Hanuman: ‘ఆది పురుష్‌’ ప్రభావం ‘హనుమాన్‌’పై ఉండదు: ప్రశాంత్‌ వర్మ

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ‘హను-మాన్‌’ (Hanuman) గురించి ప్రత్యేక విషయాలు పంచుకున్నారు. 

Published : 28 May 2023 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజువల్స్‌తో వండర్స్‌ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma). కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలోనే ‘హను-మాన్‌’ (Hanuman)తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో రిలీజ్‌ కానుంది. మే 29న ప్రశాంత్‌ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హను-మాన్‌’ విశేషాలను, తన కలల ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘రానున్న కొన్ని సంవత్సరాల్లో  ఎనిమిది మంది సూపర్‌ హీరోస్‌ సినిమాలు తీయనున్నా’ అని ప్రశాంత్‌ వర్మ చెప్పిన విషయాలు మీకోసం..

ప్రేక్షకులంతా ‘హను-మాన్‌’ కోసం ఎదురుచూస్తున్నారు. దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారు?

ప్రశాంత్‌ వర్మ: నేను కూడా ఎదురుచూస్తున్నాను. సినిమా షూటింగ్‌ అంతా పూర్తయింది. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. జూన్‌ చివరకు అవి పూర్తవుతాయి. జులైలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. దీని టీజర్‌కు ఊహించని స్పందన వచ్చింది. అందుకే అనుకున్నదాని కంటే మరికొంత మెరుగ్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఆలస్యమైనా.. అద్భుతమైన అవుట్‌పుట్‌ వస్తుంది. ఒక్కో అంశాన్ని ఒక్కో కంపెనీ వాళ్లు వీఎఫ్‌ఎక్స్‌ చేస్తున్నారు.

కథ రాసుకున్నప్పుడే ఈ స్థాయిలో తీయాలనుకున్నారా? టీజర్‌ రెస్పాన్స్‌ చూశాక ఏమైనా మార్పులు చేశారా?

ప్రశాంత్‌ వర్మ: అసలు అనుకోలేదు. మేము ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఆడియన్స్‌ నుంచి వచ్చిన స్పందనను చూసి ఎప్పటికప్పుడు కథ స్థాయిని పెంచుతూ వెళ్లాం. సినిమా అంతా సిద్ధమయ్యాక ఏదో వెలితిగా అనిపించింది. అప్పుడు ఒక పాత్రను యాడ్‌ చేశాం. ఆ తర్వాత చూస్తే ఆ పాత్ర వల్ల సినిమా 200 శాతం బాగుందనిపించింది. దానికి శ్రీనివాస మూర్తి గారితో డబ్బింగ్‌ చెప్పించాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన మన మధ్యలేరు. ఆయన వాయిస్‌ను ఎవరూ ఇమిటేట్‌ చేయలేక పోతున్నారు.

కథను తీయాలనుకున్నప్పుడే ఇన్ని భాషల్లో విడుదల చేయాలనుకున్నారా?

ప్రశాంత్‌ వర్మ: మొదట తెలుగు వరకు తీయాలనుకున్నాం. టీజర్‌ రిలీజ్‌ చేశాక హిందీలో విడుదల చేయాలని భావించాం. తర్వాత తమిళం, కన్నడ భాషల్లో వచ్చిన స్పందన చూసి అక్కడ కూడా రిలీజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

‘ఆదిపురుష్‌’  కంటే ‘హను-మాన్‌’ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌లు బాగున్నాయని నెటిజన్లు అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

ప్రశాంత్‌ వర్మ: వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌కు చాలా సమయం పడుతుంది. అలా సమయం తీసుకుని చేస్తే ప్రతి సన్నివేశం చక్కగా వస్తుంది. తాజాగా ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌పై ప్రశంసలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం సమయం. టైమ్‌ తీసుకుని చేశారు కాబట్టే ట్రైలర్‌ బాగా వచ్చింది.

‘హను-మాన్‌’ కథ ఏంటి?

ప్రశాంత్‌ వర్మ: హనుమంతుడి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథను రాశాం. మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి హనుమంతుడిని చూడాలని కలలు కన్నాం. వాళ్లకు కచ్చితంగా ఆయన్ని చూపిస్తాను. కేవలం హనుమంతుడి పాత్ర కోసం సంవత్సరం పని చేశాను. అందుకే ఆ పాత్ర అద్భుతంగా వచ్చింది. ఎంత పెద్ద సినిమా అయినా కొన్నింటి మీద సాహసాలు చేయకూడదని నా అభిప్రాయం. అమ్మ ప్రేమ, దేవుడు.. ఇలాంటివి చాలా సున్నితమైన విషయాలు వాటిపై సాహసాలు చేయకూడదని నేననుకుంటాను.

సూపర్‌ హీరో కథ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది?

ప్రశాంత్‌ వర్మ: ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు. వాళ్లంత అన్నీ జోనర్లలో మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎవరూ ఇప్పటి వరకు తీయని జోనర్లో సినిమా చేయాలని నాకు ఆలోచన వచ్చింది. మన అందరికీ చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరోస్‌ అంటే చాలా ఇష్టం.  అందుకే ఈ కథ తీయాలనుకున్నాను. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ చూసిన ప్రతి ఒక్కరు.. తనకు పవర్స్‌ వస్తే బావుంటుంది అనే ఆసక్తితో చూస్తారు. ఆ హీరోకి పవర్స్‌ వచ్చాక ఏం చేస్తాడన్నది కథ.

‘ఆదిపురుష్‌’ తర్వాత మీ సినిమా రానుంది. దాని ప్రభావం మీ చిత్రంపై పడుతుందనుకుంటున్నారా?

ప్రశాంత్‌ వర్మ: మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ‘ఆదిపురుష్‌’ (Adipurush) లేదు. అయినా ఒక సినిమా ప్రభావం మరోదానిపై పడుతుందని నేను అనుకోను. సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నాం. మా సినిమాకు మొదటి నుంచి కూడా మేము అనుకున్నదాని కంటే 10 రెట్లు ఎక్కువ స్పందన వస్తోంది. దానికి తగట్లుగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని కచ్చితంగా నమ్ముతున్నాం.

ఇలాంటి సినిమాలకు వివాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

ప్రశాంత్‌ వర్మ: హనుమంతుడికి తన బలం తెలీదని అంటారు. అలాగే మా సినిమా కూడా మొదట చాలా తక్కువ బడ్జెట్‌తో తీయాలని అనుకున్నాం. కానీ ఆయన లాగా మా బడ్జెట్‌ కూడా పెరుగుతూ పోయింది. నేను ఈ సినిమా కథను చాలామందికి వివరించాను. పెద్ద వాళ్లందరికీ కథ చెప్పాను. వాళ్లందరూ ఎలాంటి వివాదం లేదన్న తర్వాతే మొదలు పెట్టాను. 

ఈ పాత్రను తేజా సజ్జా (Teja Sajja)నే ఎంపిక చేయడానికి కారణమేంటి?

ప్రశాంత్‌ వర్మ: ఒక సాధారణ హీరోకు పవర్స్‌ వచ్చి అందరినీ కొడుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అదే స్టార్‌ హీరో.. గతంలో చాలామందితో ఫైట్‌ చేసిన హీరోకు పవర్స్‌ వస్తే పెద్దగా ప్రభావం ఉండదు. ‘జాంబీరెడ్డి’తో తేజా యూత్‌కు బాగా దగ్గరయ్యాడు. అందుకే తనను ఎంపిక చేశాను. తన పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. దీని కోసం తను చాలా సినిమాలను వదులుకున్నాడు. ఈ సినిమాలో చాలామంది నటులు కీలక పాత్రల్లో నటించారు. వినయ్‌రాయ్‌ సూపర్‌ ఒమెన్‌ పాత్రలో కనిపించనుంది. అలాగే వరలక్ష్మి, రాజదీపక్‌ శెట్టి వీళ్లతో పాటు ఓ పెద్ద నటుడు ఉన్నారు. త్వరలోనే ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తాం. నేను ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఎమోషన్‌ లేదని కొందరు చెప్పారు. ‘హను-మాన్‌’లో అది కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా. నేను తీసిన ‘జాంబీరెడ్డి’ పిల్లలకు తెగ నచ్చేసింది. వాళ్ల తల్లిదండ్రులు ఫోన్‌ చేసి నన్ను తిట్టారు. వాళ్లకు ‘హను-మాన్‌’ వచ్చే వరకు వెయిట్‌ చేయండి. మీ పిల్లలంతా జైహనుమాన్‌ అంటారు అని చెప్పా.

తర్వాత ప్రాజెక్ట్‌ బాలకృష్ణతో చేస్తున్నారట నిజమేనా..?

ప్రశాంత్‌ వర్మ: నెక్ట్స్‌ కాదు కానీ, మా ఇద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా వస్తుంది. ఇప్పటి వరకు చూడని బాలకృష్ణను అందులో చూస్తారు. హనుమాన్‌ తర్వాత ‘అధీర’ చేయనున్నా. ‘హను-మాన్‌’కు ‘అధీర’కు దగ్గరి సంబంధం ఉంటుంది. ‘అధీర’ ఇంద్రుడి స్టోరీ. నాకు ‘స్క్రిప్ట్స్‌ విల్‌’ అని ఓ కంపెనీ ఉంది. అందులో నాకు వచ్చిన ఐడియాలను రచయితలు డెవలప్‌ చేస్తుంటారు. ప్రస్తుతం 10 స్క్రిప్ట్స్‌ మీద వర్క్‌ చేస్తున్నారు. ‘జాంబీరెడ్డి2’ లాంటి ప్రాజెక్ట్స్‌ లైన్‌అప్‌లో ఉన్నాయి. సమయం కుదరడం లేదు.

ఈ సినిమా విదేశీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేస్తారా?

ప్రశాంత్‌ వర్మ: ఆ విషయం ఇంకా చర్చల్లోనే ఉంది. చైనా, జపాన్‌లలో కూడా విడుదల చేస్తున్నాం. అయితే ఒకేసారి చేయాలా.. లేదా.. అని ఆలోచిస్తున్నాం. ఈ విషయంపై ఇటీవల రాజమౌళిని కలిశాను. ఒకేసారి విడుదల చేయాలంటే ప్రమోషన్స్‌కు టైమ్‌ సరిపోదు అన్నారు. నెల తర్వాత విడుదల చేయమని సలహా ఇచ్చారు. ‘హను-మాన్‌’ ట్రైలర్‌ విడుదలయ్యాక రాజమౌళిని కలిశాను. ఆయన కొన్ని సలహాలిచ్చారు. అవి ఈ సినిమాకు చాలా ప్లస్‌ అయ్యాయి.

మీ స్టూడియో గురించి ఎప్పుడు చెబుతారు?

ప్రశాంత్‌ వర్మ: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) అని ఒక స్టూడియో ప్రారంభించనున్నా.  రానున్న కొన్ని సంవత్సరాల్లో 8 మంది సూపర్‌ హీరోస్‌ సినిమాలు తీయనున్నా. దీనిపై వర్క్‌ కూడా మొదలుపెట్టాను. కొత్తవాళ్లకు, ప్రతిభవంతులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. సినిమా అంటే ఆసక్తి ఉన్న 100 మందితో టీమ్‌ను ఏర్పాటుచేస్తాను. నా పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నా. భవిష్యత్తులో మన సూపర్‌ హీరోస్‌ సినిమాలు వస్తున్నాయంటే ‘స్పెడర్‌మ్యాన్‌’ కూడా ఆగిపోవాలి. అలాంటి సినిమాలు తీయలన్నది నా కల. ఇప్పటికే రాజమౌళి (Rajamouli) గారు భారతీయ సినిమాను గొప్ప స్థానంలో ఉంచారు. ఆయన వేసిన బాటలో మేమంతా వెళ్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని