Prabhas: శిక్షణ పూర్తవకుండానే ప్రభాస్‌ దూకేశాడు..!: దర్శకుడు జయంత్‌

ప్రభాస్‌ నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్‌’ విడుదలై 20 ఏళ్లు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయంత్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 12 Nov 2022 02:05 IST

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నట ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్‌’ (Eeswar) 2002 నవంబరు 11న విడుదలై సందడి చేసింది. ఆ సినిమా చిత్రీకరణ జ్ఞాపకాలను దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ప్రభాస్‌ తనను నమ్మి నటనలో దూకాడని జయంత్‌ అన్నారు. ‘‘నేను మహేశ్‌బాబుతో ‘టక్కరి దొంగ’ సినిమా చేస్తున్న సమయంలో.. ఓ చిత్రం చేస్తానని నిర్మాత అశోక్‌ కుమార్‌కు మాటిచ్చా. స్వతహాగా నాకు ప్రేమకథలంటే ఇష్టం. అప్పట్లో ఆ స్టోరీలదే ట్రెండ్‌. అయితే, కేవలం లవ్‌కాదు అందులో యాక్షన్‌కూ చోటివ్వాలనేది నా ఆలోచన. దాన్ని తక్కువ బడ్జెట్‌లోనే తెరకెక్కించాలని నేనూ అశోక్‌ నిర్ణయించుకున్నాం. నేను రాసుకున్న కథకు లవర్‌బాయ్‌ ఇమేజ్‌ ఉన్న నటుడు సరిపోడు. అందుకే మాస్‌ లుక్‌ ఉండే కొత్త హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఆ క్రమంలో కృష్ణంరాజుగారి సోదరుడి అబ్బాయి ప్రభాస్‌ అనే కుర్రాడు సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని తెలిసింది’’

ఫొటోలు చూడగానే హీరో మెటీరియల్‌ అనుకున్నా. ఓ హోటల్‌లో ఆయన్ను కలిశా. అతడు స్టార్‌ అవుతాడనే నమ్మకం అప్పుడే కలిగింది. ఇతడే మనకు కావాల్సిన హీరో అని ఫిక్స్‌ అయ్యా. ‘నా ట్రైనింగ్‌ ఇంకా పూర్తికాలేదండి. నాకు కొంత సమయంకావాలి’ అని ప్రభాస్‌ కోరాడు. నీకు శిక్షణ అవసరం లేదు.. నువ్వు చేస్తున్నావ్‌ అని సినిమా బేసిక్‌ లైన్‌ చెప్పగానే పూర్తి కథ వినకుండా నన్ను నమ్మి ‘ఈశ్వర్‌’ కథలో దూకాడు’’ అని జయంత్‌ వివరించారు. ఈ క్యారెక్టర్‌కు ప్రభాస్‌ను ఎంపిక చేయకముందు సినీ నేపథ్యమున్న ఓ యువకుడి ఫొటోలనూ పరిశీలించారట. ఇప్పుడతను పెద్ద స్టార్‌ అయ్యాడని చెప్పిన జయంత్‌.. ఆ హీరో వివరాలు బయటపెట్టలేదు. (#20YearsForPrabhas)

అలా మొదలై.. ఇలా ఎదిగి

ఎమ్మెల్యే కూతురిని పేదింటి కుర్రాడు ప్రేమిస్తే ఏం అవుతుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ధూల్‌పేట్‌ ఈశ్వర్‌గా ప్రభాస్‌ హీరోయిజం ఆకట్టుకుంది. శ్రీదేవి విజయ్‌కుమార్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలోని ‘దిందిరన’, ‘కోటలోని రాణి’, ‘అమీర్‌పేటకు ధూల్‌పేటకు’ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ప్రభాస్‌ రెండో సినిమాగా ‘రాఘవేంద్ర’ను ఎంపిక చేసుకున్నారు. మూడో చిత్రం ‘వర్షం’తో సూపర్‌హిట్‌ అందుకున్నారు. ‘ఛత్రపతి’, ‘బిల్లా’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘మిర్చి’, ‘బాహుబలి’.. ఇలా విభిన్న కథలతో ఆయన సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. ఈ ఏడాది ‘రాధేశ్యామ్‌’తో అభిమానులను కాస్త నిరాశ పర్చిన ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్టు కె’ (వర్కింగ్‌ టైటిల్‌)లతో వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు