SVP: మహేష్‌ నాకెందుకు అవకాశం ఇచ్చారో త్వరలోనే తెలుస్తుంది : పరశురామ్‌

‘యువత’తో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించి, ‘ఆంజనేయులు’తో నవ్వులు పంచి, ‘సోలో’తో కుటుంబ విలువల గురించి చెప్పి, ‘సారొచ్చారు’, ‘శ్రీరస్తు శుభమస్తు’తో అలరించి, ‘గీత గోవిందం’తో వావ్‌ అనిపించారు పరశురామ్‌. సినిమాసినిమాకు వైవిధ్యాన్ని కోరుకునే ఆయన మహేశ్‌బాబుతో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కించారు.

Published : 06 May 2022 23:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యువత’తో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించి, ‘ఆంజనేయులు’తో నవ్వులు పంచి, ‘సోలో’తో కుటుంబ విలువల గురించి చెప్పి, ‘సారొచ్చారు’, ‘శ్రీరస్తు శుభమస్తు’తో అలరించి, ‘గీత గోవిందం’తో వావ్‌ అనిపించారు పరశురామ్‌. సినిమాసినిమాకు వైవిధ్యాన్ని కోరుకునే ఆయన మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కించారు. బ్యాంకు నేపథ్యంలో సాగే ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..

* ఈ కథ ఎప్పుడు, ఎలా మొదలైంది?

పరశురామ్‌: ‘గీత గోవిందం’ నిర్మాణ దశలోనే ‘సర్కారు వారి..’ చిత్రానికి సంబంధించి ఓ పాయింట్‌ తట్టింది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఆ లైన్‌పై దృష్టి పెట్టా. మహేష్‌బాబును హీరోగా ఊహిస్తూ కథ రాయడం ప్రారంభించా. ఓసారి ఆయన్ను కలిసి స్క్రిప్టు వినిపించా. కథతోపాటు కథానాయకుడి పాత్రను డిజైన్‌ చేసిన విధానం ఆయనకు ఎంతగానో నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్టులో నటించేందుకు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌. మహేష్‌బాబు లుక్స్, నటన మరోస్థాయిలో ఉంటాయి. ‘మీడియం రేంజ్ దర్శకుడికి మహేష్ ఎలా అవకాశం ఇచ్చారు’ అని కొందరు అనుకోవచ్చు. సినిమా విడుదల తరవాత వారి సందేహాలన్నీ తీరతాయి.

* సినిమాలో మహేష్‌ బ్యాంకు ఉద్యోగిగా కనిపిస్తారా?

పరశురామ్‌: రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్‌ మధ్య జరిగే కథే ఈ సినిమా. ఇందులో బ్యాంకు నేపథ్యంలోని సన్నివేశాలుంటాయి కానీ హీరో బ్యాంకు ఉద్యోగి కాదు. అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమాలో ఒక వ్యక్తినిగానీ వ్యవస్థనుగానీ ప్రశ్నించలేదు.

* ఇతర ముఖ్య పాత్రల గురించి చెప్తారా?

పరశురామ్‌: ఇందులో కీర్తి సురేష్ పాత్ర చాలా కీలకం. కథానాయకుడి పాత్రకు సమానంగా ఉంటుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆమె మరోసారి కట్టిపడేస్తుంది. సముద్రఖని ప్రతినాయకుడి పాత్రకు ప్రాణం పోశారు. 

* సంగీత దర్శకుడు గురించి..

పరశురామ్‌: ముందుగా ఈ సినిమా సంగీతం కోసం గోపీ సుందర్‌ను తీసుకోవాలనుకున్నా. ఆయన ఇతర ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు. తర్వాత తమన్‌ను ఎంపిక చేశా. ఈ సినిమా కోసం ఆయన సరికొత్త ధ్వనులను సృష్టించాడు. కథానుసారం పాటలను అద్భుతంగా రూపొందించాడు. మహేశ్‌ తనయ సితారను ప్రమోషన్‌లో భాగంగానే వీడియోలో చూపించాం. సినిమాలో తను కనిపించదు.

* ఈ సినిమాతో ఏదైనా సందేశం ఇవ్వబోతున్నారా?

పరశురామ్‌: సందేశమంటూ ఏం ఉండదు. కానీ ఓ పాయింట్‌ మాత్రం కొందరిలో మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నా. అదేంటన్నది సినిమా చూసి తెలుసువాల్సిందే.

* పాన్ ఇండియా ఆలోచన చేయలేదా?

పరశురామ్‌: లేదండీ. నాకూ మహేష్‌కి ఆ ఆలోచనే లేదు. తెలుగులోనే తీయాలనుకున్నాం. మంచి ఔట్‌పుట్‌ కోసం ఎంత కష్టపడాలో అంత శ్రమించాం.

 

* ‘నేను విన్నాను.. నేనున్నాను’ డైలాగ్ పెట్టేందుకు కారణం?

పరశురామ్‌: నాకు దివంగత రాజశేఖర్‌రెడ్డి అంటే అభిమానం. ఆయన్ను చూస్తే హీరోని చూసినట్టే ఉండేది. ఎలాంటి సందర్భంలో అయితే ఆయన ఆ మాటను వాడారో ఈ సినిమాలో అలాంటి సన్నివేశంలోనే ఈ డైలాగ్‌ వినిపిస్తుంది. వినడానికి చాలా సింపుగా ఉన్నా ఎంతో గొప్ప మాట అది. కథలో భాగంగానే మహేష్‌కు ఈ సంభాషణ గురించి చెప్పా. సినిమాలో పెట్టేందుకు ఆయన ఓకే అన్నారు.

* తదుపరి ఏ హీరోతో చేస్తున్నారు?

పరశురామ్‌: నాగచైతన్య హీరోగా ఓ చిత్రం చేయబోతున్నా. 14 రీల్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని