Ponniyin Selvan Review: రివ్యూ: పొన్నియిన్ సెల్వన్‌-1

Ponniyin Selvan Review: విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, కార్తి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఎలా ఉందంటే? 

Updated : 22 Nov 2022 14:35 IST

చిత్రం: పొన్నియిన్‌ సెల్వన్‌ - 1; న‌టీన‌టులు: విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ్ల, జయరామ్, ఆర్.పార్థిబన్, ప్రభు త‌దిత‌రులు;  పాట‌లు: అనంత‌శ్రీరామ్‌; ఛాయాగ్రహణం: ర‌వి వర్మన్; కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్; సంగీతం: ఎ.ఆర్.రెహమాన్; మాట‌లు: త‌నికెళ్ల భ‌ర‌ణి, బి. జ‌యమోహన్; నిర్మాణం: మణిరత్నం, అల్లిరాజా సుభాస్కరన్; దర్శకత్వం: మ‌ణిరత్నం; స్క్రీన్ ప్లే: మణిరత్నం, ఎలాంగో కుమారవేల్; నిర్మాణ సంస్థలు: మద్రాస్ టాకీస్,  లైకా ప్రొడక్షన్స్; విడుద‌ల సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌; విడుదల తేదీ: 30-09-2022

త‌మిళ‌నాట అత్యంత పాఠ‌కాద‌ర‌ణ పొందిన న‌వ‌ల ‘పొన్నియిన్ సెల్వన్‌’. క‌ల్కి కృష్ణమూర్తి ర‌చించిన ఈ న‌వ‌ల ఆధారంగా సినిమా తీయాల‌ని ద‌శాబ్దాలుగా ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఘ‌న‌మైన చ‌రిత్ర‌, శ‌క్తిమంత‌మైన పాత్రల‌తో కూడిన ఈ న‌వ‌ల‌ని రెండు భాగాలుగా తెర‌కెక్కించ‌డం ఓ సాహసమే. ఎట్టకేల‌కు మ‌ణిర‌త్నం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రంగంలోకి దిగారు. గొప్ప న‌టుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ప‌ట్టాలెక్కించారు. దీంతో క్లాప్ కొట్టిన రోజు నుంచే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా ట్రెండ్ న‌డుస్తోన్న వేళ.. అత్యాధునిక సాంకేతిక‌త‌తో ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కింది. ‘పీఎస్‌-1’ పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలి భాగం (ponniyin selvan review) ఎలా ఉందంటే..

క‌థేంటంటే: చోళ చ‌క్రవ‌ర్తి సుంద‌ర చోళుడు (ప్రకాశ్‌రాజ్‌) చివ‌రి రోజుల్లోని క‌థ ఇది. ఆయ‌నకు ఇద్దరు కుమారులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్‌), అరుణ్‌మొళి వ‌ర్మన్ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జ‌యం ర‌వి), ఒక కుమార్తె కుంద‌వై (త్రిష‌). ఇద్దరు కుమారులూ కంచి, శ్రీలంకలో యువ‌రాజులుగా కొన‌సాగుతుంటారు. కుంద‌వై తండ్రి చెంత‌నే ఉంటుంది. త‌న‌తో క‌లసి యుద్ధంలో పాల్గొన్న వందియ‌దేవ‌న్ (కార్తి)ను తంజావూరులో ఉన్న త‌న తండ్రి, చెల్లెలు ద‌గ్గరికి  ఓ లేఖ ఇచ్చి పంపుతాడు ఆదిత్య కరికాలన్‌. అలాగే తన తండ్రి సామ్రాజ్యంలో ఏదో జ‌రుగుతోంద‌ని, అదేంటో తెలుసుకొని ర‌మ్మని కూడా చెబుతాడు‌. అలా ఆ దేశానికి వెళ్లిన వందియ‌దేవ‌న్.. ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్‌ (శ‌ర‌త్‌ కుమార్‌), ఇత‌ర సామంతులు  క‌లసి ప‌న్నిన ఓ కుట్రని గ్రహిస్తాడు.

సుంద‌ర చోళుడిని త‌ప్పించి మ‌ధురాంత‌కుడి (రెహమాన్‌)ని చ‌క్రవ‌ర్తిని చేయాల‌నేది పళవేట్టురాయర్‌ కుట్ర. ఆ విష‌యం తెలుసుకున్న కుందవై... పొన్నియిన్ సెల్వన్‌ను తంజావూరు ర‌మ్మని వందియ‌దేవ‌న్‌తో కబురు పంపిస్తుంది. ఇంత‌లో పొన్నియిన్ సెల్వన్‌ను ఖైదు చేసి తీసుకుర‌మ్మని పళవేట్టురాయర్‌ లంక‌కి త‌న మ‌నుషుల్ని పంపుతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? పొన్నియిన్ సెల్వన్‌, వందియ‌దేవ‌న్ క‌లిసి పళవేట్టురాయర్‌ పంపిన సైన్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి? ఈ క‌థ‌లో నందిని (ఐశ్వర్యా రాయ్‌) ఎవ‌రు? ఆమెకు, పొన్నియిన్ సెల్వన్‌కీ, ఆదిత్య క‌రికాల‌న్‌కీ ఉన్న సంబంధ‌మేమిటనేది తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: మ‌ణిర‌త్నం శైలి క‌థ‌నంతో కూడిన సినిమా ఇది. రాజ్యం, కుట్రలు కుతంత్రాలు,  సాహ‌సాలతో చ‌రిత్రని ఉన్నదున్నట్టుగా తెర‌పై ఆవిష్కరించే ప్రయ‌త్నం చేశారు. ఇలాంటి కథ అనగానే మ‌న‌కు బాహుబ‌లి సినిమానే గుర్తుకొస్తుంది. అయితే ఆ త‌ర‌హాలో హీరోయిజం, ఫాంట‌సీ, డ్రామా అంశాల జోలికి వెళ్లకుండా త‌న మార్క్ స్క్రీన్‌ప్లేతో, ఓ స్థాయి డ్రామాతో చోళుల పాల‌న‌లో ఓ శ‌కాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు మణిరత్నం. రెండు భాగాలుగా తీసిన ఈ సినిమాకి పొన్నియిన్ సెల్వన్‌ని అడుగ‌డుగునా కాపాడే ఓ స్త్రీ పాత్ర కీల‌కం. ఆమె పాత్రనే సెకండ్‌ పార్ట్‌(పీఎస్‌-2) కీల‌కంగా మార్చారు. బాహుబ‌లిని క‌ట్టప్ప ఎందుకు చంపాడ‌నే ప్రశ్నలాగా, ఆమె పొన్నియిన్ సెల్వన్‌ని ఎందుకు కాపాడుతోంది? ఇంత‌కీ ఆమె ఎవ‌ర‌నేది కీల‌కం. తొలి భాగంలో వందియ దేవ‌న్ పాత్రకే ఎక్కువ‌గా ప్రాధాన్యం ద‌క్కింది. దాదాపుగా అత‌నే హీరోలా క‌నిపిస్తాడు.

రాజ్యాలు తిరుగుతూ, సాహ‌సాలు చేస్తూ, మ‌ధ్యలో తార‌స‌ప‌డే మ‌హిళ‌ల‌తో స‌ర‌సాలు సాగిస్తూ సాగించే వందియ‌దేవ‌న్ ప్రయాణం  వినోదాన్ని పంచుతుంది. ఆదిత్య క‌రికాల‌న్, నందిని మ‌ధ్య బంధం, సంఘ‌ర్షణ కూడా కీల‌కం. క‌థ‌, క‌థ‌నాలు ఆస‌క్తిని రేకెత్తించినా అక్కడ‌క్కడా సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఇద్దరు యువ‌రాజులతోపాటు, యుద్ధ వీరుల్లాంటి వందియ‌దేవ‌న్‌, పళవేట్టురాజు పాత్రలు ఉన్నప్పుడు వాటిని మ‌రింత శ‌క్తిమంతంగా తీర్చిదిద్ది హీరోయిజాన్ని, డ్రామాని పండించే ఆస్కారం ఉంది. కానీ, ద‌ర్శకుడు ఆ దిశ‌గా దృష్టి సారించ‌లేదు. యుద్ధ స‌న్నివేశాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి. స‌ముద్రంలో సాగే ప‌తాక స‌న్నివేశాలు మాత్రం కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తాయి. బోలెడంత సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చినా  స‌న్నివేశాల్లో కొత్తద‌నం చూపించ‌లేక‌పోయారు మ‌ణిర‌త్నం. పుస్తకాన్ని తెర‌పై ఆవిష్కరించే ప్రయ‌త్నం చేసిన‌ట్టు అనిపిస్తుంది త‌ప్ప‌.. పెద్దగా అనుభూతిని పంచ‌లేక‌పోయారు.

ఎవ‌రెలా చేశారంటే: విక్రమ్ పోషించిన ఆదిత్య క‌రికాల‌న్ పాత్రతోనే క‌థ మొద‌ల‌వుతుంది. ఆరంభ స‌న్నివేశాల్లో ఆయ‌న అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. వీరోచితాన్ని చూపిస్తూనే, ప్రేమ‌లో ఓడిపోయిన యువ‌రాజుగా చ‌క్కటి భావోద్వేగాల్ని పండించారు. (ponniyin selvan review) పొన్నియిన్ సెల్వన్‌గా జ‌యం ర‌వి క‌నిపిస్తారు. ద్వితీయార్ధంలోనే ఆ పాత్రకి ప్రాధాన్యం ద‌క్కింది. ప‌తాక స‌న్నివేశాల్లో ఆయ‌న పోరాటాలు ఆక‌ట్టుకుంటాయి. వందియ‌దేవ‌న్ పాత్రలో కార్తి చేసిన హంగామా సినిమాకే హైలైట్‌. నంబి పాత్రని పోషించిన జ‌య‌రామ్‌తో క‌లిసి హాస్యం కూడా పండించారు. ఐశ్వర్యారాయ్‌, త్రిష‌ల‌తో క‌లిసి చేసే హంగామా ఆక‌ట్టుకుంటుంది. తొలి భాగం వ‌ర‌కు వందియ‌దేవ‌న్ పాత్రే హీరో. ఇక అందంతో క‌ట్టిప‌డేశారు ఐశ్వర్యారాయ్‌, త్రిష‌. ఐశ్వర్యల‌క్ష్మి, శోభిత చిన్న పాత్రల్లో సంద‌డి చేశారు.

ప్రకాశ్‌రాజ్‌, శ‌ర‌త్‌కుమార్‌, పార్తిబన్, విక్రమ్ ప్రభు త‌దిత‌రుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్నంత‌లో ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతిక విభాగాల్లో ర‌వివ‌ర్మన్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంది. ఎ.ఆర్‌.రెహమాన్ సంగీతం ఒక స్థాయిలో ప్రభావం చూపించింద‌ంతే. పాట‌ల చిత్రీక‌ర‌ణ మెప్పిస్తుంది. కాస్త అవ‌కాశం దొరికినా విజువ‌ల్‌గా ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం జ‌రుగుతున్న రోజులివి. చరిత్రాత్మకమైన క‌థ చేతిలో ఉన్నా.. తెర‌పై ఎంతైనా చూపించే అవ‌కాశం ఉన్నా.. విజువ‌ల్స్ ప‌రంగా పెద్దగా ప్రభావం చూపించ‌లేక‌పోయిందీ బృందం. ద‌ర్శకుడు మ‌ణిర‌త్నం క‌థ‌నం ప‌రంగా ఒక‌ట్రెండు సంఘ‌ర్షణాత్మక స‌న్నివేశాల్లో మెప్పిస్తారంతే. బోలెడ‌న్ని పాత్రలు, వాటి పేర్లు, కుట్రలు తెర‌పై చూస్తున్నప్పుడు కాస్త గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. నిజానికి ఒక్కొక్క పాత్రతో ఒక్కో సినిమా చేసేంత బ‌లమైన పాత్రలు ఇవి. వీట‌న్నింటికీ న్యాయం జ‌ర‌గ‌లేదేమో అనిపిస్తుంది.

బ‌లాలు

+ క‌థ‌నం

కార్తి పాత్ర‌, న‌ట‌న

న‌టీన‌టులు

ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- భావోద్వేగాలు లేక‌పోవ‌డం

హీరోయిజం లేని స‌న్నివేశాలు

డ్రామా కొర‌వ‌డటం

చివ‌రిగా: చోళుల చ‌రిత్రని ఆవిష్కరించే ‘పీఎస్‌1’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని