘటన తర్వాతే సినిమాల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం మొదలుపెట్టాను. ప్రేక్షకులకు చేరువయ్యే పాత్రలను ఎంచుకోవడం తెలుసుకున్నాను’’ అని మనోజ్‌ వివరించారు.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాల్లో నటించిన మనోజ్‌.. ‘హ్యాపీ’ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ఆయన పోలీస్‌ పాత్రలో కనిపించి అలరించారు. ఆ తర్వాత ఆయన ‘పులి’, ‘వేదం’ సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌తో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ విడుదలైంది. ఇందులో మనోజ్‌ లాయర్‌ పాత్రలో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని