Dimple Hayathi: చాలా మారింది... ఇంకా మారాలి

అచ్చ తెలుగు అందం.. డింపుల్‌ హయాతి. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలోని ప్రత్యేకగీతంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కథానాయిక...ఆ తర్వాత రవితేజతో కలిసి ‘ఖిలాడీ’ సినిమాతో సందడి చేశారు.

Updated : 26 Apr 2023 21:57 IST

అచ్చ తెలుగు అందం.. డింపుల్‌ హయాతి (Dimple Hayathi). ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలోని ప్రత్యేకగీతంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కథానాయిక...ఆ తర్వాత రవితేజతో కలిసి ‘ఖిలాడీ’ సినిమాతో సందడి చేశారు. ఇటీవల ‘రామబాణం’లో నటించింది. గోపీచంద్‌ కథానాయకుడిగా...శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా డింపుల్‌ హయాతి మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

పరిశ్రమలో తెలుగమ్మాయిలకి లభించే ప్రోత్సాహంలో ఇదివరకు భిన్నాభిప్రాయాలు వినిపించేవి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?  

నేను నా రెండో సినిమాగా ‘రామబాణం’ చేస్తున్నానంటేనే పరిస్థితి మారిందని అర్థం చేసుకోవచ్చు. సినిమా మారింది, ప్రేక్షకులు మారారు. సినిమాల కోసం మమ్మల్ని సంప్రదించే విధానం మారింది. భాష, రంగు తదితర విషయాల్లో ఇదివరకటిలా సంకోచాలు, సందేహాలు ఇప్పుడు లేవు. ఆ విషయాల్లో ఇంకా మార్పు రావాలి.  నేనే కాదు, శ్రీలీల... ఇలా కొద్దిమంది తెలుగమ్మాయిలు ఉన్నారు. పరిశ్రమలో మరో ఐదారుగురు తెలుగు కథానాయికలు వచ్చినప్పుడు మేం సంబరాలు చేసుకుంటాం.

‘రామబాణం’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

నా పాత్ర పేరు భైరవి. తను యూ ట్యూబర్‌. వ్లాగ్స్‌ చేస్తూ ఉంటుంది. నిజ జీవితంలో నేను సామాజిక మాధ్యమాలకి దూరం కాదు కానీ... నెలకో రెండు నెలలకో ఒకట్రెండు అప్‌డేట్స్‌ ఉంటాయంతే. అరీల్స్‌, వ్లాగ్స్‌ చేసే సన్నివేశాలతో  హాస్యం పంచాం. నా పాత్రని ఈ కథకి ఎలా ముడిపెట్టారనేది తెరపైనే చూడాలి. ఈ సినిమాలో ఓ సీరియస్‌ అంశాన్ని చర్చించారు దర్శకుడు.

ఈ కథని ఎప్పుడు విన్నారు? ఈ అవకాశం మీ దగ్గరికి ఎప్పుడొచ్చింది?

‘ఖిలాడీ’ చేస్తున్నప్పుడే ఈ సినిమాకి సంతకం చేశా. అయితే ఈ సినిమాలో నేను ఎంపిక కావడం వెనక చాలా తతంగమే జరిగింది. ‘కిలాడీ’లో చాలా గ్లామరస్‌గా కనిపించా. ఈ సినిమాలోనేమో పక్కింటి   అమ్మాయి తరహా పాత్ర. అందుకే భైరవి పాత్రకి నేను సరిపోననే సందేహం వ్యక్తం చేశారు దర్శకుడు. అందుకోసం రెండుసార్లు స్క్రీన్‌ టెస్ట్‌ చేసి ఆ తర్వాత నన్ను ఎంపిక చేసుకున్నారు. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది నాకు.  నన్ను ‘గద్దలకొండ గణేష్‌’ పాట తర్వాత అంతా గ్లామర్‌ కోణంలోనే చూశారు. ఆ తర్వాత ‘ఖిలాడీ’లో చూసి మరో రకమైన అంచనాలు. అలా నాపైన ఉన్న ఓ ముద్రని తొలగించుకుంటూ నేను సినిమాలు చేయడానికి నాకు కాస్త సమయం పట్టిందేమో. అయితే అవకాశం దక్కితే పక్కా పల్లెటూరి అమ్మాయిగానూ కనిపిస్తా.

చిన్న సినిమాలతో మొదలైన ప్రయాణం సంతృప్తికరంగా ఉందా?

తొలి సినిమానే విమర్శకుల మెప్పు పొందింది. అప్పుడే నటిగా ఎదగడంపై దృష్టి పెట్టా. ఆ తర్వాత పెద్ద సంస్థల్లో.. పెద్ద సినిమాలతో ప్రయాణం చేస్తున్నా. అంటే అవకాశాలతో నన్ను సంప్రదిస్తున్నారనే కదా. ప్రతి సినిమా తర్వాత నన్ను నేను విమర్శించుకుంటూ... నాకు నేను  ఒకొక్క సినిమాతో ఎదిగే ప్రయత్నం చేస్తున్నా. ఇదంతా ఆరంభమే. మరో పదేళ్ల తర్వాత నటిగా నా ప్రయాణం సంతృప్తినిచ్చిందా లేదా అనేది చెప్పగలుగుతా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని