Director Madan: దర్శకుడు మదన్‌ ఇక లేరు

ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత మదన్‌ (50) హైదరాబాద్‌లో కన్నుమూశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకి గురైన ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

Updated : 21 Nov 2022 06:59 IST

ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత మదన్‌ (50) (Madan) హైదరాబాద్‌లో కన్నుమూశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకి గురైన ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. మదన్‌ పూర్తి పేరు రామిగాని మదన్‌ మోహన్‌ రెడ్డి. చిత్ర పరిశ్రమకి ఆర్‌.ఆర్‌.మదన్‌గా సుపరిచితం. ఆయన స్వస్థలం అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం  బండమీదపల్లె. చదువుకునే రోజుల్లోనే రచనపై మక్కువ పెంచుకున్న ఆయన, దర్శకుడు కావాలనే కలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ఎస్‌.గోపాల్‌ రెడ్డి దగ్గర కెమెరా విభాగంలో సహాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టి మెలకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలకి రచన విభాగంలో పనిచేశారు. విజయవంతమైన ‘ఆ నలుగురు’ సినిమాకి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో దర్శకత్వ ప్రయాణం మొదలు పెట్టారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న మదన్‌ పరిశ్రమ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించారు. ఆ తర్వాత ‘ప్రవరాఖ్యుడు’, ‘గుండె ఝల్లుమంది’, ‘కాఫీ విత్‌ మై వైఫ్‌’, ‘గరం’ చిత్రాల్ని రూపొందించారు. చివరిగా మోహన్‌బాబు కథానాయకుడిగా ‘గాయత్రి’ చిత్రాల్ని తెరకెక్కించారు. తాను దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలకి మదన్‌ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రతిభావంతుడైన మదన్‌ చిన్న వయసులోనే దూరం కావడంతో చిత్రసీమలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. ఆయన భౌతికకాయానికి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియల్ని నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని