Dilraju: థియేటర్లు కళకళలాడతాయి

‘‘బంధాలు, బిజినెస్‌లు అన్నీ ఇప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమే ‘ఎఫ్‌3’. రెండున్నర గంటల సేపు పొట్టచెక్కలయ్యేలా   నవ్విస్తుంది’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు.

Updated : 20 May 2022 08:08 IST

‘‘బంధాలు, బిజినెస్‌లు అన్నీ ఇప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమే ‘ఎఫ్‌3’. రెండున్నర గంటల సేపు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన నిర్మాణంలో ‘ఎఫ్‌2’కు సీక్వెల్‌గా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే ‘ఎఫ్‌3’. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా నటించారు. తమన్నా, మెహ్రీన్‌, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు దిల్‌రాజు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..  

‘‘ఎఫ్‌2’ విడుదలకు ముందే అనిల్‌కు ‘ఎఫ్‌3’ ఆలోచన వచ్చింది. సరే మొదటిది విజయవంతమైతే సీక్వెల్‌ చేద్దామని అనుకున్నాం. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత స్క్రిప్ట్‌ని పూర్తి చేసి.. నటీనటులందరినీ మళ్లీ ఒక దగ్గరకు చేర్చి సినిమా సెట్స్‌పైకి ఎక్కించాం. ‘ఎఫ్‌3’ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నామో.. సినిమా చూసిన తర్వాత దానికి మించి నవ్వుకున్నాను. ఇదొక నాన్‌స్టాప్‌ ఫన్‌ రైడ్‌. థియేటర్లు మునుపటిలా కళకళలాడుతాయి’’.    

అంతా కొత్తగానే..
‘‘అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని చాలా తెలివిగా ప్లాన్‌ చేశాడు. ‘ఎఫ్‌2’లోని పాత్రల్నే తీసుకొని కొత్త కథని  అద్భుతంగా చెప్పాడు. ఒకటి రెండు చోట్ల ‘ఎఫ్‌2’ గుర్తుకు వస్తుంది తప్ప.. మిగతా అంతా ఫ్రెష్‌గానే ఉంటుంది. దీంట్లో వెంకటేష్‌కి రేచీకటి, వరుణ్‌ తేజ్‌కు నత్తి. ఇలాంటి అన్నీ కొత్త ఎలిమెంట్స్‌ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్‌4’ వస్తుంది. దీనికి సంబంధించి అనిల్‌ ఇప్పటికే నాకు ఓ పాయింట్‌ వినిపించాడు. అది త్వరలో ఉంటుంది’’.

పెద్ద చిత్రాలు ప్రకటిస్తాం..
‘‘సినిమా చాలా మారుతోంది. మార్వెల్‌, అవతార్‌ లాంటి లార్జర్‌ దెన్‌ లైఫ్‌ సినిమాలే నిలబడుతున్నాయి. ఎన్ని చిత్రాలు చేసినా.. ఇప్పుడంతా అలాంటి భారీ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగులోనూ ఈ ట్రెండ్‌ మొదలైంది. దీనికి రాజమౌళి ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో శ్రీకారం చుట్టారు. మేమూ ఒక మూడు కథలపై పని చేస్తున్నాం. రెండేళ్లలో ఒకటి, రెండు పెద్ద చిత్రాల్ని మా బ్యానర్‌ నుంచి ప్రకటించే అవకాశముంది’’.

అందుకే ధరలు తగ్గించాం
‘‘పాండమిక్‌ తర్వాత  పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్‌లు పెరిగాయి. ఇదే సమయంలో ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూడటానికి  అలవాటు పడ్డారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌2’ లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాలకు రేట్లు పెంచి దానికి సరిపడా   రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. మంచి    ఫలితాలు సాధించాం. ఇక్కడ మేము పరిశీలించిన అంశం ఏమిటంటే.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్‌కి దూరమవుతున్నారు. రిపీట్‌ ఆడియెన్స్‌ తగ్గిపోయారు. టికెట్‌ ధరలు వారికి అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ‘ఎఫ్‌3’ అందరి కోసం తీసిన చిత్రం. అన్ని వర్గాల  ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. దీన్ని అందరికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే పాత జీవో ప్రకారం టికెట్‌ ధరల్ని తగ్గించాం’’.

దాని వెనుక కథ..
‘‘మొన్న పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెరిగాయి. నేను పెంచానని విమర్శించారు. నైజాంలో దిల్‌రాజు రిలీజ్‌ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారు. తెర వెనుక బోలెడు కథ ఉంటుంది. నిర్మాతలు, హీరోలు.. ఇలా ఎన్నో లెక్కలుంటాయి. అందుకే టికెట్‌ రేట్లు తగ్గిస్తూ మొదట నేను ఒక అడుగు వేస్తున్నా. ఇది విజయవంతమైతే అందరూ ఇదే ఫాలో అవుతారు’’.

నియంత్రణలో పెట్టుకోలేదు..
‘‘నేను నైజాం మొత్తాన్ని నియంత్రణలో పెట్టుకున్నానని చాలా మంది అంటుంటారు. ఇక్కడ మొత్తం 450 థియేటర్లు ఉంటే.. వాటిలో మా సంస్థకు ఉన్నవి 60. ఆ కొన్నింటితో నేను కంట్రోల్‌లో పెట్టుకునేది ఏమీ ఉండదు.  మా మాట ఎందుకు వింటారంటే.. ఎవరైనా రూపాయి మాకు అడ్వాన్స్‌గా ఇస్తే.. వాళ్ల డబ్బు జాగ్రత్తగా కాపాడుతాం. అలాగే ఎక్కువ చిత్రాలు చేయడం వల్ల సహజంగానే మాకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు కారణాల వల్లే నేను నంబర్‌ వన్‌గా ఉన్నా తప్ప ఏదో నియంత్రణలో పెట్టి కాదు’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని