Dileep Kumar: దిలీప్‌కుమార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ విలక్షణ నటుడు దిలీప్‌కుమార్‌(98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులుపడుతున్న ఆయన చికిత్స..

Updated : 07 Jul 2021 10:54 IST

ముంబయి: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌(98) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. దిలీప్‌కుమార్‌ మరణ వార్తతో బీటౌన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1922 డిసెంబర్‌ 11న పాక్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్‌కుమార్‌ సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. అనంతరం నటుడిగా రాణించాలనే ఉద్దేశంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1944లో విడుదలైన ‘జ్వర్‌ భాతా’ (JWAR BHATA) చిత్రంతో మొదటిసారి ఆయన నటుడిగా వెండితెరపై మెరిశారు. సుమారు 65 సినిమాల్లో నటించిన దిలీప్‌కుమార్‌ ఉత్తమ నటుడిగా ఎన్నో పర్యాయాలు ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 1994లో సినీరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డుతో గౌరవించింది. 

దిలీప్‌కుమార్‌ అసలు పేరు మహమ్మద్‌ యూసఫ్‌ ఖాన్‌. నటుడిగా వెండితెరపై అడుగుపెట్టిన సమయంలో ‘జ్వర్‌ భాతా’ చిత్ర నిర్మాణ సంస్థ బాంబే టాకీస్‌ యజమాని ఆయన పేరుని దిలీప్‌కుమార్‌గా మార్చారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన దిలీప్‌కుమార్‌ ‘మొఘల్‌-ఎ-ఆజామ్‌’, ‘ఆజాద్‌’, ‘అందాజ్‌’, ‘ఆన్‌’, ‘డాగ్‌’, ‘గంగా జమున’, ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథానాయకుడిగా 1955లో వచ్చిన ‘ఆజాద్‌’ దశాబ్దిలో అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. నటుడిగా రాణిస్తున్న సమయంలోనే 1966లో నటి సైరాభానును ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. 1998లో వచ్చిన ‘ఖిలా’ తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని