18 Pages: పాన్‌ ఇండియా హీరో అయినా కథను మార్చలేదు: సూర్య ప్రతాప్‌

దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ తన కొత్త చిత్రం ‘18 పేజేస్‌’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. 

Published : 21 Dec 2022 01:37 IST

హైదరాబాద్‌: ‘కరెంట్‌’, ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాలతో యువతను బాగా మెప్పించిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌. కొన్నాళ్ల విరామం అనంతరం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘18 పేజెస్‌’ (18 Pages). నిఖిల్‌ (Nikhil), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama) జంటగా నటించిన చిత్రమిది. సుకుమార్‌ కథ అందించిన ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రతాప్‌ మీడియాతో ముచ్చటించారు.

* ‘కుమారి 21 ఎఫ్‌’ తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చింది?

ప్రతాప్‌: నా తొలి సినిమా ‘కరెంట్‌’ పూర్తయ్యాక దర్శకుడు సుకుమార్‌ బృందంలో రచయితగా చేరాను. ఆ ప్రయాణంలోనే సుకుమార్‌కి ‘కుమారి 21 ఎఫ్‌’ ఆలోచన వచ్చింది. దానికి నేను దర్శకత్వం వహించా. అది పూర్తయ్యాక సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాలకు పనిచేశా. అలా గ్యాప్‌ వచ్చింది.

* ‘18 పేజేస్‌’ ఎలాంటి ప్రేమకథ?

ప్రతాప్‌: ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇందులో ఎమోషన్‌, ఫన్‌, థ్రిల్‌.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలున్నాయి. సినిమా ముగింపు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులకు మంచి అనుభూతితో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. ఈ కథ, అందులోని పాత్రలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. 

* ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ క్రేజ్‌ బాగా పెరిగింది. ఈ కథలో ఏమైనా మార్పులు చేశారా?

ప్రతాప్‌: లేదు. నేను కథను బాగా నమ్ముతా. ‘అన్నింటి కంటే, అందరి కంటే కథే గొప్పది’ అనే దాన్ని సుకుమార్‌ అన్నయ్య నుంచి నేర్చుకున్నా. అయితే, నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి నేను కచ్చితంగా కొన్ని మార్పులు చేయాలి. అలా అని అవి కథపరంగా చేయలేదు. ‘నేను పాన్ ఇండియా నటుణ్ని అయినా ముందు నాకు ఏ కథ చెప్పారో ఆ కథే తియ్యండి’ అని నిఖిల్‌ అంటుండేవాడు.

* ట్రైలర్‌లోనే కథను కొంచెం బయటపెట్టారు కదా. సినిమాపై ఆసక్తి ఉంటుందంటారా?

ప్రతాప్‌: జిలేబి తియ్యగా ఉంటుందని మనకు తెలుసు. అయినా దాన్ని ఆస్వాదిస్తాం. సినిమా విషయంలోనూ అంతే. కథని కొందరు ఊహించవచ్చు. కానీ ఎప్పుడు? ఎక్కడ? ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రయాణం ముఖ్యం.  

* నిర్మాణ సంస్థ గురించి...

ప్రతాప్‌: గీతా ఆర్ట్స్ సంస్థలో పని చేయడాన్ని గౌరవంగా భావించా. ఈ బ్యానర్‌లో వర్క్‌ చేస్తే మంచి గుర్తింపు వస్తుంది. ఏదైనా విషయంలో దర్శకులు కాంప్రమైజ్‌ అయినా నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాసు కాంప్రమైజ్‌ అవరు.

* తదుపరి ప్రాజెక్టుల వివరాలు చెబుతారా?

ప్రతాప్‌: మైత్రీ మూవీ మేకర్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ సంస్థతో వేర్వేరుగా ఎప్పుడో సినిమాలు చేయాల్సి ఉంది. సుకుమార్‌ దగ్గర ఐదు కథలు తీసుకున్నా. వాటిల్లో రెండు అయ్యాయి. మిలిగిన కథలను తెరకెక్కించాలి. నేను రాసిన ఓ స్టోరీకి నిర్మాతల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని