Published : 24 May 2022 01:26 IST

NBK 108: ‘పోకిరి’, ‘గబ్బర్‌ సింగ్‌’లా బాలకృష్ణతో సినిమా: అనిల్‌ రావిపూడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్టుల్లో #NBK108 (వర్కింగ్‌ టైటిల్‌) ఒకటి. బాలకృష్ణ (Balakrishna) హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించనున్న చిత్రమిది. ఈ కాంబినేషన్‌లో సినిమా ఉందని తెలిసిన క్షణం నుంచే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలోనే ‘బాలయ్య ఇలా కనిపించనున్నారు’, ‘కథ నేపథ్యమిదీ’, ‘ఆ హీరోయిన్‌ బాలయ్యకు కుమార్తెగా కనిపించనుంది’ అంటూ కొన్ని వార్తలు ఫిల్మ్‌ సర్కిల్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ ఊహాగానాలపై అనిల్‌ రావిపూడి ఓ స్పష్టతనిచ్చారు. ‘ఎఫ్‌ 3’ (F 3) సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలు పంచుకున్నారు. ‘‘బాలకృష్ణతో తీయనున్న సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. కామెడీ నా ప్రధానబలం. అలాంటి దాన్ని పక్కనపెట్టి, బాలకృష్ణను చాలా కొత్తగా చూపించబోతున్నా. నా మార్క్‌ వినోదాత్మక సన్నివేశాలుంటాయి గానీ పూర్తిస్థాయి హాస్యానికి అవకాశం లేదు. సుమారు 50 ఏళ్ల వ్యక్తిగా బాలకృష్ణ, ఆయన కూతురిగా శ్రీలీల కనిపిస్తారు. ‘పోకిరి’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘అర్జున్‌ రెడ్డి’ తదితర చిత్రాలను కథానాయకుడి పాత్రే ముందుకు తీసుకెళ్తుంది. ఆ పాత్ర యాటిట్యూడ్‌లోనే అన్ని హంగులుంటాయి. ఆ ప్లాట్‌ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. అందుకే ఆ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నా’’ అని అనిల్‌ తెలిపారు.

‘అఖండ’తో గతేడాది మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. #NBK107 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇది పూర్తయ్యాక అనిల్‌ డైరెక్షన్‌లో బాలకృష్ణ నటించనున్నారు. అనిల్‌ దర్శకత్వం వహించిన ‘ఎఫ్‌ 3’ చిత్రం మే 27న విడుదలకానుంది. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా రూపొందింది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని