Adipurush: కృతిసనన్‌-ఓంరౌత్‌ తీరుపై స్పందించిన ‘రామాయణ్‌’ సీత

నటి కృతిసనన్‌ (Kriti Sanon) గురించి అలనాటి నటి దీపికా చిక్లియా స్పందించారు. ఇప్పటితరం నటీమణులు సీతమ్మను ఒక పాత్రగానే అనుకుంటున్నారని అన్నారు.

Published : 09 Jun 2023 18:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తిరుమలలో ఇటీవల ‘ఆదిపురుష్‌’ (Adipurush) దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut), నటి కృతిసనన్‌ (Kriti Sanon) వ్యవహరించిన తీరుపై తాజాగా అలనాటి ‘రామాయణం’ ధారావాహిక నటి, సీత పాత్రధారి దీపికా చిక్లియా స్పందించారు. కృతిసనన్‌, ఓంరౌత్‌పై ఆమె మండిపడ్డారు. ఇప్పటి నటీనటులు.. సీతను కేవలం ఒక పాత్రగానే చూస్తున్నారని, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం లేదన్నారు.

‘‘కృతిసనన్‌ ఈతరం నటి. ఇప్పుడున్న రోజుల్లో ముద్దుపెట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం సర్వసాధారణం. ఆమె తనని తాను ఒక సీతమ్మగా అనుకున్నట్లు లేదు. ఇది భావోద్వేగాలకు సంబంధించిన విషయం. అప్పట్లో నేను సీత పాత్రలో జీవించాను. కానీ, ఇప్పటితరం నటీమణులు సీతమ్మను కేవలం ఒక పాత్రగానే అనుకుంటున్నారు. మా రోజుల్లో అలా కాదు. మేము ‘రామాయణం’ ధారావాహికలో నటిస్తున్నప్పుడు సెట్‌లో మమ్మల్ని ఎవరూ పేరు పెట్టి పిలిచే ధైర్యం చేసేవాళ్లు కాదు. అలాగే, మేము పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఎంతోమంది మా పాదాలకు నమస్కారం చేసేవాళ్లు. మమ్మల్ని ఎప్పుడూ నటీనటులుగా కాకుండా దేవుళ్లుగా భావించేవారు. అలాగే, మేము ఎవరినీ ఆలింగనం చేసుకునేవాళ్లం కాదు’’ అని ఆమె పేర్కొన్నారు.

ప్రభాస్‌ - కృతిసనన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక తిరుపతిలో జరిగింది. ఈ వేడుక పూర్తయిన తర్వాత కృతిసనన్‌, ఓంరౌత్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. శ్రీవారి సేవలో పాల్గొన్న అనంతరం బయటకు వచ్చిన కృతిసనన్‌.. ఓంరౌత్‌కు వీడ్కోలు చెబుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని