Modern Love: ఇక్కడ ఆ స్వేచ్ఛ ఉంది: నగేశ్‌ కుకునూర్‌

సినిమాలకు దర్శకత్వం వహించేటపుడు ఒకే ప్లాట్‌కు కట్టుబడి ఉండాలని, అది ప్రేక్షకులకు నచ్చుతుందో లేదోనన్న సందేహాలుంటాయని దర్శకుడు నగేశ్‌ కుమార్‌ తెలిపారు.

Published : 07 Jul 2022 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలకు దర్శకత్వం వహించేటప్పుడు ఒకే ప్లాట్‌కు కట్టుబడి ఉండాలని, అది ప్రేక్షకులకు నచ్చుతుందో లేదోనన్న సందేహాలుంటాయని దర్శకుడు నగేశ్‌ కుమార్‌ (Nagesh Kukunoor) అన్నారు. తాను దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘మోడ్రన్‌ లవ్‌: హైదరాబాద్‌’ (Modern Love: Hyderabad) విషయంలో అలాంటి ఆలోచనలేవీ రాలేదని, స్వేచ్ఛతో తెరకెక్కించానని తెలిపారు. ప్రముఖ నటులు సుహాసిని, రేవతి, నిత్య మేనన్‌, రీతూవర్మ, మాళవిక నాయర్‌, ఆది పినిశెట్టి, నరేశ్‌ అగస్త్య తదితరులు కీలక పాత్రలు పోషించిన సిరీస్‌ ఇది. ఆరు ప్రేమ కథల సంకలనంగా రూపొందింది. ఇందులోని మూడు స్టోరీలకు నగేశ్‌ దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ సిరీస్‌ జులై 8 నుంచి ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌కాబోతుంది. ఈ సందర్భంగా నగేశ్‌ మాట్లాడారు.

‘‘నా మాతృభాష తెలుగు వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సిరీస్‌ను ఓ సవాలుగా స్వీకరించి, మనసు పెట్టి తెరకెక్కించా. గొప్ప నటులతో పనిచేయడం కొత్త అనుభూతి పంచింది. ఇక్కడ నేను మరిన్ని కథలు తెరకెక్కించగలననే ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని నగేశ్‌ పేర్కొన్నారు. సుహాసిని- నరేశ్‌ అగస్త్యల ‘వై డిడ్‌ షీ లీవ్‌ మీ దేర్?’, రీతూవర్మ- ఆది పినిశెట్టిల ‘ఫజీ, పర్పుల్‌ అండ్‌ ఫుల్‌ ఆఫ్‌ త్రోన్స్‌’, ‘నిత్య మేనన్‌- రేవతిల ‘నా అన్‌లైక్లీ పాండమిక్‌ పార్టనర్‌’ అనే కథలు నగేశ్‌ దర్శకత్వంలో రూపొందాయి. మిగిలిన మూడు స్టోరీలకు ఉదయ్‌ గుర్రాల, వెంకటేశ్‌ మహా, దేవికా దర్శకులుగా వ్యవహరించారు.

హైదరాబాద్‌లో జన్మించిన నగేశ్‌ ఉన్నత విద్యనభ్యసించేందుకు అట్లాంటా వెళ్లారు. కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో అక్కడే నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. 1998లో స్వీయ నిర్మాణంలో ‘హైదరాబాద్‌ బ్లూస్’ అనే ఆంగ్ల చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. తర్వాత, ‘రాక్‌ఫోర్డ్‌’, ‘బాలీవుడ్‌ కాలింగ్‌’, ‘హైదరాబాద్‌ బ్లూస్‌ 2’, ‘బాంబే టు బ్యాంకాక్‌’ తదితర చిత్రాలు తీశారు. కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో ‘గుడ్‌లక్‌ సఖి’ అనే తెలుగు చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని