Nandini Reddy: దానిపైనే నా కెరీర్‌ ఆధారపడి ఉంది: నందిని రెడ్డి

సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మే 18న ఈ సినిమా విడుదలకానున్న సందర్భంగా నందిని మీడియాతో సంభాషించారు.

Published : 17 May 2023 21:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుటుంబమంతా కలిసి చూడదగ్గ కథలను తెరపైకి తీసుకొస్తూ విజయం అందుకున్న దర్శకురాలు.. నందిని రెడ్డి (Nandini Reddy). ‘అలా మొదలైంది’, ‘జబర్‌దస్త్‌’ ‘కల్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’లతో మెప్పించిన ఆమె ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) చిత్రాన్ని తీసుకొస్తున్నారు. సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan), మాళవిక నాయర్‌ (Malvika Nair) జంటగా తెరకెక్కిన ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నందిని రెడ్డి విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..

విక్టోరియాపురం ప్రపంచం..

కొవిడ్‌కు ముందు రాసుకున్న కథ ఇది. పాండమిక్‌ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారడాన్ని గమనించి.. దానికి తగ్గట్టు ఆ స్టోరీలో కొన్ని మార్పులు చేశా. ఈ సినిమా కోసం ముందుగా పెద్ద హీరోను సంప్రదించానన్నది రూమరే. ఇందులోని హీరో పాత్ర చాలా కూల్‌గా ఉంటుంది. వ్యక్తిగతంగా సంతోష్‌ అలానే ఉంటాడు కాబట్టి ఆ రోల్‌కు సరిపోతాడనిపించి, ఎంపిక చేశా. స్టార్‌ హీరో కోసం కథను మార్చి భారీ బడ్జెట్‌తో తీయడం కుదరదు. సంతోష్‌, హీరోయిన్‌ మాళవిక నాయర్‌తోపాటు ఇతర పాత్రలన్నింటికీ ప్రాధాన్యత ఉంటుంది. విక్టోరియాపురం అనే ఊరికి సంబంధించిన ఈ కథలోని అన్ని పాత్రలను హైలైట్‌ చేయడం ఓ సవాలు అనిపించింది. వేరే ఏ చిత్రంతోనూ ఈ సినిమాకి సంబంధం ఉండదు. తెరపై ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త ప్రపంచాన్ని వారికి చూపించాలని రచయిత షేక్‌ దావూద్‌ విక్టోరియాపురం కాన్సెప్ట్‌ తీసుకొచ్చారు. నాలుగు తరాల కుటుంబం, కోర్టు కేసులు.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.

ఆ నమ్మకంతో ఉన్నా..

నా కెరీర్‌లో ‘ది బెస్ట్‌ క్లైమాక్స్‌’ అనిపించే సినిమా ఇదే. ఈ చిత్రంలోని చివరి 20 నిమిషాల సన్నివేశంపైనే నా కెరీర్‌ ఆధారపడి ఉంది. సెన్సార్‌ సభ్యులు, 30మందికిపైగా నాకు తెలిసిన వారు ఇప్పటికే చిత్రాన్ని చూసి బాగుందన్నారు. ప్రేక్షకులూ అదే చెబుతారనే నమ్మకంతో ఉన్నా. ముఖ్యంగా హీరో పాత్రకు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు.

కథ డిమాండ్‌ మేరకే..

కథ డిమాండ్‌ మేరకే షావుకారు జానకి, గౌతమి, వాసుకి, రాజేంద్రప్రసాద్‌లాంటి ప్రముఖ నటులను తీసుకున్నా. తమ తమ పాత్రల్లో లీనమై నటించారు. కొందరు కొత్తవారు నటించారు. ఇందులో బాల నటులూ ఉన్నారు. హిల్‌ స్టేషన్‌లలో లైఫ్‌ ఎలా ఉంటుంది? వారికి వినోదం ఎలా లభిస్తుంది? అనేదాన్ని తెరపై చూసిన ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. రచయిత లక్ష్మీభూపాల్‌ నా సోదరుడిలాంటివాడు. ఎమోషన్‌ సన్నివేశాలను బాగా రాస్తాడు. మిక్కీ జె. మేయర్‌ అందించిన సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమా మొత్తం పూర్తయ్యాక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు చూపిస్తే సలహాలు ఇచ్చారు. వాటిని పాటించా.

పూరీ జగన్నాథ్‌లా నేను రాయలేను..

దర్శకుడు పూరీ జగన్నాథ్‌లా స్క్రిప్టుని వేగంగా రాయడం నాకు రాదు. అందుకే నా నుంచి సినిమాలు ఆలస్యంగా వస్తున్నాయి. ఇప్పుడు నాకు రైటింగ్‌ టీమ్‌ ఉంది. నా సినిమాలన్నీ పెళ్లి నేపథ్యంలో సాగడం నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. నా తొలి సినిమా ‘అలా మొదలైంది’ నుంచి ‘ఓ బేబీ’ వరకు రిలీజ్‌ రోజున మార్నింగ్‌ షో చూసిన ప్రేక్షకుల సంఖ్య తక్కువే. తర్వాతర్వాత మౌత్‌టాక్‌తో ఆ సంఖ్య పెరిగేది. ‘అన్నీ మంచి శకునములే’ విషయంలోనూ అలా జరగొచ్చు.

తదుపరి ప్రాజెక్టు..

నా తదుపరి చిత్రంలో హీరోగా సిద్దూ జొన్నలగడ్డ ఫిక్స్‌. సమంతను అనుకోలేదు. అదొక విభిన్నమైన కాన్సెప్ట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని