K Viswanath: విశ్వనాథ్‌ ‘S’ సెంటిమెంట్‌.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!

దర్శకుడు కె. విశ్వనాథ్‌ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన సినిమాలు, వాటిల్లోని పాత్రలను ప్రేక్షకలోకం గుర్తు చేసుకుంటోంది.

Published : 03 Feb 2023 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కళలే ఇతివృత్తంగా సినిమాలు తీసి, టాలీవుడ్‌, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అరుదైన గుర్తింపు పొందారు కె. విశ్వనాథ్ (K Viswanath). కమర్షియల్‌ హంగులతో రూపొందితేనే సినిమాకు విజయం వరిస్తుందని భావించిన వారిందరికీ తన కథలతో అది తప్పు అని నిరూపించారు. 50కిపైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించగా ‘ఎస్‌’ (S) అక్షరంతో ప్రారంభమయ్యే సినిమాలు విశేష ఆదరణ దక్కించుకోవడం విశేషం. 1973లో తెరకెక్కిన ‘శారద’ సినిమాతో ఆ ఒరవడి ప్రారంభమైంది. ‘సిరిసిరి మువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘శంకరాభరణం’, ‘శుభోదయం’, ‘సప్తపది’, ‘శుభలేఖ’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయంకృషి’, ‘స్వర్ణకమలం’, ‘సూత్రధారులు’, ‘స్వాతికిరణం’, ‘శుభసంకల్పం’, ‘స్వరాభిషేకం’, ‘శుభప్రదం’ చిత్రాలతో అది కొనసాగింది. ఓ సందర్భంలో దీనిపై స్పందించిన విశ్వనాథ్‌.. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఎస్‌ అనే అక్షరంతో మొదలయ్యేలా సినిమాలకు పేరు పెట్టను. కథకు తగ్గ టైటిల్‌ను మాత్రమే పెడతా. చివరకు ఆ పేరు ‘ఎస్‌’తో ప్రారంభమయ్యేది అవుతుంది’’ అని తెలిపారు. తెలుగే కాదు ఆయన హిందీలో తెరకెక్కించిన కొన్ని చిత్రాలకు పేర్లు ‘ఎస్‌’తో ప్రారంభమై, మంచి విజయం దక్కించుకున్నాయి.

అనుకోకుండానే బాలీవుడ్‌లోకి..

బాలీవుడ్‌లోకి వెళ్లాలనే ఆలోచనలేని విశ్వనాథ్‌.. నటుడు, నిర్మాత ప్రేమ్‌జీ వల్ల ఆ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ‘‘హిందీ చిత్ర పరిశ్రమలోకి నా ప్రవేశం చిత్రంగా జరిగింది. నేను దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’ సినిమా చూసి, దాన్ని హిందీలో తీయమని ప్రేమ్‌జీ అడిగారు. తెలుగులో రోజారమణి, కాంతారావు పోషించిన పాత్రలకు హిందీలో రేఖ, శ్రీరామ్‌లాగూను ఎంపిక చేశాం. ప్రొడక్షన్‌ రోజుకో కొత్త రచయితతో సాగేది. దాంతో, ఆ సినిమా ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే ఉండిపోయింది. నా దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేసిన శశిలాల్‌ నాయర్‌కి ఆ సినిమా చేయమని దర్శకత్వ బాధ్యతలు అప్పగించా. అది ‘ఔరత్‌ ఔరత్‌ ఔరత్‌’ పేరుతో 1996లో విడుదలైంది. హిందీ చిత్ర పరిశ్రమలో నా ప్రవేశం రిషికపూర్‌, జయప్రదలతో తెరకెక్కించిన ‘సర్‌గమ్‌’తోనే. దాన్ని ‘సిరిసిరి మువ్వ’ రీమేక్‌గా రూపొందించాం’’ అని విశ్వనాథ్‌ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విశేషాలు చెప్పారు.

రీమేకే అయినా టేకింగ్‌ వేరు..

విశ్వనాథ్‌ హిందీలో పది చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో 8 రీమేక్‌లుకాగా ‘సంగీత్‌’, ‘ధన్‌వాన్‌’.. నేరుగా హిందీ తీసిన సినిమాలు. శంకరాభరణం- సుర్‌సంగమం, సప్తపది- జాగ్‌ ఉఠా ఇన్సాన్‌, శుభోదయం- కామ్‌చోర్‌, జీవన జ్యోతి- సన్‌జోగ్‌, శుభలేఖ- శుభ్‌ కామ్నా, స్వాతిముత్యం- ఈశ్వర్‌గా రీమేక్‌ అయ్యాయి. ‘‘నా దృష్టిలో రీమేక్‌ అంటే ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ కాపీ చేయడంకాదు. మాతృకలోని ఆత్మకథను పోగొట్టకుండా, లోటుపాట్లను సవరించడం’’ అని విశ్వనాథ్‌ అనేవారు.

నెరవేరని కల..

తాను తెలుగులో తీసిన ‘అల్లుడు పట్టిన భరతం’, ‘స్వయంకృషి’ చిత్రాలను హిందీలో రీమేక్‌ చేయాలనేది విశ్వనాథ్‌ కోరిక. కానీ, ఆయన కల నెరవేరలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు