Ghani: అందుకే వరుణ్‌తేజ్‌ను బాక్సర్‌గా మార్చా: కిరణ్‌ కొర్రపాటి

‘‘వరుణ్‌తేజ్‌ కటౌట్‌కు బాక్సింగ్‌ బాగుంటుంది. అందుకే ఆ నేపథ్యంలోనే చిత్రం తెరకెక్కించా’’ అని కిరణ్‌ కొర్రపాటి అన్నారు. ‘గని’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Published : 04 Apr 2022 23:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘వరుణ్‌తేజ్‌ కటౌట్‌కు బాక్సింగ్‌ బాగుంటుంది. ఆ నేపథ్యంలోనే చిత్రం తెరకెక్కించా’’ అని కిరణ్‌ కొర్రపాటి అన్నారు. ‘గని’ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

*  నేను చెన్నైలో ఉన్నప్పుడు ప్రతి సినిమా ప్రీమియర్‌ షో చూసేవాడ్ని. అలా సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌ వచ్చాకే దర్శకత్వం చేయాలనుకున్నా. ముందుగా దర్శకుడు వి.వి. వినాయక్‌ ఆ తర్వాత శ్రీనువైట్ల, హరీశ్‌ శంకర్‌, రాఘవ లారెన్స్‌ తదితరుల దగ్గర పనిచేశా.

ఈ సినిమాకు ముందే వరుణ్‌తేజ్‌తో నాకు పరిచయం ఉంది. ఎప్పటి నుంచో ఆయన నాతో సినిమా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో రెండు మూడు కథల గురించి చర్చించుకున్నాం. స్పోర్ట్స్‌ డ్రామాను ఫిక్స్‌ చేశాం. ఇతర క్రీడా నేపథ్య చిత్రాల్లో కథకు ప్రాధాన్యముంటుంది కానీ శారీరకంగా హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే అవకాశం అంతగా ఉండదు. అందుకే వరుణ్‌ కటౌట్‌కు బాక్సింగ్‌ బెటర్‌ అనుకుని స్క్రిప్టు సిద్ధం చేశా.

* ప్రతి స్పోర్ట్స్‌ డ్రామాలోనూ జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగే స్ఫూర్తిమంతమైన ప్రయాణం ఉన్నట్టే ఇందులోనూ ఉంటుంది. ఈ సినిమాకు ‘ఫైటర్‌’, ‘ఛాంపియన్‌’వంటి టైటిళ్లు అనుకున్నాం కానీ కుదరలేదు. కథానాయకుడి పాత్రకు తగ్గట్టు పవర్‌ఫుల్‌గా ఉండే రెండక్షరాల పేరు అయితే బాగుంటుందనుకున్నాం. అదే సమయానికి వరుణ్‌ నటించిన ‘గద్దలకొండ గణేశ్‌’ సినిమా విడుదలైంది. అందులోని గణేశ్‌ అలియస్‌ గని పాత్ర పాపులరైంది. ఆ పేరు పెడితే ఎలా ఉంటుందని వరుణ్‌ అడగ్గానే వెంటనే ఓకే చేశా. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘బాలు’ సినిమాలోని గని పాత్రకూ ప్రత్యేక అభిమానగణం ఉంది. 

 ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఉపేంద్రగారిని సుమారు 6 నెలలు సంప్రదించాం. ‘నేను ఎలాంటి సినిమాలు చేయట్లేదమ్మా’ అని సమాధానమిచ్చేవారు. ఓ సారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆయన్ను కలిశా. 5 నిమిషాల సమయం ఇచ్చారు కానీ కథలో లీనమవడంతో గంట గడిచింది. పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడలో ఒకే రోజు విడుదల చేస్తున్నాం. ‘బీస్ట్‌’, ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ సినిమాల దృష్ట్యా తమిళం, కన్నడలో రెండు వారాల తర్వాత రిలీజ్‌ చేయనున్నాం.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని