Krishna Vamsi: ఐదేళ్లు అప్పులు కట్టాను.. కృష్ణవంశీ ట్వీట్‌కు అవాక్కైన నెటిజన్లు

కృష్ణవంశీ(Krishna Vamsi) దర్శకత్వం వహించిన ఓ సినిమాను రీరిలీజ్‌ చేయాలని నెటిజన్లు కోరారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై వైరల్‌ అవుతోంది. 

Published : 06 Jan 2023 01:41 IST

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌లు ట్రెండింగ్‌గా మారాయి. ఆయా హీరోల పుట్టినరోజుల్లో పాత సినిమాలను హైక్వాలిటీలో మరోసారి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్‌ కూడా రీరిలీజ్‌లకు భారీగానే వెళ్తున్నారు. అయితే, ప్రస్తుతం ఓ సినిమా రీరిలీజ్‌కు సంబంధించి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పెట్టిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాను రీరిలీజ్‌ చేయాలని ఓ నెటిజన్‌ కోరగా.. ఆయన ఇచ్చిన రిప్లైకి అందరూ ఆశ్చర్యపోయారు.

1997లో విడుదలైన ‘సింధూరం’(Sindhooram) సినిమా నేషనల్‌ అవార్డు దక్కించుకున్నప్పటికీ కమర్షియల్‌గా హిట్‌ అవ్వలేదు. రవితేజ(Raviteja), బ్రహ్మాజీ(Brahmaji), సంఘవి(Sanghavi) నటించిన ఈ చిత్రాన్ని బిగ్‌ స్క్రీన్‌పై మళ్లీ చూడాలని కొందరు సినీప్రియులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని కృష్ణవంశీని కోరారు. ‘‘సర్‌ ఓక్క సారి సింధూరం సినిమాను రీరిలీజ్‌ చేయండి. నాలాంటి వాళ్లు చాలామంది చూడడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా ఆశ నెరవేర్చాలని కోరుకుంటున్నాం’’ అని ట్వీట్‌ చేశారు. కృష్ణవంశీ దీనికి స్పందిస్తూ ‘‘అమ్మో.. ఐదు సంవత్సరాలు అప్పులు కట్టానయ్యా, వామ్మో..’’ అంటూ దండం పెట్టేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయింది. ‘ఇది సాదాసీదా సినిమా కాదు’ అని ఒకరంటే.. ‘ఇప్పుడు రిలీజ్‌ చేయండి. సూపర్‌ హిట్‌ అవుతుంది’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

ప్రస్తుతం కృష్ణవంశీ (Krishna Vamsi) ‘రంగమార్తాండ’ (Ranga Maarthaanda) అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమా కోసం చిరంజీవి చెప్పిన ‘నేనొక నటుణ్ని’ షాయరీ అందరినీ ఆకట్టుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని