Rangamarthanda: అందుకే ‘రంగమార్తాండ’కు ప్రచారం చేయలేదు: కృష్ణవంశీ

ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ‘రంగమార్తాండ’ సినిమా. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 24 Mar 2023 20:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది ‘రంగమార్తాండ’తో మరోసారి (rangamarthanda) రుజువైందన్నారు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ. ఎక్కువ ప్రచారం చెయ్యకపోయినా.. ఆ సినిమాకు మంచి విజయాన్ని అందించారని, విజయంలో భాగమైన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ తదితరులతో ఆయన తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల ఉగాది కానుకగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో కృష్ణవంశీ (Krishna Vamsi)  మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..

* ‘నట్‌సామ్రాట్‌’ని తెలుగులో తీయాలని ఎందుకు అనిపించింది?

కృష్ణవంశీ: నాకు మాములుగా రీమేక్‌ సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ ‘నట్‌సామ్రాట్‌’ సినిమా చూశాక నాకు తెలియకుండానే ఎమోషనల్‌ అయ్యా. ప్రస్తుతం బంధాలకు, బంధుత్వాలకు విలువ తగ్గుతోంది. ఎవరిని చూసినా ముందు నేను, నా తర్వాత డబ్బు ఆ తర్వాతే ఏదైనా అనే ధోరణిలో ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని సంఘటనలు నేరుగా చూశాక చాలా బాధేసింది. ఈ పాయింట్‌పై ఎలా అయినా సినిమా తీయాలనిపించింది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తారనే ముద్ర సినీ రంగంపై పడిపోయింది. దానికి భిన్నంగా తీయాలని నిర్ణయించుకున్నా. మంచి ఫీల్‌తో ఈ సినిమా తీశా.

* ఓ రంగస్థల నటుడి కథను తెరపై చూపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

కృష్ణవంశీ: ఎమోషన్స్‌ మాత్రమే ఉండాలని ఫిక్స్‌ అయ్యా. నేను ఇంతకు ముందు తీసిన సినిమాల ప్రభావం దీనిపై ఉండకుండా చూసుకున్నా. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడు ప్రతి దాన్ని ఫీలవ్వాలి. ఒరిజినల్‌ సినిమాలో పెళ్లి సన్నివేశం లేదు. నేను తెలుగులో ఆ సన్నివేశాన్ని పెట్టాను.

* ఓ డైరెక్టర్‌గా ఈ సినిమా తర్వాత మీలో మార్పు వచ్చిందా?

కృష్ణవంశీ: డైరెక్టర్‌గా కంటే ఓ మనిషిగా నాలో చాలా మార్పు వచ్చింది. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మా అమ్మకు చెప్పకుండా వచ్చేస్తా. ఇలాంటి విషయాల్లో ఈ సినిమా చూశాక మార్పు వచ్చింది. ఈ సినిమా చూశాక చాలా మందిలో మార్పు వచ్చింది. ‘మా అమ్మ గుర్తొచ్చింది, నా భార్య గుర్తొచ్చింది’ అని ఎంతో మంది చెప్పారు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా గిల్టీగా ఉందని ఇంట్లో వాళ్లతో మాట్లాడాలని అన్నారు.

* ఈ సినిమా విషయంలో ఎప్పుడైనా భయపడ్డారా? ప్రమోషన్స్‌ ఎందుకు చెయ్యలేదు?

కృష్ణవంశీ: అన్ని సినిమాలలాగే ఈ సినిమా విషయంలోనూ భయపడ్డా. ఈ సినిమా తీస్తున్నప్పుడు ‘ఫ్లాపుల్లో ఉన్నాడు. అందుకే ఇలాంటి సినిమా తీస్తున్నాడు’ అని చాలామంది అన్నారు. సినిమా ఎడిట్‌ చెయ్యడం అయిపోయాక నా స్నేహితులను కొంతమందికి చూపించా. అందరూ ‘మా కుటుంబం గుర్తొచ్చింది’ అని ఒకే మాట చెప్పారు. కొందరు ఏడుస్తూ వచ్చి నన్ను హత్తుకున్నారు. అందుకే ప్రచారం కూడా లేకుండా అంత ధైర్యంగా విడుదల చేశా. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది.

* ఈ సినిమాలో చక్రి పాత్ర గురించి చెప్పండి? బ్రహ్మానందాన్ని ఆ పాత్రకు తీసుకోవాలని ఎందుకనిపించింది?

కృష్ణవంశీ: క్లైమాక్స్‌లో చక్రి పాత్రకు సంబంధించి ప్రతి సన్నివేశాన్ని చాలా పరిశీలించి రాశాను. కరోనా వల్ల నాకు ఆలోచించుకోవడానికి చాలా సమయం దొరికింది. ఆ పాత్రకు బ్రహ్మానందం మాత్రమే సరిపోతారని అనిపించింది. ఎందుకంటే.. ప్రకాశ్‌రాజ్‌- బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు చూస్తే ఆ చక్రి పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. కొన్ని డైలాగులు తెలుగులో ఆయనలా స్పష్టంగా మరెవరూ పలకలేరు. బ్రహ్మానందం అయితే ఈ పాత్రకు 100 శాతం న్యాయం చెయ్యగలరనుకున్నా. ఆయన వెయ్యి శాతం చేశారు. కొన్ని సన్నివేశాలు తీసేటప్పుడు అవి బాగా రావాలని అన్నం కూడా తినలేదు. సుమారు 1200  సినిమాలు చేసినా ఈ సినిమానే మొదటి సినిమా అన్నట్లు చేశారు. నేను కథ చెప్పడానికి వెళ్లగానే వెంటనే ఓకే చేశారు. ఈ సినిమాలో చెప్పినన్ని డైలాగులు కెరీర్‌ మొత్తంలో కూడా చెప్పి ఉండరు.

* ఈ పాయింట్‌తో సినిమా తీయాలని ఎందుకు అనిపించింది?

కృష్ణవంశీ: తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య జనరేషన్‌ గ్యాప్‌ ఉందని  అందరూ అనుకుంటున్నారు. కానీ, అది అసలు ఉండదు. ఒకే ఇంట్లో పెరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్‌ ఎందుకు వస్తుంది.. రాదు. తల్లిదండ్రులను అర్థం చేసుకునే విషయంలోనే తేడా వస్తుంది.  ఈ విషయాన్ని తెరపై చూపించాలనుకున్నా.

* ప్రకాశ్‌రాజ్‌ లాంటి పాత్రలు నిజ జీవితంలో ఉంటాయంటారా?

కృష్ణవంశీ: ఉన్నారు. ఒకే రోజు 7 నాటకాలు వేసే వాళ్లు నాకు తెలుసు. అలా వచ్చిన డబ్బుతో జీవితంలో సెటిల్‌ అయిన వాళ్లు చాలా మంది  ఉన్నారు. నాటకాలు వేసే వాళ్లు డబ్బులు సంపాదించలేరు అని అందరూ అనుకుంటారు. ఆ భావన తప్పు. అలాగే నా జీవితంలో నేను చూసిన చాలా సంఘటనలను ఈ మూవీలో చూపించాలని అనుకున్నా. ఇంగ్లిషు రాకపోతే సమాజంలో ఎలా చూస్తుంది.. ఆస్పత్రిలో డబ్బు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది... ఇలాంటి విషయాలు చూపించాలనుకున్నా.

* ఈ సినిమాలో ఓ పాట 12 నిమిషాలు ఉంది. ఆ పాట సమయంలో ఎస్పీ బాలు గుర్తొచ్చారా?

కృష్ణవంశీ: ఒరిజినల్‌ సినిమా నట్‌సామ్రాట్‌లో పాటలు లేవు. తెలుగులో పాటలు పెట్టాలని నేను నిర్ణయించుకున్నా. నాకు బాలు గారంటే చాలా ఇష్టం. ఈ పాటను సీతారామశాస్త్రి గారు అద్భుతంగా రాశారు. వీళ్లు చాలామంది జీవితాల్లో చాలా ముఖ్యమైన వాళ్లుగా నిలిచిపోయారు. వాళ్లేప్పుడు నాతోనే ఉంటారని నేను అనుకుంటుంటా.

* ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నారు?

కృష్ణవంశీ: మనకు ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. అనుకున్నది ఏదీ జరగదు. ఏది.. ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. నాకు యండమూరి వీరేంద్రనాథ్‌ రచనలంటే ఇష్టం. చాలా మంది తెలుగు విషయంలో కొంత ఇబ్బంది పడతారు. తెలుగు రాయడం, పలకడం ఇలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి వారి కోసమే ఈ సినిమాలో షేక్‌స్పియర్‌ సన్నివేశాలను పెట్టాను. 

* శివాత్మిక, అనసూయల గురించి చెప్పండి?

కృష్ణవంశీ: శివాత్మిక అంత అద్భుతంగా చేస్తుందని నేను అనుకోలేదు. అంతమంది అనుభవం ఉన్న నటీనటుల మధ్యలో కూడా వాళ్లకు తగ్గట్లు నటించింది. అనసూయ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు  కంటతడి పెట్టుకుంది.

* రమ్యకృష్ణ పాత్ర ఎలా అనిపించింది?

కృష్ణవంశీ: నేను ఆ పాత్ర గురించి వేరే వాళ్లతో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు రమ్య వినేది. ఓసారి ‘నేను చెయ్యనా?’ అని అడిగింది. తనకి ఓకే చెప్పే ముందు నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. ఇలాంటి క్యారెక్టర్‌ తనకు కొత్త కదా.. తను పెద్ద స్టార్‌ ఇలాంటి సైలెంట్‌గా ఉండే పాత్రలో చెయ్యగలదా అనుకున్నా. మంచి ఆర్టిస్టు అని తెలుసుగానీ గొప్ప నటి అని ఈ సినిమా సమయంలోనే నాకు అర్థమైంది. 

* మీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?

కృష్ణవంశీ: బెస్ట్‌ అంటూ ఎవరూ లేరు. కానీ, అందరి కంటే రమ్యకృష్ణ ఎక్కువ. ప్రశంసించాలన్నా.. విమర్శించాలన్నా ఆవిడే.

* మీ తర్వాత ప్రాజక్టుల గురించి చెప్పండి?

కృష్ణవంశీ: ఇంకా ‘రంగమార్తాండ’ విజయోత్సహంలోనే ఉన్నా. దీని నుంచి బయటకు వచ్చాక చెబుతా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని