Bharathiraja: హీరోగా విజయ్‌ని పరిచయం చేయమంటే.. భారతిరాజా తిరస్కరించారు
ప్రముఖ దర్శకుడు భారతిరాజా అలనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. విజయ్ తండ్రి చేసిన ఓ విజ్ఞప్తిని తిరస్కరించినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: స్వతహాగా దర్శకులైనా కొందరు తమ వారసులని హీరోగా పరిచయం చేసేందుకు వేరే డైరెక్టర్‌ల వైపే మొగ్గు చూపుతుంటారు. ఫలానా దర్శకుడితో తమ కుమారుణ్ని తెరంగేట్రం చేయిస్తే బాగుంటుందని అభిప్రాయపడతారు. తన కొడుకు విజయ్ (vijay) విషయంలో ఎస్.ఎ.చంద్రశేఖర్ (S.A. Chandrasekhar) ఇలానే ఆలోచించారు. విజయ్‌ని కథానాయకుడిగా లాంఛ్ చేయమని.. భారతిరాజాను సంప్రదించి, తన మనసులో మాట బయపెట్టారు. ఆ విజ్ఞప్తిని భారతిరాజా తిరస్కరించారు. ‘మీ తనయుడితో మీరే ఎందుకు సినిమా చేయకూడదని’ అని సలహా ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భారతిరాజా ఈ సంగతులు గుర్తుచేసుకున్నారు. నంబరు 1 హీరో అంటూ విజయ్‌ని కొనియాడారు.
భారతిరాజా ఇచ్చిన సలహా మేరకు ‘నాలైయా తీర్పు’ (naalaiya theerpu) సినిమాతో విజయ్‌ని హీరోగా మార్చారు చంద్రశేఖర్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందా చిత్రం. మరో విశేషం ఏంటంటే.. చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెట్రి’ (vetri) సినిమాతో విజయ్ బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. 1992లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కు కోలీవుడ్‌తోపాటు ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ విశేష అభిమానగణం ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘వారసుడు’తో అలరించిన ఆయన ప్రస్తుతం ‘లియో’ (leo) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు, దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయనున్నారు.
దర్శకుడు భారతిరాజా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన దర్శకత్వం వహించిన ‘16 వయతినిలే’ వంటి తమిళ్ సినిమాలు తెలుగులో రీమేక్ అయి (పదహారేళ్ల వయసు) ఘన విజయం అందుకున్నాయి. నేరుగా తెలుగులో ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం ‘కొత్త జీవితాలు’. ఆ తర్వాత, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ తదితర చిత్రాలు చేశారు. పలు చిత్రాల్లో నటుడిగాను ఆయన తనదైన మార్క్ వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.