Lingusamy: ‘వారిసు’ రిలీజ్‌.. నిర్మాతల మండలి నిర్ణయంపై లింగుస్వామి ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో ‘వారిసు’ రిలీజ్‌పై నెలకొన్న వివాదంపై  పెదవి విప్పారు దర్శకుడు లింగుస్వామి. టాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.

Updated : 20 Nov 2022 11:10 IST

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై తమిళనాడు వ్యాప్తంగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలువురు కోలీవుడ్‌ దర్శకనిర్మాతలు పెదవి విరిచారు. తాజాగా దర్శకుడు లింగుస్వామి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి తనకు ఏమాత్రం నచ్చలేదని అన్నారు. ఒకవేళ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించిన విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

‘‘తమిళ సినిమాకు ఇది సువర్ణ శకంగా చెప్పవచ్చు. పాన్‌ ఇండియా అనేది ఇక్కడ కొత్తేమీ కాదు. ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్నో చిత్రాలు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఓటీటీ రంగం అభివృద్ధి చెందడంతో ఏ భాష వారైనా.. ఎక్కడి నుంచైనా సినిమాలు చూసే అవకాశం లభించింది.  తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే.. ‘వారిసు’కు ముందు.. తర్వాత అనేలా సినిమా మారుతుంది. ఇరు ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఇదే మరోసారి రిపీట్‌ అయితే తర్వాత ఏం చేయాలో మేమూ చూస్తాం’’ అని లింగుస్వామి ఫైర్‌ అయ్యారు. మరోవైపు శనివారం జరిగిన ‘తోడేలు’ ప్రెస్‌మీట్‌లో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయంపై అల్లు అరవింద్‌ స్పందిస్తూ.. అది జరిగే పని కాదని అన్నారు.

విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారిసు’. దిల్‌రాజు నిర్మాత. యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. సంక్రాంతి కానుకగా దీన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనతో ‘వారిసు’ రిలీజ్‌ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని